తంగెడు:- రామ్మోహన్ రావు తుమ్మూరి
ఆకుపచ్చ లంగావోణి రైకదొడుక్కుని
పసుపుముద్దలు తపుకుల వెట్టుకోని
బుజంకాడికి మలిచి అరిచేతుల వట్టుకున్న ఆడిపిల్లల్లెక్క 
అడివిల తంగెడుజెట్లు 
ఆటలాడుతున్నట్టుంటయ్

తొవ్వ పొంటి పోతుంటె
తొవ్వకటీటు గన్పించే గీ చెట్లు
చెట్లకు బతుకమ్మలు పూసినట్లుంటయ్

పొద్దు వొడువంగనొ
పొద్దుగూకెటాలకో తంగెడు చెల్క జూసినప్పుడు
గా యెండపొడలల్ల
నగలు పరిసిపెట్టిన బంగారపు దుకనం లెక్క గొడ్తది

జరంతసేపు గాయిటి పక్కన నిలవడ్తె జాలు 
పూలనుగమ్ముకున్న  పల్లెటూరి
అత్తరు వాసన ముక్కుకు దగిలి 
పానం లేసత్తది

కాపురాజయ్య గీసిన బొమ్మలోల్గె
తంగెఢుపూలచెటను జూత్తె
నా తెలంగాణతనం ఉట్టిపడతది

బతుకమ్మ బారమంత 
తాంబాళంల తంగెడుబూల తీర్పాటం మీదనే నిలవడ్తది

అవుమల్ల
తెలంగాణ తాకత్ గీ తంగెడు
గీ మట్టిల బుట్టిన దిక్కత్ గీ తంగెడు
గిది మా షరాఫత్ ఫరాకత్ ఔసత్ గుడ
నివద్దుల్ల
గీ తంగెడు 
తెలంగాణతల్లి
కొంగుముడిసిన బంగారం సుత


కామెంట్‌లు