*మాపాప*:-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 మూడేళ్ళ మాపసిపాప
ముచ్చటగొలిపే మాపాప
బండెడుబుక్కుల బ్యాగులుమోస్తూ
బడికి వెళ్ళదు మాపసిపాప!
నీళ్ళలొ ఆడే మాపాప
బొమ్మలా ఉండే మాపాప
నోటిమీద వేలుతో
బడిలో ఉండదు మాపసిపాప!
లాలిపాటలు వినే మాపాప
గోరుముద్దలు తినే మాపాప
బలవంతంగా ఆయాలుపెట్టే
తిండితినదు మాపసిపాప!
ఆటలుపాటల మాపాప
అందాలుచిందే మాపాప
భయముతొ బడిలోఉండదు మాపసిపాప!
అమ్మానాన్నల ఒడిలోన
బామ్మాతాతల నీడలోన
హాయిగ ఉండే మాపాప
టీచర్ల భయంతో
బడికి వెళ్ళనేవెళ్ళదు మాపసిపాప!
ఆనందంతో చదువులు సాగే
నేస్తాలైన గురువులు ఉండే
రంగుల విరితోటై మురిసే
బడికి వెళుతుంది మాపాప
ఆబడికే వెళుతుంది మాపసిపాప !!