అమ్మ కోసం (కథ):- ...గంగశ్రీ-9676305949

    లక్ష్మి దేవి పల్లి గ్రామంలో లక్ష్మణ్ అనే అబ్బాయి తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. సమయం చిక్కినప్పుడల్లా తల్లిదండ్రులకు సాయం చేస్తుండేవాడు. ఆ సంవత్సరం మామిడి కాయలు బాగా కాసాయి. లక్ష్మణ్ వాళ్లకు నాలుగు పండ్ల చెట్లు కలవు. వాళ్ళ నాన్న తెంపితే వాళ్ళమ్మ ఊర్లో అమ్మకానికి తీసుకెళ్ళేది. కానీ ఆ గ్రామంలో చాలామందికి మామిడి చెట్లు ఉండడంవల్ల ఎంతకు అమ్ముడుపోయేవి కాదు. ఒకవేళ అడపా దడపా అమ్మినా ఇరుగుపొరుగువారు, తెలిసినవారే కొనడంతో అరవై రూపాయలకు కిలో ఉన్న పండ్లను ముప్పై రూపాయలకే, కొందరైతే పిల్లల కోసమని ఉచితంగా తీసుకెళ్లేవారు. ఇవ్వనంటే నిష్ఠూరాల ప్రవచనం వినిపించేవారు. పది కిలోలమ్మితే పట్టుమని రెండు వందల రూపాయలు కూడా వచ్చేవి కాదు.
           "దీనికన్నా కూలి పనికి పోతే నాలుగు వందల రూపాయలు వచ్చేవి, పైగా అమ్మిన పళ్ళు మిగిలేవి!" అనుకుంటూ ఇంట్లోకి వచ్చింది  అమ్మ. ఎండన పడి రావడంతో అలసిపోయి వడ్ల బస్తామీద కూర్చొని,
"కొన్ని సల్లటి నీళ్లు తేరాఅంది" అలసటతో. చెంబెడు నీళ్లు గటగటా తాగి,
"అబ్బా! పానం గిప్పుడు సల్ల వడ్డదిరా"
"ఏమైందమ్మా!" ఖాళీ చెంబు తీసుకుంటూ అడిగాడు లక్ష్మణ్. లక్ష్మణ్ కు జరిగిన సంగతి చెప్పింది అమ్మ.
అమ్మ: "లక్ష్మణ్, ఈ పండ్లమ్ముడు ఇగ నానుంచి కాదుబిడ్డా, బ్యారకాల్లకు అమ్ముమని బాపుతో చెప్పు,
నేనింత తిని పడుకుంటా" అంది.
లక్ష్మణ్: "బ్యారకాల్లకు అమ్మితే మనకేం మిగుల్తదమ్మా, వాళ్ళు వందకి కొని వెయ్యికి అమ్ముతరు."
అమ్మ: "మరేం చేద్దాం!, ఎండలో తిరిగితే నా పానం పోతుంది; నానుంచైతలేదు రా!"
లక్ష్మణ్: "నువ్వైతే తిని పడుకో, ఏదో ఒకటి చేద్దాం" అన్నాడు. ఈటీవీలో జబర్దస్త్ షో చూసుకుంటూ. కాసేపటికి బ్రేక్ రావడంతో టీవీని మ్యూట్లో పెట్టి, అలసిపోయిన అమ్మని చూసి ఆలోచనల పడ్డాడు లక్ష్మణ్.
            సాయంకాలం ఎండ తగ్గగానే ఇంటెన్క నుండి తన సైకిల్ ని బయటకు తీసి చూస్తే ఎండకు గాలిపోయిన టైర్లు వెక్కిరించినవి!. సైకిల్ ని శుభ్రంగా తుడిచి కిష్టన్న సైకిల్ షాపుకి వెళ్లి గాలి కొట్టిస్తే, ముందు పయ్య  బాగానే ఉన్నా, వెనుకది పంచరైంది.
"పది రూపాయలైతది" అన్నాడు కిష్టన్న
"రేపిస్తానన్నా"
"ఉద్దర లేదురా"
"అబ్బా! ప్లీజ్ అన్నా, రేపు కచ్చితంగా ఇస్తా అన్న." లక్ష్మణ్ మాటలు నమ్మకంగా తోచడంతో పంచర్ వేసి ఇచ్చాడు కిష్టన్న.
             ఉదయం 6 గంటలకు లేచి 10 కిలోల పళ్ళు గంపలో వేసుకుని, క్యారెల్ కు కట్టుకొని నారాయణ రావు పేటకు అమ్మకానికి వెళ్ళాడు. అక్కడ అందరు అరవైకి అమ్మితే, లక్ష్మణ్ యాభై రూపాయలకే లాక్ డౌన్ సమయం ముగిసే సరికి పదింటికల్లా అమ్మి దారిలో కిష్టన్నకు డబ్బలిచ్చి, చిరునవ్వుతో ఇంటికొచ్చాడు. లక్ష్మణ్ వచ్చేసరికి వాళ్ళమ్మ టమాటా కోడిగుడ్ల కూర వండి సిద్ధంగా ఉంచింది. ఆకలి మీదున్న లక్ష్మణ్ రెండింతలు లాగించాడు ఆవురావురుమంటూ!.