జీవితం నేర్పిన పాఠాలతో నేనూ --నా స్నేహితులు ...!!:- -------శ్యామ్ కుమార్, నిజామాబాద్.

 "పైకప్పు  కూలి పోయేలా ఉంది  బయటకు నడవండి రా  అందరూ"  అన్నారు మాస్టారు . అన్నదే తడవుగా మేము అందరం సంతోషం తో బ్యాగులు భుజాన వేసుకుని బయటికి  పరిగెత్తాం.
 నేను అప్పుడు ఎనిమిదో తరగతి భువనగిరి  లో చదువుతున్నాను మా స్కూల్ పేరు బీచ్  మొహల్లా హై స్కూల్.  సగం స్కూల్  వరకు సున్నపురాయితో వేసిన కప్పు ఉండేది, మిగతాది  పెంకులతో వేసిన కప్పు ఉండేది. అప్పుడే బాగా వర్షం పడి ఆగింది  ఆ వర్షానికి తడిసిన కప్పు దానికున్న కట్టెలు  మెత్తబడి అనుకుంటాను,. కిరు కిరు అంటూ  చప్పుడు చేస్తూ  విరిగి పోయేలా ఉన్నాయి.  అసలు స్కూలుకు పోయే సమయానికి పెద్ద వర్షం పడితే మాకు  సెలవు కిందే లెక్క.  ఆ సమయంలో వర్షం మొదలైతే బాగా పడాలని దేవుని కోరుకునే వాడిని.  కొన్నిసార్లు దేవుడు మా  మొర ఆలకించే వాడు.
 కానీ కొన్ని సార్లు సరిగ్గా స్కూల్ సమయం దగ్గర పడే కొద్దీ వర్షం ఆగిపోయేది.  అలా స్కూల్ కి వెళ్ళిన తర్వాత కూడా సెలవు ప్రకటించేవారు  మా హెడ్మాస్టర్ గారు.  ముందుగా జరిగే ప్రార్థనా కార్యక్రమంలో పిల్లలను చూసి,  హాజరు తక్కువగా అనిపిస్తే , కొందరు ముఖ్యమైన ఉపాధ్యాయులను దగ్గరగా పిలిచి, చిన్నగా మాట్లాడేవారు. అప్పుడే మేమంతా ఇంక సెలవు  ప్రకటిస్తారని ఎక్కడలేని సంతోషం తో ఎదురు చూస్తూ నిలబడే వాళ్ళం. మా   హెడ్మాస్టర్ గారి పేరు సత్తయ్య గారు. వారికి ఉన్న ఏకైక కుమారుడు కూడా మా  తరగతిలోనే చదివేవాడు. వారి కుటుంబంలో చాలా మంది ఉపాధ్యాయులు గా ఉండేవారు. అబ్బాయి పేరు రామ్ ప్రసాద్.  తరగతిలో చాలా మామూలుగా, మనస్తత్వం లో మెత్తగా ఉండేవాడు.   చదువులో పెద్దగా రాణించే వాడు కాదు.  నేనెప్పుడూ ఆశ్చర్య పోయే వాడ్ని "వీడు ఎందుకబ్బా ఇలా మామూలుగా ఉంటాడు, హెడ్మాస్టర్ గారి అబ్బాయి కదా చాలా తెలివిగా ఉండాలి కదా?" అనుకునే వాడిని.  నాకప్పుడు 'పండిత పుత్ర పరమ శుంఠ 'అనే సామెత తెలీదు మరి .     సెలవు ప్రకటించగానే ఇంటికి పరిగెత్తు పోయి ,మా బ్యాగులు పక్కనపడేసి, అందరం బయట కలిసి యేం  ఆట ఆడుకోవాలి అని నిర్ధారించుకు నే  వాళ్ళం.  వర్షం పడి భూమి మెత్తగా ఉంటే ముందుగా సికు ఆట ఆడుకునే వాళ్ళం.  అది రెండు అడుగుల ఇనుప కడ్డీ, దానిని తీసుకొని  భూమిలోకి దిగ వేసుకుంటూ వెళ్లాలి . మా  మాకది సీజనల్ గేమ్ అన్నమాట. బాగా వర్షం పడితే మా ఇంటి ముందు గడప వరకు నీళ్లు వచ్చి ముందు నుంచి పెద్ద కాలువ లాగా నీళ్ళు వెళ్లి పోయేవి. అప్పుడు ఇంట్లో ఉన్న కాగితం తీసుకువచ్చి రకరకాల సైజుల్లో కాగితపు పడవలు తయారు చేసి ఆ నీళ్లలో వదిలి, అలా కొంత దూరం అవి కొట్టుకొని వెళ్లి ఆ తర్వాత తడి కి మునిగిపోతే బాధపడి చూసుకుంటూ,  మళ్లీ ఇంకొకటి తయారుచేసి ఆనందించే వాళ్ళం. ఏ పని చేసిన   ఎటువంటి ఆట  ఆడినప్పటికీ ఆనందించడం   అన్నది తప్పనిసరిగా ఉండేది.
