ఇకనైనా మారవా(కైతికాలు)--మంజుశ్రీ సిరికొండ
తరువుల తనువులను 
తెగ నరికిన ఫలితం 
గాలి నీరు నేల 
సర్వం కలుషితం 
బహుదూరమౌతుంది 
భావితరాలకు పచ్చదనం 

పచ్చని చెట్టు మొదలుకు 
గొడ్డలినెక్కు పెట్టావు 
నిలువున ప్రాణం తీసి 
మోడుగ నిలబెట్టావు 
పచ్చని చెట్టు తోడనే 
నీ పయనమని మరచావు 

నీవొదిలిన గాలి పీల్చి 
ప్రాణవాయువు తిరిగిచ్చు
ప్రాణదాతల నరుకుట 
నీ మెడకదే  ఉచ్చు 
కలనయినా నీ తీరు మానవా 
ఇకనయినా మేలుకోవా మానవా 

చెట్టు నరుకుకుంటు నీవు 
పెట్టుకున్నావు చిచ్చు 
జీవరాసుల మెడలకు 
బిగిసె కనబడని ఉచ్చు 
నేలకొరుగు చెట్ల తోడుగ
మనిషి అడుగు మరణానికేగా 

తానున్న కొమ్మను 
తెగ నరుకుకొనడము 
మెడకు తాడు కట్టుకుని 
చెట్టుని పడగొట్టడము 
తన అరచేతిని తలపై 
పెట్టుకున్న భస్మాసురుని చందము