"ధర్మం":-ఎం. బిందు మాధవి

 సరస్వతి విద్యాలయంలో ఆ రోజు అంతర్ స్కూళ్ళ వక్తృత్వ పోటీలు జరుగుతున్నాయి. విద్యార్ధి సలహాదారు కుముదిని "పిల్లలూ గుర్తుందిగా, ఈ రోజు మధ్యహ్నం లంచ్ తరువాత పోటీలున్నయని? మాట్లాడ దలచుకున్న విషయం మీద బాగా తయారయ్యారా? ధైర్యంగా, ఆత్మ విశ్వాసంతో మాట్లాడండి. బహుమతి వచ్చిందా రాలేదా అనేది ముఖ్యం కాదు. దాని గురించి ఆందోళన పడకండి. మన ప్రయత్నం మనం చెయ్యాలి! మనం అనుకున్న విహయాన్ని ఎంత బాగా అవతలి వారికి చెప్పగలిగాము అనేది ముఖ్యం" అని వెన్ను తట్టి ఏర్పాట్లు చూడటానికి అసెంబ్లీ హాల్లోకి వెళ్ళారు.

ఎనిమిది, తొమ్మిది, పది క్లాసుల పిల్లలు పాల్గొంటున్న పోటీ అది.
ఒక పెద్ద సైన్స్ ల్యాబ్ చీఫ్ ని ముఖ్య అతిధి గా పిలిచారు. ఆయన, స్కూల్ ప్రధానోపాధ్యాయుడు వేదిక మీద కూర్చున్నారు.
న్యాయ నిర్ణేతలు ముందు వరసలో కూర్చున్నారు.
పిల్లలు ఒక్కొక్కరే వేదికనెక్కి తాము చెప్పదలచుకున్న విషయాన్ని చక్కగా గట్టి కంఠ స్వరంతో అందరి వైపు చూస్తూ చెబుతున్నారు.
నాగార్జున్ వంతు వచ్చింది. ఒక్మ సారి ప్యాంట్, షర్ట్ సరి చూసుకుని వేదికనెక్కాడు.
"నా పేరు నాగార్జున్, నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను" అని పెద్దల వైపు తిరిగి నమస్కరించి, మిత్రులందరిని చూసి చిరునవ్వు నవ్వి
"నేను ఈ రోజు మాట్లాడబోతున్న విషయం "ధర్మం". మనుషులందరికీ అనేక ధర్మాలుంటాయి. అవి సమాజ ధర్మం, మానవ ధర్మం, స్నేహ ధర్మం, విద్యార్ధి ధర్మం, పుత్ర ధర్మం ఇలా అన్నమాట!"
"ఉదాహరణకి ఎక్కడయినా నీళ్ళు కారిపోతున్నయనుకోండి, మనకి సబంధం లేనట్టు తలొంచుకు వెళ్ళిపోకుండా వెళ్ళి ఆపాలి. అలాగే ఎవ్వరూ లేని చోట ఫ్యాన్ తిరుగుతుంటే స్విచ్ ఆపాలి. స్కూల్ ప్రాంగణంలో చెత్త, కాయితాలు పడుంటే తీసి చెత్త బుట్టలో వెయ్యాలి. అది "సామాజిక ధర్మం!"
"మొన్న మేము పార్కులో ఆడుకుంటుంటే, ఒక ముసలావిడ కళ్ళ జోడు పక్కన పెట్టి అది కనిపించక వెతుక్కుంటున్నది. నేను గమనించి ఆట మధ్యలో ఆపి వెళ్ళి అది తీసి ఆవిడ చేతికిచ్చి వచ్చాను. ఆవిడ తల మీద చెయ్యేసి నీకు మంచి అలవాట్లు నేర్పిన పెద్దలకి నమస్కారం. బాగా చదువుకో అంటున్నప్పుడు ఆమె కళ్ళల్లో కనిపించిన ఆనందపు వెలుగు నాకింకా గుర్తుంది. అది "మానవ ధర్మం".