 అప్పుడు కాగితాల కు కూడా  కరువు గానే ఉండేది.  కొద్దిసేపటి తర్వాత కాగితపు రోల్ చేయడానికి కాయితాలు దొరికేవి కావు ఇంట్లో. మొదట్లో పెద్ద వారి అనుమతితో పనికిరాని కాగితాలతో కాగితపు పడవలు చేసే మేము, ఆ తర్వాత పనికి వచ్చే  కాగితాలతో పెద్దవారు చూడకుండా  చాటుమాటుగా పడవలుచేయడం మొదలు పెట్టే వాళ్ళం.  ఇది దాదాపుగా మా ఇంటి ముందర ,పక్కన అందరూ   ఇలాగే కాగితపు పడవలు చేసి వాటిని నీళ్లలో వేసి చూస్తూ ఆనందించేవారు.
 తరగతిలో ముందు  బెంచీ మీద నేను, కరుణాకర్, రాజేందర్రెడ్డి ,     శర్మ, అనిల్  అని  ఐదుగురం కూర్చునేవాళ్ళం .  మేం నలుగురం దాదాపుగా ఉపాధ్యాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే.  చదువులో మేం నలుగురం ఎప్పుడూ ముందుండే వాళ్లం కాబట్టి మాకు బాగా తెలివైన వాళ్ళం అని ఫీలింగ్ ఉండేది.
 మా వెనకాతల బెంచిలో లింగం, పొట్టి నరసింగరావు  ,సుధాకర్ కూర్చునేవారు.   పొట్టి నరసింగరావు  పెద్ద పొట్టి ఏమీ కాదు. కాకపోతే కాస్త తక్కువగా ఉండేవాడు. వాడిప్పుడు మమ్మల్ని అడుగుతాడు "నన్ను పొట్టి అని ఎందుకు పేరు పెట్టారు నేను మామూలుగానే ఉన్నాను కదా ?"అని. ఇక పోతే   శర్మ మా అందరికంటే పొడగరి.  ఎనిమిది మంది సంతానంలో అందరి కంటే చిన్నవాడు.  వాడికి అందరూ అన్నయ్యలు  అక్కయ్య లే. ఇంట్లో  అందరూ వాడికి పని చెప్పేవారే.  వాడు మాతో హాయిగా ఆడుకుంటూ ఉంటే వాడికి ఇంటి నుంచి పిలుపు లు  వచ్చేవి ఏదో పని చెప్పేవారు.  వాడు ఏమి చేయలేక వెళ్లి  ఆ పని చేసుకుని వచ్చేసరికి  మా ఆటలు అయిపోయేవి. మా అందర్లోకి వాడు కాస్త అమాయకుడు అని చెప్పాలి . మేము అందరం కలిసి సినిమాకి వెళితే నాకు మాత్రం మా నానమ్మ నేల టికెట్ కి సరిపడా  నలుబది పైసలు మాత్రమే ఇచ్చేది. వాటికి కాస్త అదనంగా  ఇరువది పైసలు వేసి కరుణాకర్ నన్ను  బెంచిక్లాసులో తనతో కూర్చోబెట్టుకొనే వాడు.

