*చిట్టి*:-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 తళతళ మెరుపులు - మెరుస్తుండగా
దడదడ ఉరుములు - ఉరుముతుండగా
చిటపట చినుకులు - రాలుతుండగా
దబదబ వర్షం - కురుస్తుండగా
జలజల నీళ్ళు - పారుతుండగా
మలమల కడుపు - మాడుతుండగా
నకనకలాడే - కడుపు చూసుకుని
జరజర ముందుకు - జరిగెను చిట్టి!
బిరబిర నడిచి - డబ్బా తెరిచి
మురుకు తెచ్చిన - అమ్మను చూసి
చరచర ముందుకు - నడిచెను చిట్టి!
కరకరలాడే - మురుకును చిట్టి
కసకస కొరికి - పరపర నమిలి
బరబర మింగి - హాయిగ చూసింది!
కణకణలాడే - నిప్పుల లాంటి
కోపం కాస్తా - జరజర జారింది!
కువకువ పిట్టల - పాటలు వింటూ
కళకళలాడే - చిట్టి కన్నులు
మిలమిల మెరవగ - కిలకిల నవ్వింది!
చిట్టి నవ్విన - నవ్వుకు కొంచెం
బుసబుస బుగ్గల - బూరెలు పొంగాయి
వేడి నిప్పుయే - చల్లని మంచుగ
మారిన తీరుకు - అంతా ఆనందించారు !!