పల్లె ముచ్చట్లు :కట్టెల_పొయ్యి.: - సరోజన

 గిప్పుడు ఏ ఇంట్ల సూసిన గ్యాస్ పొయ్యిలే కట్టెల పొయ్యి ఏడ కానత్తన్నయ్.
ఏదో పల్లె లో ఎవుసం సేసే టోళ్ల ఇండ్లడ్ల తప్ప పట్నంల సూద్దాం అన్న కనవడది.
ఏదన్న లగ్గాలు,సిన్న పబోజనాలు అయిన  గూడ పెద్ద గ్యాస్ పొయ్యి వెట్టి అండుడే..
కానీ ఎనకట జోడు కట్టెల పొయ్యిలు మట్టి తోని ఏసుకొని గదిని మీదనే అండుకునేది..లేదంటే కుమ్మరి పొయ్యిమీదనో..అండేది..
కట్టెలు కూడ ఇరిగ దొరికేది.జంగళ్ల,ఇంటి సుట్టు సెట్లు,సెండ్లల్ల ఏడ సూసిన కట్టే పుల్లలు  కనవడేది.
కానీ గిప్పుడు ఎండ కాలం సల్లగా ఏ సెట్టు నీడనన్న  కూసుంద్దాం అన్న సెట్టు నీడ కరువయ్యే.
జంగళ్ల సుత సెట్లు లేకుండ ఉన్నకాడికి నరకవట్టిరి..
గొడ్డు ,గోదా పచ్చులు అన్నిటికీ నీడ లేకుండ సేయవట్టిరి.
గందుకే  జంగళ్లకెల్లి అడిసేడు పుల్ల కూడ ముట్ట నిత్త లేరు సర్కారొళ్లు.
ఇగ కట్టెల పొయ్యి మీద అండిన బువ్వ ఎంత రుసి,పొయ్యి మీద జొన్న రొట్టె ఒక్కతీరుగ కాలి మస్థుగుండేది.అంబలి కాసిన ఎంత సక్కగా ఉండేది..
గిప్పడి లెక్క రౌతెండి గిన్నెలల్ల కాక కుమ్మరి సేసిన మట్టి గిన్నెలే వాడేదాయే..
సిన్న ,సిన్న భౌగోన్లు, సిన్న పటువలు,గురిగి,ముంతలు. అన్ని మట్టి తోని సేసినయె..
గడక ఓసుకున్న, బువ్వ అండిన, అంబలి గాసిన అన్ని గిండ్లనే సేసుకునేది.
ఇగ పిడిక కున్నెల కుంపటి మీద కుండల పాలు కాగవెడితే మత్తు అట్టు కట్టేటియ్.. నెయ్యి సుత గీ కుంపటి మీదనే కాగ వెట్టేది.. గురిగిల పెరుగు తోడు వెట్టుకునేది..
పాలు కాగినంక అడుగుకు ఉన్న పాల గోగు కశిక తోని గీక్కొని తింటే ఎంత కమ్మగుండు.
ఇగ ఏ ఇంట్ల ఆడిబిడ్డ పసిద్ద అయిన పొంతలు వెట్టి కట్టెలతోనే నీళ్లు కాగవేట్టేది..
పెద్ద,పెద్ద పేర్పులు పొయ్యి రాళ్ళ లెక్క పెట్టి  దాని మీద ఇంకో పేర్పు పెట్టి ఆయిలాకు ఏసీ మసల వెట్టి పోసేది..
 
ఇంట్లకు రాంగ బూడిది బొట్టు తల్లికి,పిల్లకు పెట్టి తీసుకచ్చేది.బూడిద బొట్టు పెడితే గాలి ,ధూళి సోక కుండ మంచిగ ఉంటరు అని. ఎటన్న బయటకు పోయిన బాలింతకు గి బూడిద బొట్టు పెట్టుకొని పొమ్మనేది.
బిడ్డ మంచం కింద అగ్గి నిప్కల మీద ఊదు ఏసీ పోగేసేది.
ఇగ నాతిరి ఉనక తోని కుంపటి వెట్టేది..గా పొగకు  దోమ,పురుగు లు రాకుండ ఉండటానికి.
ఇగ పొయ్యిల బూడిది తోని బోళ్ళు తోముతే మెరిసేటియ్.
బొగ్గు ముక్కతోని పండ్లు తోమేది.
పుట్ట మన్ను తోని ఎర్రగా అలికి సుద్ద తోని ముగ్గు వెట్టినంక నే పొయ్యి  అంటు వెట్టుకునేది.
ఆనకాలం పొయ్యి కాడ కూకొని మంగళం ల పాలాలు ఎంచుకొని ,ఉసిల్లు కలుపుకొని బుక్కెటోళ్లు.
ఇగ మాగిల సలికి అరికంట్లం కట్టు కొని ఏగిలివారంగా,నాతిరి కట్టే నెగడు పెట్టుకొని దాని సుట్టు కూకొని ముచ్చట పెట్టుకునేటోళ్లు.
ఇగ కాలిన బొగ్గులను కంకులు కాల్సుటానికి, కొలిమి కాడ ఇనప వస్తువులు సాటేయించు టానికి పనికిచ్చేటివి.
పొయ్యి తోని గిన్నీ సేసిన పొగ వడది అని గ్యాస్ పొయ్యి ల మీద వాడవట్టిరి.
నీళ్లకు కరెంటు.అన్నానికి కరెంటే.. మసి బోళ్ళు తోముటానికి కట్టమయ్యే.అన్ని  సబ్బుల తోని గిన్నెలు తోమితే సగం సబ్బు కలుపులకే పోవట్టే..
పొయ్యి కాడ పొగ అత్తది అని బంద్ వెట్టినోళ్లు.పెద్ద,పెద్ద,ఫ్యాక్టరీ ల గొట్టాల నుండి అచ్చె పొగ బంధు పెడితే ఎంత బాగుండు..
గాలి,నీళ్లు పాడు పడకుండ ఉండు.
~~SN~~
 సరోజన