కప్ప ఉపాయం:--సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,ధర్మపురి . మొబైల్: 9908554535.
  ఒక చెరువులో ఒక కప్ప ఉండేది .ఆ చెరువు ఒడ్డునే ఉన్న  ఒక చెట్టు క్రింద పుట్టలో ఒక పాము ఉండేది .ఆ పాముకు ఈ కప్పను తినాలని ఎన్నాళ్ల నుంచో కోరికగా  ఉండేది. కానీ ఇది కనిపెట్టిన కప్ప నీటి నుండి బయటకు రాలేదు. పాముకు ఈత రాదు.
         ఒకరోజు పాము-కప్ప తో నీకు మంచి మంచి పురుగులు ఒడ్డు పైన ఉన్నాయి. వచ్చి తిను. నేను నీకు ఏమీ కీడు  చేయను లే "అని అంది. అప్పుడు కప్ప  "ఆహా! నిన్ను నేను నమ్ముతానా! నన్ను పట్టుకుని తినెందుకే   నీవు చూస్తున్నావు .నేను బయటకు రాను" అని అంది .తన ఆటలు సాగక పోయేసరికి పాము చాలా  బాధపడింది.
        ఇలా రోజు పాము పిలవడం,  కప్ప రాను అనడం జరుగుతున్నది . ఒకరోజు కప్పకు నీటిలో ఏమి తినడానికి దొరకలేదు. అప్పుడు పాము పుట్టలో ఉంది. వెంటనే కప్ప  ఒడ్డుపైకి వచ్చి  రెండు పురుగులను పట్టుకుని పరుగెత్తుకొని వెళ్ళింది .ఇలా రోజు అది పురుగులను పట్టుకొని వెళ్లి తింటూ నీటిలోనే ఉంటున్నది.చాటుగా  అది కనిపెట్టిన పాము ఒకరోజు కప్పను పట్టుకుంది.
           కప్ప వెంటనే" అయ్యో! నీవు నన్ను పట్టుకొని ఎంతపని చేశావు? నాకు దివ్య శక్తులు ఉన్నాయి. నన్ను పట్టుకన్న  పాము ఒకటి నాకున్న  శక్తుల వల్ల చనిపోయింది. కావాలంటే నీకు చూపిస్తాను పద" అని అంది. పాము దాని మాటలు నమ్మి  అది చెప్పిన చోటుకు తీసుకుని వెళ్ళింది. అక్కడ  నిజంగా ఒక పాము చనిపోయి చీమలు పట్టి ఉంది .వెంటనే పాము కు భయం వేసి ఆ కప్పను వదిలిపెట్టింది. కప్ప సంతోషించి వెంటనే పారిపోయి నీటిలో దూకి తప్పించుకుంది. తర్వాత దాని మాటలు నమ్మి మోసపోయిన పాము చాలా బాధపడింది.
       ఒక రోజు పాము ఏమరుపాటుగా ఉన్న సమయంలో దానిని ఒక ముంగీస పట్టుకుంది. పాము ముంగీసతో  కప్ప  తనను మోసగించినట్లు చెప్పినట్టుగానే అదికూడా" నాకు చాలా దివ్యశక్తులు ఉన్నాయి. నీవు నన్ను పట్టుకుంటే నా దివ్య శక్తుల వల్ల చనిపోతావు. కావాలంటే నీకు ముంగీస కళేబరాన్ని చూపిస్తాను పద" అని అంది .దాని మాటలు నమ్మని ముంగీస "నీ దివ్య శక్తులు నన్ను ఏమి చేయవు. నాకు కప్ప నీనుండి ఎలా తప్పించుకుందో   చెప్పింది. అయినా నీవు నాకు ఆ ముంగీస కళేబరాన్ని  చూపుతానన్నావు  పద . దానిని చూపిస్తే నేనూ నమ్ముతా "అని  దానిని వదలిపెట్టకుండా తీసుకొని వెళ్ళింది. పాము ఆ కళేబరాన్ని చూపలేకపోయింది .అప్పుడు ముంగీస" నీ తెలివితేటలు నా దగ్గరనా! నీవు కప్పను  అనుకరించ బోయావు .నిజానిజాలు తెలియకుండా అనుకరించడం చాలా తప్పు. నీవు తెలివిలేని దానవు కాబట్టే  దాని మాటలు నమ్మావు.  నేను అలాంటి దాన్ని కాను"  అని పామును  పట్టుకుని వెళ్ళింది .
           నీటిలోని ఒక కప్పనే ఈ పాము పట్టుకున్న కప్పకు దూరంగా ఒక పాము చనిపోయి ఉండటం గమనించి ఈ సంగతిని  చెప్పిందని పాపం   పాముకు తెలియదు. అంతేకాదు అదే ఈ ఉపాయాన్ని ముందు జాగ్రత్తగా కప్పకు చెప్పిందని కూడా పాము కు తెలియదు.
        అందుకే తెలివి హీనులు ఇతరులను అనుకరిస్తే  ఆపదలలో చిక్కుకుంటారు.