రెండు చేపలు ( బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼ దార్ల బుజ్జిబాబు


 ఒక ఊరిలో ఓ జాలరి ఉండేవాడు. ఒకరోజు చెరువులోని నీళ్లలో వలను విసిరాడు. రెండు చేపలు వలలో చిక్కాయి. వాటిని ఒడ్డున పడేసాడు.  వడ్డున పడ్డ చేపలు విలవిల కొట్టుకున్నాయి. "మిత్రమా! ఇక మనం చావడం ఖాయం. ఈ రోజు పొద్దున్నే ఎవరి ముఖం చూశామో ఏమిటో? వీడి బారిన పడ్డాం.  కాసేపటికి కూరగా మారిపోతాం" అని విలపించ సాగింది వాటిలో ఒకటి.  "మిత్రమా! ఇలాంటి వెళలోనే నిబ్బరంగా ఉండాలి. ఆపదలు వచ్చినప్పుడు నీరసపడకూడదు. ఉపాయం ఆలోచించాలి. తప్పించుకోవటానికి ఏదో ఒక మార్గం ఉండక పోదు" అంది రెండో చేప.

     " ఇంకేం మార్గంలే మిత్రమా! వడ్డున పడ్డప్పుడే మన బలం కోల్పోయాము. ఇలాంటి వేళలో ఆలోచన కూడానా?" అంటూ కాసేపటికి చనిపోయింది.  రెండోది ధైర్యంతో ఆలోచించసాగింది. తప్పించుకోవటం కోసం  ప్రయత్నాలు ప్రారంభించింది. గెంతులు గెంతుతూ చెరువు వైపుకు జరిగింది. చెరువులో నీళ్లు కనిపించేసరికి దానికి ప్రాణం లేచి వచ్చింది. బలన్నంతా కూడగట్టుకుని ఒక్క ఎగురు ఎగిరి నీటిలో పడింది. వేగంగా ఈదుకుంటు లోపలికి వెళ్ళిపోయింది.