కరోనా నాశని!: -- దోర్బల బాలశేఖర శర్మ

 ఉన్నట్టుండి ఇంటిల్లి పాదీ అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, ఒళ్ళు నొప్పులు, బలహీనత .. అందరికీ. ఒకరోజు తగ్గితే, మర్నాడు మళ్లీ అదే పరిస్థితి. ఎవరికి వాళ్ళు బెడ్ సిక్ అయ్యారు. రోజులు గడుస్తున్నా ఎలాంటి మార్పు లేదు. ఎవరో పుణ్యాత్ములు భోజనాలు తెచ్చిస్తున్నారు. ఔషధాలు అందుతున్నాయి...

ఒకరోజు అర్ధరాత్రి ఇంట్లోని వృద్ధురాలికి మెలకువ వచ్చింది. ఒంట్లో వేడికి కళ్ళు మండుతున్నా హఠాత్తుగా కళ్లు తెరిచి చూసింది... ఎదురుగా ఒక వింత, భీకర ఆకారం. భయంతో మళ్లీ కళ్ళు మూసుకోబోయింది. 
"ఆగు..." వినపడిన గొంతు కర్ణ కఠినంగా ఉంది.
"ఎందుకు?.." అంది పెద్దామే భయపడుతూనే.
"ఇవాళ... ఈ ఇంట్లోని ఒకరి ఊపిరిని పూర్తిగా ఆపేసి పైకి పంపించాలి. ముందు ఎవరిని తీసుకెళ్లాలా అని చూస్తున్నాను. ఇంటికి పెద్దదానివి కదా, నువ్వు చెప్పు" 
"ఎందుకు... ఎందుకిలా మమ్మల్ని వేధిస్తున్నావ్? అసలు నువ్వెవరు?"
"నా పేరు కరోనా. మనుషుల ప్రాణాలు తోడేయడమే నా పని."
"మనుషులు ఏం పాపం చేశారని మా వెంట పడ్డావ్. నీకిది న్యాయం కాదు..."
"అదంతా నాకు తెలియదు. నీతో మాట్లాడుతుంటే నేను వచ్చిన పని మరిచిపోయేలా వున్నాను. ముందు ఎవరో ఒకరి ప్రాణం తీస్తాను. ఆ తర్వాత నీతో ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు... తొలుత ఆ లేత పదేండ్ల పిల్ల పని పెడతాను...." అని అటువైపు తిరిగింది. ఇంతలో పెద్దమ్మ అంది...
"అయ్యో దేవుడా. అది చిన్నపిల్ల. దాన్నేమీ చేయకు. దానికి బోలెడు భవిష్యత్తు ఉంది. నీకు ఎవరో ఒకర్ని చంపడం తప్పదనుకుంటే నన్ను చంపేయ్..."
ఇంతలో ఇంటాయన లేచాడు.
"అమ్మా..ఏంటి, ఎవరితో మాట్లాడుతున్నావ్?"
ఆ కొడుకు వెనకే కోడలు కూడా లేచింది. కాస్సేపట్లో వాళ్లకూ విషయం అర్థమైంది. జరిగిందంతా పూస గుచ్చినట్లు చెప్పింది పెద్దామే. అందరిలోనూ భయం. కరోనా చిరాగ్గా మొఖం పెట్టింది.
దాంతో ఆలస్యం చేయకుండా కోడలు అంది...
"ఆమె మా ఇంటి వేల్పు. దయచేసి మా అత్తమ్మను ఏమీ చేయకు. నా బిడ్డను కూడా వద్దు. ఎందుకంటే, అది చిన్నపిల్ల. కావాలంటే నన్ను తీసుకుపో".
కరోనాకు షాక్ తగిలినట్లయింది. ఏంటి వీళ్ళు, ఇలా మాట్లాడుతున్నారు... ఇంతలో మరో గొంతు వినిపించింది...
