నీ పట్టును కూల్చాక....:-కిలపర్తి దాలినాయుడు, చిత్రం : భూపతి తునికి
చెట్టును  కూల్చావు నీ
పట్టును కూల్చావు
తల్లిని కూల్చావు నీ
కల్పవల్లిని కూల్చావు

దైవాన్నడిగావు గాలి
దైవం ఇస్తుందా?
దైన్యత నొందావు
కఱవు నిన్ను వదులుతుందా?

చేతులు కాలాకా
ఆకులు పట్టావు
మంటలు రేగాకా 
నీటి గుంటలు తవ్వావు

జలములు పోయాకా
వారథి కట్టావు
కలుములు పోయేక
దేవుని తలచావు

చేసిన పాపాలు తెగ
పట్టి పీడించవా?
వ్యాధుల భూతాలు
పాడెనెక్కించవా?

తెలుసుకోర మనిషీ
నీ క్షేమం కోరేదెవరో?
కలుసుకోర మనిషీ
నీకు ప్రాణం పోసేదెవరో!