బుజ్జి మేక తెలివి : --పండుగాయల సుమలత.గొట్లూరు.-కర్నూలు(జిల్లా)

 ఒక ఊరిలో కొన్ని గొర్రెలు మందగా ఉండేవి.వాటిని యజమాని మేతకోసం ఒక అడవి ప్రాంతానికి తీసుకెళ్లేవాడు.ఆ గొర్రెల మందలో ఒక చిన్న మేకపిల్ల ఉండేది.అది యజమాని ఎంత చెబుతున్నా వినకుండా ప్రకృతి అందాలను చూస్తూ,లేత ఆకులను తింటూ అలా అడవిలోపలికి వెళ్లిపోయింది బుజ్జి మేక.యజమాని ఎంత వెతికినా బుజ్జి మేక కనబడలేదు.అందుకు నిరాశతో, ఉన్న  గొర్రెలను తీసుకొని ఇంటి దారి పట్టాడు.
అడవి లోపలికి వెళ్ళిన బుజ్జి మేక ఒంటరిగా తిరుగుతూ గంతులు వేస్తూంది.అదే సమయంలో బుజ్జి మేకకు గుహ కనిపించింది. అది సింహం గుహ అని బుజ్జి మేకకు తెలియదు.అది చీకటి పడే సమయం.బయట ఉంటె ప్రమాదమని గ్రహించి విశ్రాంతి కోసం గుహలోపలికి వెళ్లింది బుజ్జి మేక.కొద్ది సేపటికి సింహం గర్జిస్తూ తన గుహకు వచ్చింది.ఆ అరుపులను వింటూనే బుజ్జి మేక ఉలిక్కిపడి లేచింది.
"అమ్మో,! ఇది సింహం గుహా ? నన్ను చూసిందంటే చంపి నమిలేస్తుంది" అని భయపడింది. కాని ఒకసారి యజమాని ఒక మాట చెప్పాడు.సింహాలు చచ్చిపోయిన జంతువులను తినవు అని. ఆ మాటలు బుజ్జి మేకకు గుర్తుకొచ్చాయి.ఇక సింహం గుహలోకి వచ్చే సమయానికి బుజ్జి మేక చనిపోయినట్టు నటించింది.సింహం మేకపిల్లను చూసి ఇది చచ్చింది.దీన్ని నేను తిననని బుజ్జి మేకను గుహ బయిటకు ఈడ్చింది. అలా ఉపాయంతో ప్రాణాలు కాపాడుకున్న బుజ్జి మేక 'ఇకపై యజమాని చెప్పిన మాటలనే వింటాను మందను వదిలి బయటికి రాను" అని పరుగున అడవిదాటి, ఊరిలో వున్న యజమాని ఇంటికి వెళ్ళింది.