పంజరాన చిలుకలు(కైతికాలు: --రమేశ్ గోస్కుల-కైతికాల రూపకర్త.
దూసుకెళ్ళు రాకెట్ కు
మేఘాలొక లెక్కనా
సాగి పోవు గాలులను
కొండ కోన లాపునా
ప్రయత్నించగా మనిషి
ఫలితమెవ్వరాపును

పంజరాన చిలకల్లా
సమాజ నిశీధుల్లా
ఎదుగు బొదుగు మరచి
చదువు చాటు పులుగుల్లా
బంధీలైన పిల్లలు
మిగిల్చే కడుపు కోతలు

అందరి చేతిలో దూరి
అందర్నీ ఉరికించి
గాయాలు దాచుకొని
గాలి చుట్టి పులకించి
ఎగిరి దూకు బంతి
అందరి ఆనందం నెంచి

ఒయ్యారం ఒలుక పోసి
బంగారం ధరలు చూపు
నచ్చినట్టు చూశావో
నిండ ముంచి సాగ నంపు
వారేవ్వా వ్యాపారం
నేడు కనులకు కనికట్టు

దేశమంత వనరులు
దేహమంత కనరులు
పనిచేయర బిడ్డంటే
పండి లేవ బరువులు
వారేవ్వా బతుకులు
పల్లేరుల స్పర్శలు

పేదలు పన్నులు కడితే
పెద్దలు గుత్తేదారులు
పనులు పూర్తి కాకుండా
సొమ్ము మారును చేతులు
అవునవును నిజమే
కాకుల గొట్టి గద్దల కేయుట.