మనసున్న మారాజు (కథ) సరికొండ శ్రీనివాసరాజు


  శ్రీపురం రాజ్యాన్ని ధ

నంజయుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతడు ప్రజానురంజకంగా పరిపాలన సాగిస్తున్నాడు. ఒకరోజు అతడు మారువేషంలో మంత్రితో కలసి ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు తిరిగే క్రమంలో అతనికి అతి ప్రాచీనమైన దేవాలయం ఒకటి కనిపించింది. అది శిథిలావస్థలో ఉండగా దానిని పట్టించుకునే నాథుడే లేడు. అక్కడి స్థానికులను ఆ దేవాలయాన్ని గురించిన చరిత్రను అడిగి తెలుసుకున్నాడు. ఇలాంటి చారిత్రాత్మక దేవాలయాలు రాజ్యంలో ఎన్ని ఉన్నాయో తెలుసుకోవడంతో పాటు ఆ దేవాలయాలను అన్నింటినీ ఆధునికంగా తీర్చి దిద్ది, నిత్యం పూజలు జరిపించేలా చేయాలని నిశ్చయించుకున్నాడు. అందుకోసం చాలా పెద్ద మొత్తంలో నిధులను కేటాయించాడు. ఇంతలో ధనంజయుడు అనారోగ్యం పాలయ్యాడు. రోజు రోజుకూ ఆరోగ్యం మరింత క్షీణించసాగింది. తన ఆరోగ్యం కుదుటపడేవరకు తాత్కాలికంగా సమర్ధవంతుడైన రాజును నియమించాలని అనుకున్నాడు. తనకు సంతానం లేకపోవడంతో ఆ రాజ్యంలోనే గొప్ప పేరున్న అధికారి విజయుడు అనే అతనికి రాజ్యపాలనను అప్పజెప్పాడు. అయితే తాను దేవాలయాల పునరుద్ధరణ కోసం కేటాయించిన ప్రత్యేకమైన నిధులను గురించి విజయునికి చెప్పాడు. తక్షణమే రాజ్యంలోని అన్ని దేవాలయాలను పునరుద్ధరించవలసిందిగా విజయుని వేడుకున్నాడు ధనంజయుడు.
       ఇలా ఉండగా ఆ రాజ్యంలో అంతు చిక్కని అంటువ్యాధి ఒకటి దావానలంలా వ్యాపించింది. ప్రజలు చాలామంది మరణిస్తున్నారు. వైద్య నిపుణులు పరిశోధన చేసి, ఆ వ్యాధి రాకుండా ఏమేం చర్యలు తీసుకోవాలో కనుగొన్నారు. ప్రజలు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో ప్రచారం చేస్తున్నారు. కానీ పరిస్థితి అదుపులోకి రావడం లేదు. విజయుడు తక్షణమే దేవాలయాల బాగు కోసం కేటాయించిన సొమ్ముతో పల్లె పట్టణం అని చూడకుండా అనేక చోట్ల వైద్యాలయాలను నెలకొల్పి వైద్యులను నియమించాడు. విదేశాల నుంచి ఆధునిక వైద్యులను రప్పించాడు. ‌ నిరంతరం వైద్యం కొనసాగేలా చర్యలు తీసుకున్నాడు. విజయుని కృషి ఫలితంగా ఆ వ్యాధి క్రమేణా తగ్గుముఖం పట్టి పూర్తిగా తగ్గిపోయింది. 
       ఇంతలో ధనంజయుడు అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకొని తిరిగి రాజ్యాధికారాన్ని చేపట్టాడు. తాను దేవాలయాలు ఏ మాత్రం బాగుపడలేదని నిధులను ఇతర పనులకు వినియోగించినందున రాజాజ్ఞ ధిక్కరించిన నెపంతో విజయుని చెరసాలలో వేయించాడు. ఆ రాత్రి భగవంతుడు ధనంజయునికి కలలో కనిపించి, "ఓ మూర్ఖపు రాజా! ప్రజలు అంతు చిక్కని వ్యాధితో బాధపడుతూ రోజు రోజుకూ మరణాలు పెరిగిపోతుండటంతో వారి ఆయురారోగ్యాలను కాపాడటానికి విజయుడు కృషి చేశాడు. అతని కృషి లేకుంటే ప్రజలు అసంఖ్యాకంగా మరణించేవాళ్ళు. మరి నువ్వు పరిపాలించడానికి ప్రజలు ఉంటారా? దేవాలయాలు బాగుపడితే ఆ దేవుళ్ళ వద్దకు ఎవరు వెళ్ళాలి? మానవ సేవే మాధవ సేవ అని నీకు తెలియదా? తక్షణమే విజయుని చెరసాల నుండి విడిపించు. అతనిని తగిన విధంగా సన్మానించు." అని చెప్పాడు. తక్షణమే ధనంజయుడు విజయుని చెరసాల నుండి విడిపించి, తనను క్షమించమని వేడుకుని విజయునికి శాశ్వతంగా రాజ్యాన్ని అప్పజెప్పాడు.