"అయ్యో వద్దు, వద్దు. ఆమె ఈ ఇంటికి కాబోయే వేల్పు. నా భార్యనేమీ చేయకు. మా అమ్మను, నా ఒక్కగానొక్క కూతురును కూడా వద్దు. ప్లీజ్, నేను రెడీ. నన్ను తీసుకుపో". కరోనా అటువైపు చూస్తే, కనిపించాడు, ఒక మధ్యవయస్కుడు.
ఇంతలో తలుపు తోసుకొని ఎవరో వచ్చారు. అందరూ అటు చూస్తే, పీపీఈ కిట్ తో డాక్టర్. కరోనా అటువైపు తిరిగింది. 'వీళ్లంతా నా పనికి ఆటంకం కల్పిస్తున్నారు. ఆ కొత్త వ్యక్తిని పట్టేస్తే సరి' అనుకుని, డాక్టర్ దేహంలోకి ప్రవేశించ బోయింది. కానీ ఎక్కడా లోనికి వెళ్ళడానికి అసలు చోటు దొరకలేదు. ఆయన చుట్టూ తిరుగుతూ ఆపసోపాలు పడుతున్నది. ప్రజా వైద్యునికీ విషయం అర్థమై, వెంటనే అన్నాడు- 
"అమాయకులైన వాళ్ళమీద కాదు, నీ ప్రతాపం. చూద్దాం, నాలోకి ప్రవేశించు. అది నీవల్ల కాదు. ఎందుకంటే, నేను నిన్ను ఎదుర్కోవడానికి సర్వ సన్నద్ధుడను. నువ్వు అరిచి గీ పెట్టినా నీకు అవకాశం ఇవ్వను. ఎక్కువ మాట్లాడితే సానిటైజర్ లో ముంచి చంపేస్తాను..." మీదిమీదికి వస్తున్న డాక్టర్ ను చూస్తే కరోనాకే భయమేసింది. ఒక్క అడుగు వెనక్కేసింది. అప్పుడే తలుపు వద్ద అలికిడి. అందరూ అటు చూస్తే, అక్కడ భోజనాల ప్యాకెట్లతో తమవైపే చూస్తున్న వలంటీర్.
"నాకు విషయం అర్థమైంది. ఓ కరోనా! నీకే మాత్రం రోశమున్నా, నన్ను చంపు, చూస్తాను. అసలు నువ్వు నన్ను కనీసం తాకగలవా? డాక్టర్ కు ఉన్నట్టు నాకు పీపీఈ కిట్టుకూడా లేదు. ఒక్క మాస్కుతోనే నిలబడ్డాను, రా. ఇక్కడే కాదు, నువ్వు వుండే ప్రతి చోటుకు నేను వస్తాను. రావడమే కాదు, నీ సమూహం మధ్యలోంచి దూసుకు వెళతాను.... "
ఆ వలంటీర్ కేసి చూసింది కరోనా. అతని చుట్టూ అగ్ని వలయం వలె 'గుండెధైర్యం'. అవసరమైతే కొద్ది క్షణాలపాటు ఊపిరిని సైతం బిగపట్టేంత 'యోగశక్తి'. అంతే, తటపటాయిస్తూ, పారిపోవడానికి కిటికీల వైపు చూసింది. అవి తెరిచే వున్నాయి. ఇంకా ఆలస్యం చేసై, డాక్టర్ దగ్గరికి వచ్చేస్తున్నాడు...
'అసలేం మనుషులు వీళ్ళు? కుటుంబ సభ్యులమధ్య ఇంత త్యాగనిష్ఠనా? ఇన్ని విలువలు, ఇంత ధార్మికతా? ఎంత జాగ్రత్త, ఎంత మనో నిబ్బరం? నేను ఎక్కడినించి వచ్చానో అక్కడికే వెళతాను. నన్ను పుట్టిచ్చిన వాణ్ణే అడుగుతాను, 'నన్నెందుకు సృష్టించావని?' సమాధానం ఇవ్వకపోతే, అక్కడికక్కడే చచ్చిపోతాను. వాడి తిక్క కుదురుతుంది.

కామెంట్‌లు