ఆ మందు మహిమ ..!?:-- -------శ్యామ్ కుమార్ , నిజామాబాద్ .
 ప్రకృతి సిద్ధంగా బాల్యం నుంచి యవ్వనం లోకి అడుగు పెడుతున్నప్పుడు  , అమ్మాయిలు- అబ్బాయిలు, మారిపోతుంటారు. వారి ఆలోచనలు, తెలివితేటలు , ప్రవర్తన క్రమంగా మార్పులకు  గురి అవుతుంటాయి. ఇందులో ముఖ్యంగా,మావయసుగల, మాతో ఆడుకున్న అమ్మాయిలు మార్పుకి తొందరగా లోనయ్యారు. దాన్ని మనం పరిపక్వత అంటామేమో! . ఈ నేపద్యంలో, మాతో స్నేహంగా ఆడుకుంటున్న అమ్మాయిలని మేము ప్రత్యర్థులుగా భావించడం మొదలైంది. వారేమో మమ్మల్ని తెలివితక్కువ   దద్దమ్మల లాగా , అమాయకుల లాగా చూడటం మొదలుపెట్టేవారు.
 మేము అప్పుడు తొమ్మిదో తరగతి లోకి ప్రవేశించాం. ఒకరోజు 'అన్వర్ జహాన్ 'అని మాతో ఆడుకునే అమ్మాయి వచ్చి  "ఆ శర్మ గాడు నన్ను అదోలా చూస్తున్నాడు ! నేను  మీతో ఆడను."  అంది.  "చ చ .ఏం మాట్లాడుతున్నావ్? బుద్ధి లేకుండా!" అని తిట్టి     " వాడు చాలా మంచివాడు ,అలాంటిదేం లేదు" అని ఊరుకున్నాను. నిజంగానే శర్మ అమాయకుడు, మంచివాడు కూడా !.నా కంటే దాదాపు ఒక పది అంగులాలు,పొడవు గా ఉండేవాడు.  వాడిని  ఈ విషయం అడుగుతే "అసలు ఏం  అనుకుంటోంది నా గురించి ?మూతి పళ్ళు రాలగొడతా  ఆమెవి" అన్నాడు. అలాంటిదేమీ జరగలేదు ,మళ్ళీ మామూలుగానే మేము ఆడుకోవడం మొదలు పెట్టాం.
 మా జట్టులో చిన్నప్పట్నుంచి ఆడుకుంటున్న 'నూర్జహాన్ 'ను ,మా కరుణాకర్  కు ఇచ్చి వివాహం జరిపించాలని వాళ్ళ అమ్మగారు అయిన మా హెడ్ మిస్సెస్, కర్ణాకర్ అమ్మ తోటి నవ్వులాటగా  అనటం మొదలు పెట్టింది. దీంతో మేమందరం కరుణాకర్ ని" ఒరేయ్ ,వీడు హెడ్ మిస్సెస్ అల్లుడు!!" అని ఆట పట్టించటం  మొదలుపెట్టాం. అయితే ఇక్కడ నూర్జహాన్ మా  కంటే ఒక తరగతి పెద్ద.  నా కు ధర్మసందేహం మొదలైంది .నేను ఒకటవ తరగతి నుంచి నూర్జహాన్ తో ఆడుకుంటున్నాను, కర్ణాకర్  వచ్చి రెండు సంవత్సరాలు అయింది అంతే. మరి అటువంటప్పుడు వాడి కంటే అందంగా ఉన్న నన్ను అల్లుడు గా భావించాలి కదా మరి అలా ఎందుకు జరగట్లేదు?. పోనీ వాడినే చేసుకోనీ,అనుకున్నా. 
 తొమ్మిదవ తరగతి నుంచి కూడా కర్ణాకర్ డాక్టర్ అవుతా అని చెప్పేవాడు. వాడు నిజంగానే డాక్టర్ అయ్యాడు, తర్వాత.   మా తరగతిలోకి మా జట్టులోకి కర్ణాకర్ ఆరో క్లాసులో ప్రవేశించాడు. మంచి రంగుతో నిగ నిగ లాడుతూ బొద్దుగా ఉండేవాడు. చిన్న కళ్ళు, కోటేరు ముక్కు తో ఆకర్షణీయంగా కనిపించే వాడు.  అప్పటివరకు క్లాసులో నేనే అన్నిట ఫస్ట్.  నేనే లీడర్ ను. కాని వాడు వచ్చిన తర్వాత నాకు గట్టి ప్రత్యర్థిగా కనిపించాడు. మొదట్లో అన్నిట్లో పోట్లాడుకునే వాళ్ళం. కానీ కాలం గడిచే కొద్దీ మేము ఇద్దరం ప్రియమైన స్నేహితుల్లా గా మారిపోయాము . ఎంత ప్రాణమిత్రులు  లాగా  అయిపోయాముఅంటే,  దాదాపు 12 సంవత్సరాల తర్వాత   నా పెళ్లి లో సగం పనులన్నీ    వాడే చేశాడు.  అయితే వాడు నూర్జహాన్ ను  పెళ్లి చేసుకోలేదు,   ఎం బి బి ఎస్ చదువుతున్నప్పుడు తన క్లాస్మేట్ ని చేసుకున్నాడు.
