పూలభావాలు:- సత్యవాణి
పూలు రోధిస్తున్నాయి

తల్లి వడిలో వొదిగి ఉండనీయక
అంగళ్ళలో పెట్టి తమను అమ్ముతున్నందుకు
పూలు రోధిస్తున్నాయి

అందాన్ని ఆస్వాదించలేని
అనర్హుని మెడలో హారమైనందుకు 
పూలు రోధిస్తున్నాయి

మా సౌకుమార్యాన్ని గుర్తించలేని 
కళ్ళున్న కబోది చేతిలో పుష్పగుఛ్ఛంగా మారి నిర్లక్ష్యంగ విసరివేయబడుతున్నందుకు
పూలు రోదిస్తున్నాయి

రోజులతరబడి నిలువచేయబడి మాగి కుళ్ళిన మృతదేహాలపై అలంకరించి నందుకు
పూలు రోదిస్తున్నాయి

నామకులం  అనుకునే
అనమకుని
అరికాళ్ళ క్రింద పడి
నలిగి నశించి పోతున్నందుకు
పూలు రోధిస్తున్నాయి

తమరక్తం పిండిన ఆ నెత్తురును
అత్తరులుగా పూసుకుని
వుత్తినే గాలి తిరుగుళ్ళుతిరిగే 
గందోళీగాళ్ళ పాలబడినందుకు
పూలు రోధిస్తున్నాయి

తమను బోలిన తరుణులు గూడా
తమపట్ల జాలీ కరుణా చూపక
సూదులతో గ్రుచ్చిచంపి ముచ్చట మడులలో ముడుచుకొని మురిసిపోతున్నందుకు 
పూలు రోధిస్తున్నాయి

పూలు మురిసిపోతున్నాయి
వాటి మొఖాలు మెరిసిపోతున్నాయి
పూలు ఆనందంతో మురిసి పోతున్నాయి

పరమేశ్వరుని పాదాల చెంత
పది నిముషాలు తాము ప్రణమిల్లినందుకు
పూలు సంతోషంతో పరవశించిపోతున్నాయి
పరిమళాలు వెదజల్లుతున్నాయి

పూలు గర్వపడుతున్నాయి
భరతమాత సేవలో
తనువులర్పించి అమరులైన
భారత సైనికుల 
గుండెల పై స్థానం పొందినందుకు
పూలు గర్వపడుతున్నానయి
తమ జన్మసార్థక మైనదని
గర్వంతో ఉప్పొంగి పోతున్నాయి