గాడిద:--- సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,ధర్మపురి. మొబైల్: 9908554635.

  కౌశాంబి రాజైన మాధవసేనునికి జంతువులంటే అమితమైన ప్రేమ. అందరూ జంతువులను ప్రేమించాలని, పెంపుడు జంతువులను పెంచాలని ఆయన ప్రజలను ఆదేశించాడు.
            ఒకనాడు నిండుసభలో ఎవరికి ఏ జంతువు ఇష్టమో తెలుపవలసిందిగా తమ ఆస్థానంలోని వారిని రాజు  కోరాడు .ఒకరు  సింహం అనీ, మరొకరు  పెద్దపులి అని ,ఇంకొకరు ఏనుగు అనీ  తమకు ఇష్టమైన జంతువుల పేర్లు అన్నింటిని చెప్పారు. కానీ  ఒక్కరు కూడా గాడిద పేరు చెప్పలేదు .
         అందరికన్నా చివరగా ఉన్న ఉమాకాంతుడు అనే పండితునికి ఏది చెప్పడానికి మిగలలేదు. అప్పుడు అతడు విధిలేని పరిస్థితిలో ''గాడిద" అని అన్నాడు. అందరూ ఆ మాట విని  నవ్వారు. అప్పుడు రాజు "ఎందుకలా నవ్వుతారు.గాడిద కూడా జంతువే"అని అన్నాడు. " మహారాజా! గాడిదలు మాత్రమే గాడిదను కోరుకుంటాయి "అని అన్నాడు ఒక దుడుకు పండితుడు.
           వెంటనే ఉమాకాంతుడు "అవును మహారాజా! ఈ గాడిదను చూసే మిగిలిన గాడిదలు కూడా నవ్వాయి "అని  తనను వ్రేలుతో  చూపించాడు. ఆ మాటలకు రాజుతో పాటు  అందరూ నవ్వారు. అప్పుడు మరొక పండితుడు లేచి  "ఉమాకాంతులవారికి  గాడిద అంటే చాలా ఇష్టమని తెలిసింది .వారికి గాడిదల భాష తెలుసు. అందుకే వారు వాటితో మాట్లాడుతారని అనుకుంటాను "అని అన్నాడు .
          వెంటనే ఉమాకాంతుడు" అవును . గాడిదలు గాడిదలతోనే మాట్లాడతాయి. ఈ గాడిద భాష తెలిసిన గాడిదలు కూడా నాలాంటి గాడిదలతో  మాట్లాడుతాయి" అని అన్నాడు. ఆ పండితుడు తాను కూడా గాడిదగా అవమానింపబడినందులకు  తలదించుకున్నాడు.
          అందుకే ఇతరులను అవమానించాలని చూస్తే వారే అవమానింపబడతారు.