     పక్కనున్న పల్లెటూరి నుంచి చదువుకోవడానికి పదవ తరగతిలో మా ఇంటికి వచ్చిన,   సత్తయ్య అనే 18 సంవత్సరాల   అబ్బాయి ఉండేవాడు. చదువులో పరమ మొద్దు.   8వ తరగతి చదువుతున్న నేను, పదవ తరగతిలో ఉన్న సత్తయ్య కు ఇంగ్లీషు -హిందీ ,వగైరా చెప్పేవాడిని. మా ఇంట్లోనే ఉండేవాడు కనుక అన్ని విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. ఒకసారి ఇంటి వెనుక వైపు తీసుకువెళ్లి అక్కడి నుంచి కాస్త దూరంగా కనిపించే బంగ్లా  చూపించి, అందులో దాబా మీద కూర్చుని  ఉన్న ఒక 'అమ్మాయి  'తనను ఇష్ట పడుతుందని చెప్పాడు.  నాకు  ఆ అమ్మాయి తెలుసు. అమ్మాయి పేరు అంజలి. పదవ తరగతి ఫెయిల్ అయి ఇంట్లో కూర్చుని ఉంది.  సత్తయ్య మా ఇంటి వెనకాల ఉన్నంతసేపు అమ్మాయి డాబా మీద కూర్చుని ఉండేది. అప్పుడప్పుడు మా ఇంటి వెనకాల ఉన్న నూర్జహాన్ ఇంటికి వచ్చి కూర్చునేది. మా సత్తయ్య చాలా ఉత్సాహంగా వెళ్లి  మాటలు కలపటానికి ప్రయత్నించేవాడు. కానీ అమ్మాయి ఏమి సమాధానం చెప్పేదికాదు, మాట్లాడలేదనితర్వాత తెలిసింది.   ఒకరోజు సత్తయ్య వాళ్ళ ఊరు నుంచి రాగానే నన్ను తన రూమ్ లోకి పిలిచి చాలా అర్జెంట్ గా పని ఉంది, నీకు ఒక రహస్యం చెప్పాలి అన్నాడు.అది ఏంటంటే, వాళ్ల పల్లెటూరి నుంచి ఒక మందు తీసుకొని వచ్చాడు. అది ఎవరు తింటే వారు తన మాట వింటారని ,తనను  ప్రేమిస్తారు   అని  చెప్పాడు. దాన్ని ఒక మంత్రగాడు ఇచ్చాడట . నా కెందు కో అసలు ఆ మందు మీద నమ్మకం కుదరలేదు.  మిఠాయి దుకాణం నుంచి గులాబ్ జాములు తెచ్చి, వాటి మీద పోసి అవి అమ్మాయి తీసుకుపోయి ఇవ్వమని నన్ను బతిమాలాడాడు. నేను కూడా ధైర్యం చేసి పోనీలే పాపం ,అని తీసుకుపోయి ఇచ్చాను. ఆ గులాబ్ జాములు అక్కడ ఉన్న అంజలి, నూర్జహాన్, ఇంకా ఇద్దరు అమ్మాయిలు కూడా తిన్నారు. కానీ ఏమీ జరగలేదు. అంజలి ప్రేమించలేదు ,సరి కదా ఎవరూ కూడా  సత్తయ్య ను ప్రేమించలేదు. నేను కూడా కుతూహలంగా చాలా రోజులు గమనించాను ఏమైనా జరుగుతుందేమోనని. పాపం సత్తయ్య!! ఎప్పుడూ చేతులతో  వూరికే వాడు, ఏవేవో సిగ్నల్స్ ఇచ్చేవాడు అమ్మాయికి .   అంజలి మాత్రం నవ్వేది ఎప్పుడైనా ఒకసారి చేయి ఊపేది దూరం నుంచి అంతే ఇంకా ఏమీ జరగలేదు.   వాడు ఎదురు చూసి ...చూసి ,ఆ తర్వాత పదవ తరగతి పరీక్షలు రాసి, వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడు.  ఆ రోజుల్లో ఆ మందును 'మరుల మందు 'అనేవారు. అలాంటివి ఉంటాయని కూడా చాలా నమ్మేవారు. ఎవరైనా ఆడువారికి లొంగిపోయినట్టు గా అనిపిస్తే "వాడికి ముందు పెట్టింది! అందుకే వాడు అలా అయిపోయాడు "  అని అనుకునేవారు. 
ఏదైనా గొడవ అయినప్పుడు అమ్మాయిలు" మా నాన్నకు చెబుతాం" అనేవారు. అబ్బాయిలు ఏమో " మా అమ్మకు చెబుతాను "  అనే వారు. మాకు నాన్నల తో మాట్లాడే ధైర్యం ఉండేది కాదు.  అందుకని అమ్మలకు చెప్పుకునే వాళ్ళం. మాతో ఇబ్బంది వచ్చిన అమ్మాయిలు,మా నాన్నకు  చెబుతా మంటూనే  బెదిరించే వారు ."ఆ  చెప్పుకో పో !మాకేం భయమా?" అనే వాళ్ళం కానీ  ,చచ్చే భయమేసేది.  అమ్మాయిలు అలా అని వారే కానీ ఎప్పుడూ చెప్పే వారు కాదు. మాలో మేము తర్వాత సర్దుకు పోయే వాళ్ళం.
