గజల్:-సముద్రాల శ్రీదేవి-9949837743

చిరునవ్వులు విరబూసిన
మధుమాసం  మనకోసం
మరుమల్లెలు వెదజల్లిన
దరహాసం మనకోసం

అహర్నిశము  జాలువారు
వెన్నెలసొన  నిశీధిలో
ఆహరహమున  కురుస్తున్న
దివి హాసం  మనకోసం

నింగిముగ్ధ  ముస్తాబై
ఉదయ బొట్టు పెట్టుకుంటు
ఎదురుచూపు వలపు తలపు
శృతిహాసం.    మనకోసం

చుక్కలన్ని  పక్కుమంటు
ఆకాశం  హరివిల్లుగ
ఎడద పిలుపు  వింటి నారి
విధుహాసం మనకోసం

ఇసుకతిన్నె   పెదవులపై
చుంబించిన అలలఝరులు
గుసగుసలై   నిట్టూర్పుల
స్వరహాసం   మనకోసం

అందమైన వనసీమల
కులుకు చిలుక  పలుకులలో
మిసమిసలను కనిపించే
సుమ హాసం మనకోసం

ఇద్దరిలో  దాచుకున్న
మధురోహల  పొందికలో
మదిమురిసిన బంధమైన
వరహాసం మనకోసం

ఊహలన్ని బాసలైన 
మూగమనసు ఊయలలో
 ప్రేమనంత చుంబించే
స్తవ హాసం మనకోసం

శ్రీదేవికి లోకమంత     వలపులతోనిండి పోగ
 జంటగాను జిలుగుచిందు 
రవిహాసం మనకోసం