ఒంటరి చీమకు ఒంటి నిండా తిప్పలే (బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼ దార్ల బుజ్జిబాబు.

        ఓ రోజు పెద్ద వాన పడింది. 
       చీమల పుట్ట పగిలింది. 
       గండు చీమలు చెల్లా చెదురుగా అటూ ఇటూ పోయాయి.
      ఓ చీమకు మిడిసిపాటు ఎక్కువ. 
       ఈ చీమ తోటి చీమలతో కలవకుండా ఇష్టం వచ్చినట్లు తిరుగుతుంది.
       రోడ్డుమీదకెక్కి రొమ్మెత్తుకు నిలబడింది. 
       ఇంతలో ఓ సైకిల్ సర్రునా వెళ్ళిపోయింది.
      వెంట్రుక వాసిలో ప్రమాదం తప్పింది. 
      గుండె దడదడ కొట్టుకుంది.
       అప్పటికి కూడా తోటి చీమలతో కలువకుండా ఒంటిరిగానే తిరుగుతుంది. 
      ఇంట్లో పాకుతున్న ఓ పసిపాప ప్రక్కగా పోతుంది ఆ చీమ.
      ఆ పాప అదేమిటో అనుకొంది. 
      పట్టుకుని నోట్లో పెట్టుకోబోయింది. 
      చీమకు పై ప్రాణాలు పైనే పోయాయి.   
      ఇంతలో ఆపాప తల్లి చూసింది.
      పరుగున వచ్చి చేతిలో చీమను బయటకు విసిరేసింది.
      'బతుకు జీవుడా' అనుకుంటూ చీమ ఒక్క ఉదుటున బయట పడింది. 
      బయట ఒకటే వాన. 
      ఆ వాన నీటిలో ముద్దముద్దగా తడిసింది.
      కాలువలో కొట్టుకుపోయింది. 
      తోటి చీమలతో కలసి ఉంటే నాకీ గతి ఉండదుకదా! అనుకుంది. 
       ఇంతలో ఆ కాలువలో పిల్లలేసిన కాగితం పడవ కనిపించింది.
       దాని మీద ఎక్కి కూర్చుంది. 
       పడవ ఒడ్డున చేరింది. 
       చీమ ఒక్క ఉదుటున దూకింది.
       తమ దండును వెదుక్కుంటూ వెళ్ళింది.
       వాటితో కలసిపోయింది. 
       ఇంకెప్పుడు ఒంటిరిగా ఉండకూడదు అనుకుని రెండు చెంపలు వేసుకుంది.