ఆవకాయ -కైతికాలు :--ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
తెల్లనైన అన్నంలో 
ఎర్రగాను ఆవకాయ 
కంచంలో కలిపిచూడు 
తిన్నమజా ఊరగాయ!
వారెవ్వా !ఆవకాయ్ 
ఆంధ్రులకే మాతరోయ్!

పుల్లనైన మామిళ్ళును 
ఆవపిండి మెంతిపిండి 
కొత్తకారం ఇంగువను 
ఉప్పుకల్పి ఉంచుమండి 
వారెవ్వా !పప్పునూనె 
ముక్కమునిగేలా పొయ్యి!

వేడి వేడి అన్నంలో 
వేసి కలిపి తలో ముద్ద
అమ్మ పెడుతుంది చూడూ 
తగువులొచ్చు ఆఖరి ముద్ద 
వారేవా ఆవకాయ 
వానల్లో ఆదుకొనే!

విదేశాలలో ఎగుమతి
 స్వదేశీకి స్వాగతo
సీసాలూ జాడీలూ 
సిరులొలికే ఓ గతం 
వారెవ్వా !సెనగలూ 
ఆవకాయలో రుచులు!

బెల్లమేసి చూడవోయ్ 
తీపిరుచులు ఆవకాయ్
వెల్లుల్లి వేసి చూడు 
కళ్ళు తిరిగె ఘాటు రోయ్ 
వారెవ్వా ! టెంకతోటి 
పెరుగన్నం అద్భుతరుచి!