 సాధారణంగా వెనుక బెంచీలో కూర్చున్న విద్యార్థులకు బాగా దెబ్బలు పడేవి. తరగతిలో సమాధానం చెప్పక పోయినా, లేక పరీక్షలో మార్కులు తక్కువ వచ్చినా ,మా ఉపాధ్యాయులు   పచ్చి సన్నని కర్ర తీసుకొని వెనకాతల కాళ్ళ మీద  ఇంకా 
 వెనకాతల తొడల మీద  వాతలు పడేలా వాయించేవారు.  కొందరయితే ఆ దెబ్బలకు ఆ క్లాస్ అయిపోయే వరకూ  ఏడుస్తూ ఉండేవారు.  గణితం లో రాజేందర్ బాగ వుండేవాడు. వాడు ఇంజనీరింగ్ చేసి సింగరేణిలో GM గా రిటైర్డ్ అయ్యాడు.  అదృష్ట వంతుడుని చెదరగొట్ట లేరు అన్నట్లుగా చదువులో మామూలుగా వున్న లింగం  ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు.  మా  హెడ్ మాస్టర్ కొడుకు అయిన రాంప్రసాద్ చదువు పెద్దగా లేకపోయినా కష్టపడి వ్యాపారం చేసి మంచి ఉన్నత స్థితికి చేరుకున్నాడు. వాళ్ళ నాన్న గారి కోరిక మేరకు కర్ణాకర్ డాక్టర్ అయ్యాడు.    అదృష్టవశాత్తు శర్మకు  వాడి అన్నయ్య ద్వారా టెలిఫోన్ డిపార్ట్మెంట్ లో ఆపరేటర్ గా ఉద్యోగం వచ్చింది.  మా ఇంటికి ఎదురుగా ఉండే సుధాకర్ తో ఎన్నో ఆటలు ఆడుకున్నా.  ఇంటికి ఎదురుగా నే ఉండటం మూలాన అనుకుంటాను బహుశా నేను సుధాకర్ తో చాలా సమయం గడిపే వాడిని.  చిన్నప్పటి నుంచి వాడు చాలా కష్టజీవి ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలోనే వాడి  అమ్మ గారు చేసే వ్యాపారమైన కట్టెల మండి  లో కట్టెలు కొట్టి మూడు రూపాయలు సంపాదించేవాడు.  చిన్నతనంలోనే చిత్ర కళను వ్యాపార పరంగా అభివృద్ధి చేసి సూర్యాపేటలో మంచి పెయింటర్ గా సెటిల్అయ్యాడు. 
ఉద్యోగం సంపాదించడమే ముఖ్య ఉద్దేశం  గా చదివిన నేను  ఎన్నో ఉద్యోగాలకు పరీక్షలు రాసి అంతిమంగా  ఇన్సూరెన్స్ లో   చేరి  మేనేజర్ గా రిటైర్ అయ్యాను.   చిన్నతనంలో  చదువులో చూపించే తెలివితేటల వలన చాలామంది అభివృద్ధి చెందారు. కొందరేమో చదువులో వెనుకబడినా  సరే తర్వాత జీవితం నేర్పిన పాఠాలతో చాలా అభివృద్ధి  సాధించి జీవితంలో చాలా బాగుపడ్డారు. మరికొందరు పట్టుదలతో ఎన్నో సాధించి రకరకాల కష్టాలకు ఓర్చి బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు.  బాల్య మిత్రులు గురించి ఆలోచించినా , వారు కలిసినా,   వారితో మాట్లాడి నా కలిగే సంతోషం ఆనందం వేరు.  అరేయ్ ఒరేయ్ అని సంబోధించే స్నేహితులు కలిసినప్పుడే మనకు  అంతులేని సంతోషం ఆనందం కలుగుతుంది.  ఆ విధమైన సంతోషం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా దొరకదు సుమా.
--------------------------------------------
  ఫోటోలో-----శ్యామ్ కుమార్, డా.కరుణాకర్.