*కార్పొ "రేటు"వైద్య-కాలయములు!* :-*కిలపర్తి దాలినాయుడు*
 సీ౹౹
కాపాడువారని-కంగారుపడి పోవ
రూకలు పిండెడి-డ్రాకులాలు!
ప్రాణంబు నిలబెట్టు-వైద్యశాలలకేగ
లక్షలు లాగుటే-లక్ష్యమగును!
వెంటిలేటరుబెట్టి-వెక్కుచున్నారని
బెదిరించి డబ్బును-పిండుచుంద్రు!
రక్తంబులేదంచు-రయమున దెమ్మంచు
రక్తంబు బీల్చెడి-రాక్షసాళి!
తే.గీ౹౹
బిల్లు కట్టు మంచు-గొల్లుజేయునుగాని
రోగి క్షేమమడుగ-నూగి పోవు!
మందు మాయ జేయు-మంచంబు లేదంద్రు
కార్పొ "రేటు"వైద్య-కాలయములు!
సీ౹౹
తలనొప్పిజూపినన్-తట్టెడు మందులు
కొనిపించి జంపుచు-కొంపలార్పు!
కడుపునొప్పనివేడ-మెడికలు టెస్టుల
పేరుతో దోచెడి-వెజ్జులచట!
గంటగంటకు బిల్చి-కన్నీళ్ళు బెట్టించు
వార్తలంజెప్పుచు-బాదుచుండు
ఏసీలలోబెట్టి-మూసినోటిని కట్టి
రోగిని జేయులే-మూగ మతిగ!
తే.గీ.
మాన వత్వంబు కించత్తు-మదినిలేక
కాసులనుబీల్చు జలగలై-గాంచుచుంద్రు
గుండెలనుపిండి ధనమునే-కోరుచుంద్రు
కార్పొ "రేటు"వైద్య-కాలయములు!