నెరవేరిన కోరిక:-సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,ధర్మపురి.మొబైల్: 9908554535.

  సోమయ్య తనకు తెల్లవారి జ్వరం తగ్గితే తమకున్న ఒకే ఒక్క కుక్కపిల్లను అమ్మగా వచ్చిన డబ్బు హుండీలో వేస్తానని దేవునికి మొక్కుకున్నాడు. అతడు మొక్కినట్లే  ఒక్క రోజుకే అతని జ్వరం తగ్గింది. అతడు కుక్కపిల్లను అమ్మి వేస్తానని కుటుంబ సభ్యులకు చెప్పాడు .దానికి వారు అభ్యంతరం తెలిపారు .అప్పుడు సోమయ్య" నా కుక్క పిల్ల  .నా ఇష్టం.  నేను దేవునికి మొక్కాను.ఖచ్చితంగా అమ్ముతాను" అని పట్టుపట్టాడు .అప్పుడు సోమయ్య కుమారుడు కుటుంబ సభ్యులందరినీ వారించి సోమయ్యతో రేపు కుక్కపిల్లను అంగడిలో  అమ్మమని చెప్పాడు .
         మరునాడు సోమయ్య కుక్కపిల్లను అంగడిలో నాలుగు వందల రూపాయలకు అమ్మి ఆ డబ్బును హుండీలో వేశాడు. తన మొక్కు  తీరినందుకు సంతోషించిన సోమయ్య తిరిగి ఇంటికి వచ్చాడు. అతడు వచ్చిన కాసేపటికే అతని కొడుకు ఒక కుక్కపిల్లతో వచ్చాడు. అది సోమయ్య కుక్కపిల్లనే.  సోమయ్య  " ఈ కుక్క పిల్లను ఇంతకుముందే అంగడిలో నాలుగు వందల రూపాయలకు అమ్మేశాను గదరా! ఇది నీకు ఎలా దొరికింది" అని అడిగాడు.అప్పుడు  సోమయ్య కొడుకు  "నా మిత్రుడు నాకు కుక్కపిల్ల ఇష్టమని దీనిని కొని ఉచితంగా నాకు ఇచ్చాడు. ఇది నీవు అమ్మిన కుక్కపిల్ల అని అతనికి తెలియదు " "అని అన్నాడు .ఆ మాటలకు సోమయ్య ఎంతో సంతోషించాడు.
          కానీ జరిగింది ఏమిటంటే సోమయ్య కుమారుని సలహా తోనే అతని  మిత్రుడే ఈ కుక్క పిల్లను డబ్బు పెట్టి  కొన్నాడని , ఆ డబ్బును సోమయ్య కొడుకే ఇచ్చాడని సోమయ్యకు తెలియదు. మొత్తానికి కుక్కపిల్ల ఇంటికి రావడంతో  సోమయ్య కోరిక, అతని కుటుంబసభ్యుల కోరికలు వారు అనుకున్నట్లుగా నెరవేరాయి.