ఆనందం,ఆవేదన నిచ్చెనల మీద
కలిగే స్థాయీభావానుభూతి
నిలబడ్డ కర్తవ్యపు క్రమశిక్షణ లోంచి వినిపించే శ్రమగీతపు స్వేద ధ్వని
వంటింటి వాసనల కసరత్తు చేసిన అమ్మ మసాలా దినుసుల లోంచి ఎగసిపడే ఆవిరి పరిమళం
ఆరుగాలం పండించిన పంట
కోసం వడిపిన రైతు కన్నీరు
తరిగిన వెన్నుపాము నిటారు!
పూవులలో మకరందమై నిలిచే
పచ్చి పేడ సువాసన !
భగ భగమనే కొలిమి లోంచి మలిచిన చక్రపుటంచుల మీద పయనించే ప్రగతి జాడలలో నిలబడిన విజయ రహస్యం
రాసే అక్షరాలు చేసిన గాయం లోంచి కారే కవి భావనా హృదయార్ద్రత
ఇవి నిండిన పద్యాలకు ప్రవహించిన జీవ జలాలు
శ్రీశ్రీలు కాళోజీలు సినారేలు
ఎత్తిన కాహాళలు
శృంగారం అంగారం ఏదైనా అనుభవ సారమే అంతిమ రహస్యం
ఏ ప్రపంచ రికార్డు పుస్తకాలు నమోదు చేయని ఈధారలు కితాబులు లేని మతాబులు
ఈ చుక్కలు లేకుంటే
సేదదీరలేక రాత్రిమీది
మింటి చుక్కలు వెల వెల లాడుతాయి చంద్రుడు కళ్ళప్పగిస్తాడు
చెమట
ఎవరి బుగ్గమీద చుక్కయి నిలుస్తుందో
ఒంటి మీద వెండి వెలుగై
మెరుస్తుందో
అతడే కదా ఈ దేశాన్ని నడిపే పచ్చని ఏలిక
జోతలందుకొనే పాలిక
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి