*అంతర్మథనం!*:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.
1.విననివాడికి శబ్దం!
   తిననివాడికి అన్నం!
   అననివాడికి మంత్రం!
   ఎడారిని పడ్డ జలం!
2.గాజుముక్కలేరుకునేవాడికి,
            రత్నాలవిలువ?
   పాషాణహృదయులకు,
            ప్రేమపావురాలేల?
  స్పందన లేని వాళ్ళకు,
        విశ్వమోహినులేల?
3.ఎంత దురాశ నీకు!
   దుర్మార్గాల మధ్య ఉన్నావే!
   శిశువు అడవిలో ఆక్రందన!
   ఎవరైనా వెళతారా!
  కాసేపైనా కాస్త ఎత్తుకుంటారా!
 ఒక్కసారైనా హత్తుకుంటారా!
   మూర్ఖుల సామ్రాజ్యం లో,
        మునులకు చోటేమిటి?
   బొమ్మల్లా బతికేవారికి,
       బ్రహ్మవిద్యాబోధనేమిటి?
   మృతుల్లాఉండి పోయేవారికి
      అమృత సాధనేమిటి?
4.నేడు వ్యక్తి సమాజ అంశా!
    వాడే సమాజం!
    వాడిమాటే శాసనం!
    అహంకారం నిజస్వభావం!
5.వాడు నీ మాట వినడని,
                   విచారమేల?
వినేవారినిశోధించు,వినిపించు,
  వారినిముందుకు నడిపించు,
అంతర్వాణి ఆలకించు,
*పదండి ముందుకు!*
కలిసిరాని కౌరవులెందకు?
పనికి వచ్చే పాండవులతో,
        *కదులుముందుకు!*
6.సారథి చెప్పినా,
     రథి వినడం ఆ యుగం!
   పరమాత్ముడే చెప్పినా,
    ఈ యుగాన ఈ పార్థులు,
     వింటారా అన్నది సందేహం!
7.అందుకే,
    నదిలా ప్రవహించు,
      దాహార్తులకు ఉపశమనం!
   వెన్నెలవై విస్తరించు,
    రసహృదయులపారవశ్యం!
  ఊరికిఉపకారివై జీవించు,
       జన్మధన్యం కావించు!


కామెంట్‌లు