"ఇక స్నేహ ధర్మం గురించి చెప్పాలంటే...మొన్న ఉదయం విద్యార్ధులమందరం హడావుడిగా మెట్లెక్కుతుంటే కాలుకి కాలు మెలిక పడి వినయ్ పడిపోయాడు. మెట్టు తగిలి నుదురు చిట్లింది. రక్తంకారుతుంటే ఆకాష్ వినయ్ ని ఆఫీస్ రూం కి తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించి క్లాసుకి లేట్ గా వచ్చాడు. లేట్ గా వచ్చినందుకు, వాడి షర్ట్ మీద ఉన్న రక్తం మరకలు చూసి టీచర్ తప్పుగా అర్ధం చేసుకుని కేకలేశారు. వాడు జరిగింది ధైర్యంగా టీచర్ కి చెప్పి, 'అలా వదిలేసి రాకూడదు కదా! వాడు నా ఫ్రెండ్ ' అన్నాడు ఆకాష్. అది "స్నేహ ధర్మం" అన్నాడు.
"మనం మన ధర్మం నిర్వర్తించేటప్పుడు భయపడకూడదు. అందులో న్యాయం ఉంటే పెద్దలు నిగ్గదీసినా, భయ పెట్టినా జంక కూడదు అని మా అమ్ముమ్మ చెప్పింది. దానికి ఉదాహరణగా రామాయణంలో సంఘటన కూడా చెప్పింది. అదేమిటంటే రాముడు లంక చేరటానికి సముద్రం దాట వలసి వచ్చినప్పుడు ఉవ్వెత్తున తరంగాలు ఎగిసిపడుతున్న సముద్రుడిని రాముడు వేడుకుంటాడు. తనకి బలముందని విర్రవీగకుండా... తన భార్య లంకలో బంధించబడిందని, సముద్రుడిని దారి ఇచ్చి తన కార్యం సఫలం అవటంలో సహాయం చెయ్యమని అడుగుతాడు.
"స త్రిరాత్రోషితస్తత్ర న యజ్ఞో ధర్మ వత్సల:,
ఉపాసత్ తదా రామ: సాగరం సరితాం పతిం."
[నీతి తెలిసిన వాడు, ధర్మమునందు ఆసక్తి కలవాడు అయిన రాముడు అక్కడ మూడు దినములు శయనించి నదుల భర్త అయిన సముద్రుని ఉపాసించెను]
అయినా సముద్రుడు రామునికి ప్రత్యక్షం కాలేదు. అప్పుడు రాముడు లక్ష్మణునితో
"అవలేప: సముద్రస్య న దర్శయతి య: స్వయం
ప్రశమశ్చ క్షమా చైవ ఆర్జవం ప్రియవాదితా,
అసామర్ధ్య ఫలా హ్యేతే నిర్గుణేషు సతాం గుణా:"
[ ఈ సముద్రనికి ఎంత గర్వము? సత్పురుల్లో ఉన్న శాంతి, ఓర్పు, ప్రియముగా మాటలాడుట అను నా గుణములను సామర్ధ్యము లేని వానిగా భావిస్తున్నాడు.]
"అద్య మద్బాణ నిర్భగైర్మ కరైర్మకరాలయం
నిరుద్ధతోయం సౌమిత్రే ప్లవద్భి: పశ్య సర్వత:"
[ లక్ష్మణా ఇప్పుడు ఈ సముద్ర జలములంతటా నా బాణముల చేత చేదించి మొసళ్ళు తేలుతూ నీరు అడ్డుకునేలా చేస్తాను చూడు అంటాడు]
"సశంఖ శుక్తి కాజాలం సమీనమకరం తధా
అద్య యుద్ధేన మహతా సముద్రం పరిశోషయే"
[శంఖములతో, ముత్యపు చిప్పలతో, మీనములతో, మకరములతో నిండిన ఈ సముద్రమును వీటన్నిటితో సహా మహా యుద్ధములో ఎండింప జేసెదను.]
ఓర్పు గల నన్ను ఈ సముద్రుడు అసమర్ధుడనుకుంటున్నాడు. ఇప్పుడు కోపించిన నేను తీరములందు కట్టుబాటును పాటించుచూ, వేలకొలది తరంగాలతో వ్యాకులమయిన ఈ సముద్రమును తీరము దాటునట్లు చేసెదను, అని తన ధనుర్బాణాల చేత జగత్తుని కంపింప జేశాడు. సముద్రాన్ని అల్లకల్లోలం చేశాడు. తరువాత రాముడు ఓ సముద్రమా నిన్నిప్పుడే ఎండింప జేస్తాను. అప్పుడు వానరులు కాలి నడకన సముద్రాన్ని దాటగలరు అని మళ్ళీ బాణం ఎక్కుపెట్టి విడిచే లోపు సముద్రుడు ప్రత్యక్షమయి
"పృధివీ వాయురాకాశమాపోజ్యోతిశ్చ రాఘవ
స్వభావే సౌమ్య తిష్ఠంతి శాశ్వతం మార్గమాశ్రితా:"
[సౌమ్యుడవైన రామా...పంచ భూతాలయిన భూమి, వాయువు, ఆకాశము, జలము అగ్ని ...తమ శాశ్వతమయిన మార్గమును ధర్మమును అనుసరించి తమకు ఏది స్వభావమో దానిని దాటకుండా ఉంటాయి.]
