ఋతురాగం(వచనకవిత)డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.

 కాలగమనంలో మార్పులు సహజం
ఋతువులు మారి,ప్రకృతి పరవశించుట నైజం
అందాలను,అవసరాలను,
సౌకర్యాలను,కొన్ని అసౌకర్యాలను కల్పించుట నియతం
అంకురాలు ముక్కలై పులకిస్తాయి
మొక్కలు చెట్లై వికసిస్తాయి
అవి ఆకులను,పిందెలను,కాయలను,పండ్లను కాలానుగుణంగా అందిస్తాయి
ప్రకృతి పచ్చనికోకను కట్టుకొని సింగారించుకుంటుంది
చిగురుటాకులు వణికి రాలిపోతాయి మరోసారి
కొత్తచిగుళ్ళు తొడిగి,లేలేత అందాలను పూయించి
తుషారబిందువులతో,తుంపరలతో తన్మయత్వం చెంది,
వానలకు తడిసిముద్దై,చలికి వణికి,ఎండలకు ఎండుతాయి
తీగలు,లతలు,కొమ్మలు,చెట్లు,జలపాతాలు,చెరువులు,నదులు,కుంటలు,వాగులు పరవశిస్తాయి ఒకసారి
ముడుచుకుపోయి,చిక్కిపోతాయి మరోసారి
పుడమితల్లి పులకించి విత్తులను ఆహారంగా మార్చి
ఆకలిని తీరుస్తుంది ఒకసారి
పర్రెలు వారి,నోరు తెరుచుకొని ఏడుస్తుంది మరోసారి
ఋతురాగాలతో ఋజుత్వాన్ని పెంచుకొని
కాలము అనుకూలమై,ప్రతికూలమై సాగిపోతుంటుంది
మార్పు అనివార్యం,స్వాగతిద్దాం
ఆనందిద్దాం,ఆస్వాదిద్దాం
కాపాడుదాం,మమేకమవుదాం,
కలిసి జీవిద్దాం.