ఎలుక కంటిలో నలక (బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼ దార్ల బుజ్జిబాబు

        అనగనగా ఓ ఎలుక ఉండేది. 
       ఓరోజు దాని కంట్లో నలక పడింది. 
       కన్నును ఎంత నలిపినా నలక రాలేదు. 
       ప్రయత్నించి, ప్రయత్నించి విసుగు పుట్టి వదిలేసింది.
       కంట్లో నలుసు బాధ మామూలుగా ఉంటుందా? 
       కన్ను ఎర్రగా మారింది. 
       కంటి నిండా నీరే.. 
       ఎదురుగా వస్తున్న తొండతో నలుసు తీయమని చెప్పంది.
       తొండ కన్నునంత కెలికింది. 
       నా వల్ల కాదని చేతులెత్తింది. 
       పరుగు పరుగునా ఉరుకుతున్న ఉడుతను అడిగింది. 
       నలకను తీయమంది.
       ఉడుత ఉఫ్...ఉఫ్... మంటూ ఊదింది.  
       'ఉహు... నా వల్ల కాదు' అంది.
       ఎలుకకు విసుగొచ్చింది.
       చెట్టుకు అతుక్కుపోయిన బల్లిని తీయమని బ్రతిమిలాడింది.
        బల్లి బలమంతా ఉపయోగించి ప్రయత్నించింది. 
       నలుసును తీయలేక పోయింది. 
       ఎలుక ఏడ్చుకుంటూ ఇంటికి పోయింది.  
       కలుగులోకి దూరింది.
       కళ్ళు మూసుకుని పడుకుంది.
       'దిక్కుమొక్కు లేని వారికి దేవుడే దిక్కు కదా?' 
       ఆ దేవుని మీదనే భారం వేసింది.
       కాసేపటికి కునుకు పట్టింది.
       మెలుకువ వచ్చి చూసేసరికి నలక జాడ నలుసంతయిన కనిపించలేదు.
        ఎలుక ఎగిరిగంతేసి గింజల వేటకు  వెళ్ళిపోయింది.