అసలు కారణం:--సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, ధర్మపురి.మొబైల్: 9908554535.


 రత్నపురి గ్రామంలో పేరుమోసిన ఒక గజదొంగ రాజభటులకు దొరికిపోయాడు .అతడిని రాజభటులు  సంకెళ్ళు వేసి తీసుకొని పోతున్నారు.  అప్పుడే అక్కడకు వచ్చిన దానయ్య ఈ దృశ్యాన్ని చూసి విపరీతంగా ఏడవసాగాడు .జనం గుమిగూడి  అతనిని ఓదార్చ సాగారు .బహుశా గజదొంగ అతడికి మిత్రువో  లేదా  బంధువో అయి ఉంటాడని అందరూ ఊహించుకున్నారు. చివరికి ఆ జనం లోని ఒక   వ్యక్తి "ఏమయ్యా! ఎందుకు అంతగా ఏడుస్తున్నావ్ ?అతడు చేసింది తప్పు కాబట్టే రాజభటులు అలా పట్టుకుని వెళుతున్నారు . నీవు సంతోషించాలి కానీ ఏడవడం దేనికి "?అని అన్నాడు .అప్పుడు అతడు  మళ్ళీ బిగ్గరగా ఏడవసాగాడు. చివరికి జనం సముదాయించే సరికి ఊరుకున్న దానయ్య అతడు తనకు ఏమీ కాడని చెప్పేసరికి అందరూ ఆశ్చర్యపోయారు ."మరి ఎందుకు ఏడుస్తున్నావు" అని కొందరు అడిగారు." నా ఏడుపుకు కారణం ఉంది .అతడు గొప్ప గజదొంగ. నా భార్య పుట్టింటి వారు చాలా ధనవంతులు .నాకు నా భార్య మీద కోపం ఉంది. ఆమెకు పుట్టింటిపై  అభిమానం ఎక్కువ. అందువల్ల ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళ ఇంట్లో అతడు దొంగతనం చేస్తాడని , వారికి తగిన శాస్తి అవుతుందని, నేను నా భార్యతో ఒక వెయ్యి రూపాయల పందెం కట్టాను .ఇప్పుడు ఆ  అవకాశం లేకుండా పోయిందని నాకు దుఃఖం వచ్చింది" అని అన్నాడు." ఓస్ ఇంతేనా!" అన్నారు అక్కడున్న వారు .  "అంతేకాదు .నా భార్యతో నేను కట్టిన పందెం లో   ఒక వెయ్యి రూపాయలు  పోగొట్టుకోవాల్సి వచ్చిందని నాకు ఏడుపు వచ్చింది" అని అన్నాడు .అప్పుడు అక్కడున్న వారు  "అతడు జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా ఆ అవకాశం ఉంది కదా "అని వారు  అన్నారు . "లేదండీ ! అతడు తన భార్యా పిల్లల మీద ఇంకెప్పుడూ దొంగతనం చేయనని ఒట్టు పెట్టుకున్నాడు .భార్యా పిల్లల మీద ఒట్టు పెట్టుకున్నవ్యక్తి  మళ్లీ దొంగతనం చేయాలంటే మాటలా! అయినా ఇంకొకసారి నా భార్య నాతో  పందెం  కడుతుందా ! మీరే చెప్పండి .ఇక ఇంకొక సంగతి ఏమిటంటే పొగరుబోతు అయిన నా భార్యకు తగిన శాస్తి కాలేదు. పైగా  నేను వెయ్యి రూపాయలు గెలవక పోగా పందెంలో పోగొట్టుకున్నాను. అందుకే ఆ గజదొంగను చూడగానే నాకు పట్టరాని దుఃఖం వచ్చింది "అని అన్నాడు. ఆ మాటలకు అందరూ  ముక్కు మీద వేలు వేసుకున్నారు  .అందుకే ఒక్కొక్కసారి  మనం అనుకున్నవి జరగనే జరగవు.