శ్రమంలోనే నిధి (బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼ దార్ల బుజ్జిబాబు

   రామాపురంలో రాజయ్య, రంగయ్య ఉండేవారు. వారు మంచి మిత్రులు. కాకుంటే ఇద్దరి దారులు వేరు. రాజయ్య కష్టపడి సంపాదించాలి అంటాడు. రంగయ్య మాత్రం అప్పలంగా వస్తే తినాలి అంటాడు. రాజయ్య ఊరి చివరి పోరంబోకు భూమిని బాగు చేసుకున్నాడు. ఆకుకూరలు, కూరగాయలు పండించాడు. పట్నంలో అమ్మి బాగా సంపాదించుకుంటున్నాడు. పొట్ట తిప్పలకు రాజయ్య పడే పాట్లు చూసి  నవ్వుకునేవాడు రంగయ్య. ఏనాటికైనా  తాను పెద్ద ధనవంతుడు అవుతాడని ఆశ ఉండేది రంగయ్యకు. "కొడితే ఏనుగు కుంభస్థలమే కొట్టాలి. చిన్న చిన్న చిట్టెలుకలు ఎందుకు?"  అనుకునేవాడు.  నిధుల వేటలో పడ్డాడు. ఓ బృందాన్ని తయారు చేసాడు. పురాతన దేవాలయాలకు రాత్రివేళ్లలో వెళ్లి  త్రవ్వించేవాడు.  ఇలా చాలా గుళ్ళు త్రవ్వారు. నిధులేమి దొరకలేదు. కానీ చాలా ఖర్చు అయింది.  ఉన్న మూడెకరాల పొలం నిధుల వేటకే అమ్మాడు.  సర్వం పోగొట్టుకున్నాడు.  బికారిగా మారాడు. చేతికష్టం నమ్ముకున్న రాజయ్య మాత్రం తాను బాగుచేసుకున్న రెండెకరాల భూమికి ప్రభుత్వ పట్టా పుట్టించుకుని సొంతదారుడు అయ్యాడు. సమాజంలో గౌరవంగా బ్రతుకుతున్నాడు.