*శ్రీ కృష్ణ శతకము* - పద్యం (౯౯ - 99)

 కందము :
*అందెలు పాదములందున*
*సుందరముగ నుంచినావు | సొంపలరంగా*
*మందరధర ముని సన్నుత*
*నందుని వరపుత్ర నిన్ను | నమ్ముతి కృష్ణా !* 
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా....
మందరము అనే పర్వతాన్ని ఎత్తిన వాడవు.  నందరాజుకు ముద్దుల కొడుకువు.  అందం ఒలికేలాగా నీ పాదాలకు అందెలు, కాలి పట్టీలు ధరించిన వాడవు.  ఇటువంటి నిన్ను, మునులు, యోగులు, యక్షులు అనేక రీతుల పూజిస్తారు. అటువంటి నీవు నిన్నే నమ్మి వున్న నన్ను, దయతో  కాపాడు తండ్రీ ...అని శతకకారుడు నృసింహ కవి వాక్కు.
*"చందన చర్చిత నీల కళేబర*
*పీతవసన వనమాలీ!*
*కేళిచలన్మణికుండల మండిత*
*దండయుగ స్మిత శాఈ!*
*హరిరిహ ముగ్ధవధూనికరే*
*విలాసిని విలసతి కేళిబరే" - నిన్ను ఈ విధంగా చూచాడు భక్త జయదేవుడు.  ఎంత అందమయ్యా నీది. ఎలా వర్ణిస్తే మా తనివి తీరుతుంది. తలపై పింఛమా, పెదవులపై చెరుగని చిరునవ్వా, చేతిలో వయ్యారా లొలుకుతూ జగత్తును సమ్మోహ పరచే వేణువు, నెమ్మేనిపై దగద్ధగాయమానంగా శోభిల్లే రత్న మణి మాణిక్యాలు పొదిగిన ఆభరణాలు , పట్టు పీతాంబరాలు, ఆజాను బాహువైన రూపము, చక్కని అందెలతో పాదాలు, వీటన్నిటినీ తీసికట్టు అంటూ, కస్తూరి తిలకము, కౌస్తభ మణి హారము. ఆహా! ఆ చూసే కన్నులదే కదా సంతోషమంతా.  ఇంతటి ఆనందకారకమైన రూపంవున్న నిన్నే నమ్ముకున్నాను. నీ స్ఫురణ నేను వదలకుండా వుండేటట్లు నన్ను రక్షించుతూ, నన్ను కాపాడు తండ్రీ.*
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss