గురు బోధ :-కంచనపల్లి ద్వారకనాథ్--చరవాణి:9985295605

                                                            
                 శ్రీక్షేత్రపురంలో  సకలశాస్త్రాలు తెలిసిన శ్రీముఖుడు అనే పండితుడు ఆశ్రమం స్థాపించి శిష్యులకు విద్యతో పాటు సకల శాస్త్రాలు బోధిoచేవాడు . 
     శిష్యులలోకల్ల   తెలివైనవాడుగా గురువుగారి మన్ననలు అందుకున్న ప్రియ  శిష్యుడైన    శివదత్తుడు విద్యతో పాటు సకలశాస్త్రాలు  నేర్చుకుని  విద్యాభ్యాసం ముగియడంతో గురువుగారి వద్ద సెలవు తీసుకుంటూ నమస్కరించి  వినయంగా “గురువుగారు నాకు మీరు  విద్యను  బోధించి విజ్ఞానవంతుని  చేశారు . మీ రుణం తీర్చుకోవడానికి మీకు గురు దక్షిణ   ఏమి ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాను” అన్నాడు  .
     శ్రీముఖుడు చిన్నగా నవ్వి “ నీవు నా వద్ద విద్యను అభ్యశించినందుకు  నాకు ఎలాంటి గురు దక్షిణ ఇవ్వనవసరం లేదు నేను నీకు నేర్పిన సకల శాస్త్ర విద్యకు సరైన న్యాయం  చేస్తే చాలు “ అన్నాడు . 
“  అలాగే గురువు గారు “ .. అని  కృతజ్ఞతలు తెలిపి  సెలవు తీసుకుని  వెళుతున్నప్పుడు దారిలో ఒక ఆలోచన తట్టింది . అన్నీ శాస్త్రాలు ,విద్యలు గురువుగారి వద్ద   నేర్చాను కానీ .. నేను అందరి శిష్యులలోకెల్ల      ప్రత్యేకంగా ఏదైనా  సాధించి గురువు గారికి చూపించాలి అని ఒక అడవి ప్రాంతానికి వెళ్ళి  ప్రశాంతమైన    ప్రదేశం  లోకూర్చుని  రెండేళ్ళుపాటు  తపస్సు  చేయగా  తపస్సుకు   మెచ్చి పరమేశ్వరుడు   ప్రత్యక్షమై    ఏమి వరం కావాలో  కోరుకోమన్నాడు .
      శివదత్తుడు  పరమేశ్వరుని  చూసి పరవశుడై నమస్కరించి  “ స్వామి నాకు గాలిలో ఎగిరే శక్తి ని యివ్వు అన్నాడు . “ పరమేశ్వరుడు   సంతోషం తో   “ తథాస్తు” అని     అంతర్దానమై నాడు.
        శివదత్తుడు ఆనందంతో గాలిలో కాసేపు ఎగిరి  తన గురువుగారికి తాను సాధించిన విద్యను చూపిం చాలని  బయలుదేరాడు .  శ్రీముఖుడు శిష్యులకు విద్యాబోధన చేస్తున్న సమయంలో గాలిలో ఎగురుతూ వచ్చి నేలపై  దిగి గురువు గారికి నమస్కరించాడు. గురువు గారు శివదత్తుని చూసి “ నీవు గాలిలో ఎగరడం ఎలా నేర్చుకున్నావు “ అని ప్రశ్నిoచాడు 
శివదత్తుడు తాను చేసిన తపస్సును పరమేశ్వరుని వద్ద తాను ,పొందిన వరాన్ని గూర్చి చెప్పాడు .    శ్రీముఖుడు “ శివదత్తా ఈ గాలిలో ప్రాయాణించే  విద్యను    నేర్చుకుని  ఏమి  సాధిస్తావు ? “ అని  అడిగాడు . 
 “ గురువర్యా .. నేను ఈ విద్యతో భూమండలం లోని అన్నీ పుణ్య క్షేత్రాలు దర్శించి పుణ్యం సంపాదిస్తాను .  అని చెప్పగా గురువు చిన్నగానవ్వి “ నీ ఆలోచన బాగుంది . కానీ  ఒకటి  గుర్తుంచుకో నీవు నేర్చిన  విద్య ,సకల  శాస్త్రాల విజ్ఞానం   వృద్దాగా అయిపోతాయి .  ఎందుకంటే నీ స్వార్థంతో నీవు ఒక్కడివే పుణ్యం  సంపాది౦చు  కోవాలనుకున్నావు .   నీలా పూర్వం రామానుజా చార్యులవారు తాను గురువుగారి దగ్గర నేర్చు కున్న ‘ఓం నమోనారాయణ’  మంత్రాన్నితను ఒక్కడే   మోక్షానికి పోవాలని తలచక  ప్రజలందరికి మోక్ష  ప్రాప్తి  సులభ  మార్గంలో  కలగాలని గుడి పైకి ఎక్కి  గొంతెత్తి   అరచి చెప్పాడు . మొదట గురువు  కోపగించుకున్న తర్వాత   శిష్యుని  ఔన్నత్యాన్ని గుర్తించి నీ పేరు చిరస్థాయిగా ఈ భూమండలంపై నిలిచి పోతుంది అని ఆశీర్వదించాడు . తెలుసా ? అలాగే నీవు నేర్చిన విద్యను పది మందికి పంచడం వల్ల  నీ జ్ఞానం  పెరగడమేకాక విద్యాదానం  వల్ల  నీవు పుణ్యలోకాలకు  వెళుతావు .   పదిమoదికి బతుకు తెరువు చూపించిన వాడు గా  నిన్ను గౌరవిస్తారు. అదే నీవు నాకు ఇచ్చే గురు దక్షిణ “  అన్నాడు . 
    గురువుగారి మాటల విన్న శివదత్తుడు   తన ఆజ్ఞానాని కి సిగ్గుపడి  వినయంగా  నమస్కరించి గురువర్యా ..అర్థమైంది ఈ గాలిలో ఎగిరే  విద్యాతోనే అన్నీ  ప్రదేశాలు తిరిగి    విద్యను   బోధిస్తాను  .    ఈ గాలిలో ఎగిరే విద్యను పరమేశ్వరుడు ప్రసాది౦చింనందులకు దీన్ని వరప్రసాదం అని  బావిస్తాను “ అంటూ  గురువుకి    కృతజ్ఞతలు తెలిపి గాలిలో ఎగురుతూ వెళ్లిపోయాడు ..