రత్నగిరి గ్రామానికి చెందిన కనకయ్య చాలా పేదవాడు . అతనికి ఉన్న ఆస్తి ఒకే ఒక్క గుర్రం. ఆ గుర్రం అంటే అతనికి ప్రాణం.
ఒకరోజు పొరుగు గ్రామానికి కనకయ్య గుర్రంపై బయలుదేరాడు. దారిలో పెద్ద అడవి వచ్చింది .అతనికి చాలా దాహం వేసి గుర్రాన్ని వదిలి మంచినీటికై కొద్దిదూరం వెళ్ళాడు .నీటిని త్రాగి వచ్చేసరికి అక్కడ గుర్రం లేదు. దానికి బదులుగా ఒక గాడిద ఉన్నది. అంటే తన గుర్రం ఎవరో తీసుకొని వెళ్లారని భావించాడు కనకయ్య . "అయ్యో! ఉన్న ఒక్క గుర్రం పోయిందే! ఈ గాడిద దమ్మిడీ కూడా వెల చేయదే" అని అనుకుంటూ చేసేదేమీలేక ఆ గాడిదను తోలుకుంటూ పొరుగు గ్రామానికి బయలుదేరాడు.
దారిలో ఒక వ్యక్తి తన బట్టలమూట మోయలేక చాలా అవస్థ పడుతున్నాడు . అతడు కనకయ్యతో " నా బట్టల మూట మీ గాడిదపై వేసుకుంటాను " అని అన్నాడు. అందుకు ప్రతిఫలంగా కనకయ్య ఆ వ్యక్తిని తనకు కొంత డబ్బును ఇవ్వమన్నాడు . తన దగ్గర డబ్బు లేదనీ , కానీ తాను గాడిద గురించి కొన్ని మంచి విషయాలు చెబుతానని అన్నాడు ఆ వ్యక్తి. అందుకు సమ్మతించిన కనకయ్య అతని బట్టల మూటను తన గాడిదపై ఉంచాడు. గాడిద ఉపయోగాల గురించి ఆ వ్యక్తి కనకయ్యకు చెప్పాడు. తర్వాత కనకయ్య తన గాడిదను తోలుకుంటూ పొరుగు గ్రామానికి చేరాడు.
ఆ గ్రామంలో ఒక ధనవంతుడు చాలా దగ్గు,దమ్ముతో బాధపడుతున్నాడు .అతడిని పరీక్షించిన వైద్యుడు గాడిద పాలు తాగితే తప్ప జబ్బు నయం కాదని చెప్పాడు .కానీ విచిత్రం ఏమిటంటే ఆ గ్రామంలో ఒక్క గాడిద కూడా లేదు .అతడు గాడిద పాల కొరకై పొరుగు గ్రామానికి ఒక సేవకుని పంపగా అతనికి కనకయ్య గాడిద ఎదురుగా కనిపించింది. ఆ సేవకుడు ఇది చూచి కనకయ్య దగ్గరకు వచ్చి తన యజమానికి గాడిద పాలు కావాలని అడిగాడు. కనకయ్య అలాగే అని చెప్పి అందుకు ప్రతిఫలంగా తనకు కొంత డబ్బు చెల్లించాలని అన్నాడు. అందుకు సేవకుడు తన యజమానిని అడిగి తప్పకుండా మీరు కోరినంత డబ్బును ఇప్పిస్తాననీ , తనను నమ్మమని అన్నాడు. అతడు ఒప్పుకోవడంతో అతని వెంబడి కనకయ్య గాడిదతో పాటు వెళ్లి పాలుపోసి అందుకు ప్రతిఫలంగా అతడు ఎక్కువ మొత్తంలో డబ్బును సంపాదించాడు .
ఆ డబ్బులు సంచీలో ఉంచుకొని అతడు మరో గ్రామానికి వెళ్ళాడు. అక్కడ రైతులు తమ పంట అంతా వీధుల్లో ఆరబెట్టడానికి కుప్పలు కుప్పలుగా పోశారు. కనకయ్య గాడిద చేసే వింత చేష్టలు చూసి కొద్దిసేపట్లో అక్కడ వర్షం పడుతుందని వారికి తెలిపాడు . కానీ అతని మాటలు ఆ రైతులు నమ్మలేదు. అప్పుడు కనకయ్య ఆ గ్రామాధికారికి ఈ విషయం చెప్పి తాను అబద్ధం చెప్పడం లేదనీ , ఈ సాయంత్రానికల్లా వర్షం పడుతుందని తెలిపాడు .గ్రామాధికారి ఈ మాటలను నమ్మి రైతులు కూడా తమ తమ ధాన్యాన్ని సురక్షిత ప్రదేశానికి తరలించాలని తెలిపాడు. అతని ఆదేశాల ప్రకారం ఆ రైతులు తమ తమ ధాన్యాన్ని అక్కడినుంచి తరలించారు. ఆ సాయంత్రానికి కనకయ్య చెప్పినట్లే కుండపోతగా వర్షం కురిసింది రైతుల ధాన్యం కాపాడినందుకు కనకయ్యకు గ్రామాధికారి అతడు కోరినంత డబ్బు ఇచ్చి ఘనంగా సన్మానం చేశాడు.
అక్కడ నుండి బయలు దేరిన కనకయ్య ఆ డబ్బుతో మరొక గుర్రం కొనుక్కున్నాడు .కానీ తన దరిద్రాన్ని పారద్రోలిన ఆ గాడిదను మాత్రం అమ్మ లేదు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి