గుణపాఠం!:- అచ్యుతుని రాజ్యశ్రీ

 అక్కడ ఓ చిన్న చెరువు.అందులో బోలెడన్ని కప్పలు!బడికి సెలవులు కావటంతో పిల్లలు అంతా  అక్కడికి కాస్త దూరంలో ఆడేవారు. ఉదయం  సాయం త్రం ఈతకొట్టేవారు. తుంటరి గోపీకి ఒక ఆలోచన వచ్చింది. "రోజూ మనం బంతిఆట  చెడుగుడు  పరుగుపందాలు ఆడుతున్నాము.ఈరోజు చిన్న చిన్న గులకరాళ్లు ఏరి చెరువులో కప్పలపై విసురుదాం. అవి గెంతుతుంటే భలేగా ఉంటుంది. "అనగానే  అంతా సై అని పొలోమంటూ  రాళ్లు  ఏరి వంతులవారిగా కప్పలని సతాయిస్తుంటే పాపం అవి  తగిలేదెబ్బలకి గంతులు చిందులు వేస్తున్నాయి. పిల్లమూక చప్పట్లు చరుస్తూ  గోలగా అరుస్తూ నానా హంగామా చేస్తున్నారు.  చెరువులో  నీరు తక్కువ కావటంతో  బెకబెకలతో  చిన్న కప్పలు  పెద్ద వాటికింద దూరుతున్నాయి.కప్పలరాజు అంది"మనుషుల కి బుద్ధి జాలి  నశిస్తున్నాయి. మనల్ని పట్టుకుని  కాళ్ళు కోసి విదేశాలకి ఎగుమతి చేస్తున్నారు. మనలను వడియాలు లాగా  వేయించి మింగుతున్నారు.మనం లేక నే చెరువులు నదులు కలుషితం  అవుతున్నాయి  అన్న బుద్ధి లేదు. ఇప్పుడే వెళ్ళి  ఆ పిల్లలకి   నీతిబోధ చేస్తా"అంది. "లేదు రాజా! మీరు వయసులో పెద్దలు. మాకు రాజు.మేమంతా  వెళ్ళి  ఆ  ముగ్గురు పిల్లలపై ఎగిరి ఒళ్లంతా  కరిచి మా తడాఖా చూపుతాం"అని ఒక్క సారి గా అవి వారిపై దూకి తల నించి  పాదాలదాకా గీరసాగాయి.లబోదిబో అంటూ నేలపై దొర్లుతున్న  పిల్లలతో కప్పలరాజు అంది"బాబులూ! మీకు  మేము  ఏమి అపకారం  చేశాము?మా బుల్లి కప్పలు గూడా మిమ్మల్ని తిప్పలు పెడుతున్నాయి. మీ సైన్స్ పాఠం కోసం  మమ్మల్ని  కత్తి తో కోసి చంపుతారు.కానీ  ఇలా మీసరదా కోసం  హింసించే  మీకు  ఇలాగే  బుద్ధి చెప్పాలి." పిల్లలు  ఇంకా  ఇంటికి రాలేదు అని వచ్చిన  తాత ఈ మాటలు విని  "శెభాష్ !మా పిల్లలు మామాట
వినటంలేదు.మీకున్న బుద్ధి  విచక్షణ  మనిషి లో తగ్గిపోతోంది. "అని  పిల్లల చేత   కప్పలకి క్షమాపణ చెప్పించాడు.