"వాయువుకి ఎక్కడికయినా ప్రసరించటం, ఆకాశానికి వ్యాపించటం, జలం పల్లంలోనికి ప్రవహించటం, అగ్నికి కాల్చటం సహజ ధర్మాలు."
"లోతుగా దాట శక్యము కాకుండా ఉండటం అనేది నా సహజ స్వభావము. లోతు లేకపోవటం నాకు విరుద్ధం! మొసళ్ళతో వ్యాకులంగా ఉండు జలమును నేనెన్నడూ ఏదయినా కోరిక వలన కానీ, లోభము వలన కానీ, భయము వలన కానీ, ప్రేమ వలన కానీ స్తంభింప చేయను. అలాగే చెలియలి కట్ట దాటను. కావున నీ ఈ కోపాన్ని ఉపశమింప చెయ్యి" అని సముద్రుడు తనని దాటటానికి మార్గాంతరం చెబుతాడు. అంతే కానీ రామచంద్ర మూర్తి కోపానికి భయపడలేదు. ప్రశాంతంగా స్వభావాన్ని, ధర్మాని చెప్పి రాముడిని శాంత పరిచాడు.
"కాబట్టి ధర్మ నిర్వహణ చేసేటప్పుడు భయ పడకూడదు. పడిపోయిన వినయ్ కి సహాయం చెయ్యటం తన ధర్మంగా భావించిన ఆకాష్ టీచర్ ముందు ధైర్యంగా నిలబడి తను నిర్వర్తించిన ధర్మాన్ని చెప్పాడు."
"ధర్మాన్ని వదిలిపెట్టకూడదు అని రామాయణ కావ్యం లోని ఈ సంఘటన ద్వారా మనకి తెలుస్తుంది" అని చెప్పి వేదిక దిగాడు.
అందరూ ఐదు నిముషాలు ఆపకుండా చప్పట్లు కొట్టి నాగార్జున్ ని అభినందించారు.
"కుముదిని టీచర్ వేదిక మీదికి వచ్చి ఈ రోజు మన పోటీలు దిగ్విజయంగా ముగిశాయి. మన న్యాయ నిర్ణేతలు తమ నిర్ణయాన్ని నాకు ఇచ్చారు. మీరందరూ నిశ్శబ్దంగా కూర్చుంటే, నేను విజేతల పేర్లు ప్రకటిస్తాను"అన్నారు.
"నాగార్జున్ ని మొదటి బహుమతి విజేతగా ఎన్నిక చేశారు. ఇతన్ని స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన పిల్లలు కూడా ఈ సారి పోటీలకి మన సాహిత్యాన్ని చదివి మంచి విషయాలు తెలుసుకుంటారని ఆశిస్తాను" అన్నారు.
ముఖ్య అతిధి గారు బహుమతి అందజేసి, నాగార్జున్ ని భుజం తట్టి అభినందించి "బాగా మాట్లాడావు. ఎన్నుకున్న విషయం బాగుంది. నువ్వు బాగా లోక జ్ఞానం పెంచే పుస్తకాలు చదువు" అని "పిల్లలూ ఈ సారి సైన్స్ మీద పోటీ పెట్టమని నిర్వాహకులకి చెబుతాను అన్నారు నవ్వుతూ!
నాగార్జున్ ఉత్సాహంగా ఇంటికొచ్చి అమ్ముమ్మకి తన బహుమతి చూపించి "అమ్ముమ్మా నాకు నువ్వు మన పురాణాలు నేర్పిస్తున్నావు కదా! నేను రాముడు సముద్రుడి మీద కోపం వచ్చి బాణం ఎక్కుపెట్టిన సంఘటన గురించి మాట్లాడాను. అందుకే నాకు మొదటి బహుమతి వచ్చింది" అని ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి కౌగిలించుకున్నాడు.