పాపాయి ముచ్చట్లు ::- సుకన్య

 

       నా పేరు లౌక్య . నేను , అమ్మా , నాన్న , నానమ్మ ఉంటాం  మా ఇంట్లో .  మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం . నాన్న అంటే కూడా .   నాకు ఒక పేరు కాదు, చాలా పేర్లు ఉన్నాయ్ .  అమ్మ నన్ను, లౌ , లౌకీ , అమ్మలూ , తల్లీ  అంటుంది .   నన్ను ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటుంది .  నాన్న బొమ్మలు కొని ఇస్తాడు .  బండి మీద ఊరంతా తిప్పుతాడు .  కొత్త ఎర్ర పూల గౌను వేస్తుంది అమ్మ .  నా కాళ్ళకి గజ్జలు కూడా పెడుతుంది.  అవి మోగుతుంటే బాగుంటుంది.  కానీ ఒక చిక్కు ఉంది .  నాకు మెట్లు దిగి కింద కెళ్ళి హాయిగా ఆడు కోవాలని ఉంటుంది .  మెట్ల వైపు వెళ్ళ గానే అమ్మకి తెలుస్తుంది , 'ఏయ్, ఎటు పోతున్నావ్, రా ఇటు ' అని అరుస్తుంది . 
    నాకు నచ్చని పని చేస్తే అమ్మని బాగా తిప్పలు పెడతాను .  నచ్చని పనులంటే , పొద్దున్నే లేపి పళ్ళు తోమడం ,  స్నానం చేయించడం అన్నమాట .  స్నానం అసలు బాగుండదు నాకు.  అప్పుడు నేను పెద్దగా  ఏడుస్తాను .  'ఎందుకేడుస్తావే తల్లీ , అటారు వీధులు ,ఇటారు వీధులు వినబడేటట్లు .  ఆపవే! '  అంటుంది అమ్మ.  ఆపుతానేమిటి ?  ఇంకా పెద్దగా ఏడుస్తా .  మా అపార్టుమెంట్ లో అందరూ అప్పుడు తలుపులు , చెవులు మూసుకోవాల్సిందే .   నాన్న  కొట్టడు గానీ అరుస్తాడు పెద్దగా 'ఏడుపాపు '  అని.  కొంచెం భయం వేస్తుంది . కొంచెమే ..     అమ్మ కొడుతుంది కానీ నొప్పి పుట్టదు .  అవమానం వేస్తుంది , అందుకే ఇంకా పెద్దగా ఏడుస్తా .  
      ఇవాళ పొద్దున్న చాలా కోపం వచ్చింది . అమ్మ వాకిలి కడిగితే , నేను ముగ్గు వేశాను.  మొత్తం తుడిపేసి అమ్మ మళ్ళీ ముగ్గు వేసింది .  కోపం వచ్చింది , అవమానం వచ్చింది . పెద్దగా ఏడ్చాను.     నాయనమ్మ వచ్చి , 'పొద్దు పొద్దునే ఏమయింది బుజ్జి, ఎందుకు ఏడుస్తున్నావు'  అని ఎత్తుకుంది .  'అమ్మ నా ముగ్గు చెరిపేసింది ' అని ఏడుస్తూ చెప్పాను .    అప్పుడు నాయనమ్మ, 'ఏడవకూడదు తల్లీ ,  అమ్మ ముగ్గేమీ బాలేదు , మనం వేరే చోట వేసుకుందాం ' అని చెప్పి , చా క్  పీస్   ఇచ్చింది .   సరే లే  అని నేను పెద్ద ముగ్గు వేశా  .  నాయనమ్మ నా ముగ్గే బాగుంది అని చెప్పింది.  'పెంకి పిల్లవు గా ' అన్నది నాయనమ్మ.  
