అత్యాశ (బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼ దార్ల బుజ్జిబాబు

 యాభై ఏళ్ళనాటి మాట. అప్పట్లో పేదలు పరిగి ఏరుకునే వారు. పరిగి అంటే పంట పూర్తయిన తరువాత చేలో రాలి కిందపడిపోయే గింజల కంకులు. వాటిని అలాగే వదిలేసి వెళ్లేవారు రైతులు. ఆ గింజల్ని పక్షులు ఏరుకు తినేవి. అయితే కొంతమంది నిరుపేదలు కూడా వాటిని ఏరుకుని తీసుకు వెళ్లేవారు. ఓ రోజు ఓ ఆసామి వరిచేలో ఎల్లమ్మ, పుల్లమ్మ, లాంటి వారు  చాలా మంది పరిగి ఏరుకున్నారు. ఓ గంటపాటు ఏరి వాటిని మూట కట్టుకుని ఇంటికి వెళ్లిపోయారు.
         అంజమ్మకు ఆశ ఎక్కువ. అందరితో పాటు ఇంటికి వెళ్లకుండా ఆశతో ఇంకా ఏరుతూనే ఉంది. వారితో పాటు ఏరినవి మూట కట్టి చెట్టుకింద పెట్టుకుంది. తన పనిలో నిమగ్నమైంది. ఎండ తీవ్రత ఎక్కువైంది. ఆ తీవ్రతకు వడదెబ్బ కొట్టింది. నీరసపడింది. ఎలాగోలా చెట్టువద్దకు చేరింది. తాను ఏరిన మూట కనిపించ లేదు. ఎవరో ఎత్తుకు పోయారు. లబోదిబోమంది. అతి కష్టంగా ఇల్లు చేరింది. మంచం ఎక్కింది. కోలుకోవటానికి చాలా రోజులు పట్టింది.  అందరిలాగే అంజమ్మ కూడా ఇంటికి వెళ్లి ఉంటే ఏరినవి పోయేవి కావు. ఎండదెబ్బ కొట్టేది కాదు.  అత్యాశకు పోతే అంతే మరి