ప్రకృతి‌ విలయం(వచనకవిత)--డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.

 జోరుగాలి,సముద్రంలో అల్లకల్లోలం
జడివాన విడవకుండా పడుతుంది.
ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు
అదే పనిగా రోజుల తరబడి వర్షం.
విరిగిపడుతున్న కొబ్బరిచెట్లు,ఈతచెట్లు,
లేచిపోతున్న పైకప్పులు,
కూలుతున్న గోడలు,
కొట్టుకుపోతున్న‌ గుడిసెలు,
నీరంతా ఊళ్ళను చుట్టుముట్టి
ముంచేస్తుంటే,
చుట్టూ నీరున్నా తాగలేని దుర్భరపరిస్థితి.
ప్రకృతికి కోపమొచ్చి కకావికలు చేస్తుంటే,
చేష్టలుడిగిన మానవాళి చిత్తరువులా మారింది.
విసురుతున్న తీవ్రగాలులకు
భయవిహ్వలమైన,
పశుజాలమంతా ప్రాణాలు నైవేద్యంగా పెడుతున్నాయి.
చెట్లకొమ్మలు ‌విరిగిపడి ప్రాణాలు హరీమంటుంటే,
కరెంటు లేక చీకటిలో జీవనపోరాటం.
కొంప-గూడు కళ్ళముందే నాశనమవుతుంటే,
భూమితల్లిని నమ్ముకున్న బడుగుబతుకులు
అతలాకుతలమవుతుంటే,
ఎడతెరిపి లేని వాన ఏడిపిస్తుంది.
అంతకంతకు పెరుగుతున్న సముద్రనీటిమట్టాలు,
చేపలవేటకు వెళ్ళిన తమ వాళ్ళ రాక కోసం, 
ఎదురుచూస్తున్న కుటుంబసభ్యులు.
వాగులు,వంకలు,చెలమలు,కుంటలు ఏకమై,
నీరంతా నిండా ముంచేస్తుంటే,
దిక్కుతోచని ప్రజల హాహాకారాలు దేవుడికే తెలుసు
ఆస్తినష్టం,ప్రాణనష్టాలు మిగిలిన చేదు జ్ఞాపకాలై,
లంకలు,పల్లెలు ఆనవాళ్ళు కోల్పోయి,
అయినవాళ్ళను పోగొట్టుకున్న వారి ఆక్రందనలు మిన్నుముట్టుతుంటే,
ఆకాశం మౌనసాక్షిగా చూస్తుంది.

కామెంట్‌లు