నమ్మక ద్రోహం:---సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, ధర్మపురి. మొబైల్: 9908554535.

  రంగాపురానికి చెందిన చలమయ్య కు అత్యవసరంగా పొరుగు గ్రామానికి వెళ్లే పని తగిలింది. నడిచి వెళితే చాలా ఆలస్యం అవుతుంది. పైగా అనుకున్న సమయానికి తను చేరలేడు. కనుక ఏదైనా గుర్రపు బండి బండి దొరకకపోదా! అని ఆలోచించాడు. కానీ ఒక్క గుర్రపు బండి కూడా సమయానికి అక్కడ లేదు. అందువల్ల చేసేదిలేక  మండుటెండలో మిట్టమధ్యాహ్నం కాలినడకన బయల్దేరాడు.
          ఇంతలో అకస్మాత్తుగా వెనుక గుర్రపు బండి  అలికిడి వినిపించింది. తీరా చూస్తే అది శంకరం బండి. వాడికి తను అంటే  అసలే గిట్టదు. పైగా వాడు తనను చూస్తే ఆపమన్నా ఆపడు. కానీ విచిత్రంగా  శంకరం తన బండిని ఆపి తాను పొరుగు గ్రామానికి వెళుతున్నానని,బండిని ఎక్కమని  అడిగాడు. 'అమ్మయ్యా ' అంటూ చలమయ్య  శంకరం బండిలో ఎక్కాడు .శంకరం తనకు దేవునివలె కనిపించి అతనికి కృతజ్ఞతలు కూడా తెలిపాడు  .ఈ లోపుగా శరవేగంగా తన మిత్రుడైన కనకయ్య తన బండిని ఆపి చలమయ్యను ఎక్కమని  బ్రతిమిలాడాడు. కానీ  శంకరం ఏమి  అనుకుంటాడేమోనని చలమయ్య అతని అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించాడు. దానితో కనకయ్య బండి శరవేగంగా ముందుకు సాగి మాయమైంది. ఇంతలో శంకరం బండి ఒక చెరుకు తోట వద్దకు చేరింది.
         శంకరం బండిని ఆపి చెరుకుగడ విరుచుకోవడానికి వెళ్ళాడు .అరగంట సమయం గడిచింది. అయినా శంకరం ఇంకా   రానేలేదు .తాను కనకయ్య బండెక్కినా బాగుండేదని చలమయ్య అనుకున్నాడు. ఇలా అనుకున్నదే తడవుగా శంకరం వచ్చాడు. కానీ బండిని ఎక్కకుండా నింపాదిగా చెరుకు గడను కొరికి తిన సాగాడు. ఇక ఉండబట్టలేక చలమయ్య శంకరాన్ని త్వరగా పోనివ్వమని బ్రతిమిలాడాడు. శంకరం  ఒక నవ్వు నవ్వి  "నీకు బండి ఆపడమే ఎక్కువ. పైగా నీవు చెప్పినట్లు నేను వినాలా ! నా ఇష్టం వచ్చినప్పుడు పోతాను .లేదా పోను. కావాలనే  నేను ఇక్కడ బండిని ఆపాను. అంతేకాదు. నీ మిత్రుడు కనకయ్య బండి వస్తున్నదని తెలిసే నేను దాని ముందు  నా బండి కట్టి తీసుకొని వచ్చాను . నీకు కనకయ్య బండి దొరకకుండా చేద్దామన్న దురాలోచనతోనే నేను ఈ పని చేశాను తప్పా  నీ మీద ప్రేమతో కాదు .నీకు పని ఉంటే నడిచి వెళ్ళు" అని అన్నాడు. శంకరం బండి ఎక్కడం  తనదే బుద్ధి తక్కువని తిట్టుకున్న  చలమయ్య క్రిందకు దిగి మండుటెండలో నడవసాగాడు. శంకరం చలమయ్య ను చూస్తూ అదేపనిగా  నవ్వ సాగాడు. చలమయ్య తాను ఎలాగూ  సమయానికి చేరుకోలేనని భావించి దేవుని సహాయం కొరకు ప్రార్థించాడు. కొద్దిసేపటికే తన వెనుక నుండి అతనికి బంధువు అయిన ధర్మయ్య బండి అనుకోకుండా ఈ మార్గం లో  వచ్చింది. అందులో ఎక్కిన చలమయ్య ఎప్పటికీ శంకరం లాంటి నమ్మక ద్రోహులను నమ్మకూడదని నిశ్చయించుకొని దేవుడికో దండం పెట్టాడు. దూరం నుంచి ఇది చూసిన శంకరం అవాక్కయ్యాడు.అందుకే నమ్మకద్రోహం చేసేవారిని నమ్మకూడదు.