బడాయి నక్క ఎలుకకు బయపడె...(బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼ దార్ల బుజ్జిబాబు

        ఒక అడవిలో ఓ నక్క ఉండేది.
       అది బలే బడాయిది. 
       ఒకరోజు అది ఏనుగును అడిగి తొండం తీసుకుంది. 
       ఎద్దును అడిగి కొమ్ములు తెచ్చుకుంది.  
       ఎలుగు బంటిని అడిగి చర్మం తెచ్చుకుంది. 
       వాటిని ధరించింది. 
       వేటకు బయలు దేరింది.
       దానికి సింహం ఎదురైంది. 
       నక్క ధైర్యంగా వెళ్ళింది.
       రొమ్ము విరుచుకుంది. 
       తొండం లేపింది. 
       కొమ్ములు ఊపింది. 
       వెంట్రుకలు నిక్కబొడిచింది. 
       ఇది ఏదో కొత్త జంతువు అనుకుని
సింహం పరుగు తీసింది. 
       నక్క “ఆహా...ఆహా...ఆహా..” అని నవ్వుకుంది.
       నక్కకు పులి ఎదురయింది. 
       మళ్ళీ అలాగే చేసింది. 
       పులికి చెమటలు పట్టాయి. 
       ఇదేదో గొప్ప జంతువు అనుకొని అటూ ఇటూ చూసి దౌడు తీసింది. 
       నక్క పగలబడి నవ్వుకుంది.
       కాసేపటికి నక్కకు బాగా ఆకలయింది.
        ఏదో ఒక జంతువును పట్టి తినాలనుకుంది.
       దాన్ని చూసి అన్ని దడుచుకుంటున్నాయి. 
       ఒక్కటి కూడా చిక్కలేదు.
       చివరికి ఓ ఎలుక ఎదురయింది.
        "ఎదో ఒకటిలే ఈ పూటకు ఈ చిట్టెలుకతో కడుపు నింపుకుందాం" అనుకుంది. 
       పోయి పట్టుకోబోయింది.
       ఎలుక విశ్వరూపం చూపించింది.
       పళ్ళన్నీ బయట పెట్టింది. 
       పీక్కుతినేదానిలా నక్క మీద పడింది. 
       ఆ దెబ్బకు నక్క ఒకటే పరుగు.
       వెనక్కు చూడుకుండా ఉరికింది.