     ఇవాళ నా కొత్త  బొమ్మ విరిగి పోయింది .  బొమ్మ కావాలని మారాం చేశా .  మళ్ళీ  కొనాల్సిందే అని ఏడుపు మొదలు పెట్టా .  నాయనమ్మ వచ్చి  ' చెప్పేది కాస్త విను తల్లీ '   అంది .  'ముందు నేను చెప్పేది  విను , తర్వాత నేను వింటా' అన్నాను .  పక్కింటి ఆంటీ అక్కడే ఉంది,  'మొన్నటి దాకా అసలు మాటలు రాలేదు , ఇంతలో ఎన్ని  మాటలు వచ్చాయి నీ పొట్ట లోంచి ' అని  నా బుగ్గ సాగ దీసింది .   మాటలన్నీ పొట్ట లో ఉంటాయి అని తెలిసింది  అప్పుడు .  నాపొట్టలో  ఒకట్లు , అ ఆ లు కూడా ఉన్నాయ్.  ఏ బి సి డి  లు కూడా.  అమ్మ నేర్పింది . 
    అమ్మని తిప్పలు పెడతాను అంటుంది గానీ ,  అమ్మే నన్ను తిప్పలు పెడుతుంది .   రోజూ అదే అన్నం ముద్దలు పెడుతుంది . నాకు సయించదు .  వద్దు అంటే అరుస్తుంది .   కిందకు తీసికెళ్ళి తిప్పుతూ పెడుతుంది .  మధ్యలో ఎవరైనా కనపడితే వాళ్ళతో మాట్లాడుతూ నన్ను చూడదు . అప్పుడు గబుక్కున నా నోట్లో ముద్ద తీసి చెత్త బుట్టలో వేసి , గప్ చుప్ గా ఆడుకుంటూ ఉంటాను.  అక్కడ బోల్డు కార్లు , మోటారు సైకిళ్ళు ఉంటాయి . అమ్మ కి చిక్కకుండా వాటి మధ్య దాక్కుంటా .  వెతికి పట్టుకుని మళ్ళీ అన్నం పెడుతుంది 'దొంగ పిల్లా , ఇక్కడ దాక్కున్నావా'  అంటుంది .  ఈ దొంగాట నాకు భలే బాగుంటుంది .  ఇద్దరం నవ్వేస్తాం. 
  మొన్న అప్పుడు నాకు పుట్టిన రోజు పండగ చేసినప్పుడు ,  అమ్మ చెప్పింది , నాకు మూడు ఏళ్ళు వచ్చినై అని, ఒకటి, రెండు, మూడు అని వేళ్ళు లెక్కపెట్టి చెప్పింది.    పెద్ద దాన్ని అయిపోయానని .  స్నానానికి ఏడవకూడదు .  చక్కగా స్నానం చేస్తే , బూచులు రావని చెప్పింది .  తిరుగుతూ అన్నం తినకూడదు , ఒక చోట కూచుని తినాలి అని చెప్పింది .  అందుకే   ఇప్పుడు నేను ఏడవటం లేదు గా .  
   కిందకెళ్ళి ఆడుకుంటా అంటే అమ్మ ఒప్పుకోదు.  కరోనా బూచి పట్టుకెళ్లి పోతుంది అంటుంది .  మెట్లు దిగితే సాయి అన్నయ్య , దివ్య అక్క ,  రమ్య అక్క అందరూ ఉంటారు .  వాళ్ళ కి నేనంటే ముద్దు.  అమ్మ వెళ్ళద్దు అంటుంది .  రాము అన్నయ్య వాళ్ళ అమ్మని బూచి పట్టుకుందట .  డాక్టర్ వచ్చి మందులు ఇస్తే,  ఇప్పుడు బూచి వెళ్లి పోయిందట .   ఇంట్లోనే ఆడుకోవాలంటే బాగాలేదు .   హాయిగా ఎప్పుడు ఆడుకుంటానో.     
  ఈ సారి కలిసినపుడు మళ్ళీ మరిన్ని కబుర్లు చెపుతాను సరేనా .