 మాతోఎప్పుడూ ఆడుకునే ఒక పది మంది అమ్మాయిలను చూస్తే నాకు ఏమీ అనిపించేది కాదు కానీ కొత్త   అమ్మాయిలను చూస్తే మాత్రం మాకు అదోరకమైన భావన కలిగేది. ఎందుకోగానీ వాళ్లతో ఫ్రీగా ఉండలేక పోయే వాళ్ళం.  ఆ రోజుల్లో  ప్రేమ- పెళ్లి  ,అనేవి దాదాపుగా లేవనే చెప్పాలి.  ఒకవేళ అలాంటివేమైనా మొదలై నా అది ప్రేమ లేఖల వరకే మిగిలిపోయేది.  ఎవరు ఎవరిని ఎదిరించలేక, పెద్దలు కుదిర్చిన సంబంధాలు చేసుకొని, వారి వారి భార్యలతో -భర్తలతో శేషజీవితం ,పిల్లా పాపలతో హాయిగా  గడిపేసె  వారు.  అమ్మాయిలు ఏమి చేయలేక నిస్సహాయ స్థితిలో పెళ్లిళ్లు చేసుకొని వెళ్ళిపోయే వారు కానీ ,అబ్బాయిలు మాత్రం చాలా రోజులు  గడ్డాలు పెంచుకొని, ఏడుపు మొహం పెట్టుకొని దేవదాసులు గా మిగిలి పోయేవారు.  అదికొన్ని రోజులు మాత్రమే.  అదేవిధంగా అబ్బాయిలు కూడా, ప్రేమపేరుతో అమ్మాయిలని  చాలావరకు మోసం చేసేవారు. ఒంటరిగా  తిరిగి వచ్చిన ఆ అమ్మాయిలు మళ్లీ ఇంటికి తిరిగి రాలేక,  ఒకవేళ వచ్చినా మళ్ళీ పెళ్లి కాకుండా సంఘంలో  నరకయాతన పడేవారు .   నా చిన్నప్పటి నుంచి నాతో చదువుకున్న అమ్మాయిలు ఎవ్వరూ కూడా ప్రేమ పెళ్లి చేసుకోలేదు అనే  చెప్పాలి.
 అయితే  ఇక్కడ చిత్ర విచిత్రమైన విషయం ఏమిటంటే,  నూర్జహాన్ తల్లిదండ్రులు విజయం జాన్  గారిది ప్రేమ వివాహమే. పైగా మతాంతర వివాహం కూడాను. అది కూడా 1958 లో. 

 మా కాలేజీ చదువులు అయిపోయి ఉద్యోగాలు వచ్చిన తర్వాత మొదటగా శర్మ ప్రేమ వివాహం చేసుకున్నాడు.  తండ్రి లేని వాడిని  చిన్నప్పటి నుంచి చదువు చెప్పించి ,పెంచిన పెద్ద అన్నయ్య అనుమతి కూడా తీసుకోలేదు. వాడి భార్య కోర్టులో పని చేసేది. ఇద్దరు పిల్లలు అయిన తర్వాత వాడి భార్యతో మనస్పర్ధలు కలిగి సంసార జీవితంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు.
 ఎంబిబిఎస్ అవుతున్న రోజుల్లో తోటి విద్యార్థిని అయిన, భారతి ని  పెద్దల అనుమతితో పెళ్లి చేసుకొని కర్ణాకర్  కొంత సమయం తర్వాత తల్లిదండ్రులను దూరం చేసుకున్నాడు. నూర్జహాన్, అన్వర్ జహాన్ ,ఇద్దరు చెల్లెళ్ళు ప్రేమలో విఫలమై వేరే వారిని వివాహం చేసుకొని హాయిగా వున్నారు.  నాతో ఆడుకున్న రాజేందర్, సుధాకర్, వినోద్, సుమతి ,సుజాత, రోజా ,జ్యోతి, విజయ్ కుమార్, ఆంజనేయులు ,వీరంతా పెద్దలు కుదిర్చిన వివాహాలు చేసుకొని పిల్లా -పాపలతో హాయిగా వున్నారు. ఎంతో మంది అమ్మాయిలతో చిన్నప్పటి స్నేహంగా మెలిగి నేను ఎవరి ని  కూడా  సీరియస్ గా తీసుకోలేదు----
 ఇంటర్మీడియట్ నాగార్జునసాగర్ లో 'లీల  'అనే నా క్లాస్ మేట్  ను చూసేవరకు.అక్కడ నుంచి పదకొండు సంవత్సరాల తర్వాత మళ్లీ  చూశాను  అదే అమ్మాయిని . ఆ  లీలనే వివాహం  చేసుకున్నాను.  అది ఒక పెద్ద కామెడీ స్టోరీ !మళ్లీ చెబుతాను.