నేటి శ్రీరామనవమి:-డా.. కందేపి రాణీప్రసాద్.

 శ్రీరామనవమి నా చిన్నప్పుడు ఎంతో ఆర్భాటంగా జరిగేది. తొమ్మిది రోజుల పాటు పిల్లలకు ఆటలు పాటలు అన్ని పందిళ్ళ కిందే. ఏ ఇంట్లో పెళ్ళయితే ఆ ఇంట్లో ముందు మాత్రమే పందిరి వేసుకుంటారు. ఇది జగదానందకారకుడైన శ్రీ సీతా రాముల వివాహం కదా! ప్రతి ఊరిలోనూ, ప్రతి వీధిలోనూ శ్రీ రామనవమి పందిల్లె, పందిళ్ళ కింద సందల్లె. రోజుకోకరు పిటల మీద కూర్చోవటం, వడపప్పు పానకం పంచటం, పిల్లలంతా పానకం కోసం ఎగబడటం చాల తమాషాగా ఉండేది. పానకం పోయించుకోవటానికి కొంత మంది గ్లాసులు తెచ్చుకుంటే కొంత మంది చెంబులు, మరి కొంత మంది పెద్ద గిన్నెలు తెచ్చుకునేవాళ్ళు. ఆ తొమ్మిది రోజులు పిల్లల పొట్టలు వడపప్పు పానకాలతో నిండిపోయేవి.
పెద్దలకు పిల్లలకు అసలైన ఆసక్తికర అంశం ఇమ్మంటే రాత్రి పది దాటినా తరువాత పందిళ్ళలో సినిమాలు వేసేవాళ్ళు లవకుశ, శ్రీ రామాంజనేయ యుద్ధం, పాదుకా పట్టాభిషేకం, సీత కళ్యాణం, శ్రీ రామ పట్టాభిషేకం, సీతరాముల కళ్యాణం, శ్రీరామ కథ అంటూ రోజుకో సినిమా వేసేవాళ్ళు. చాల మంది ఆ సినిమాల కోసం అన్నం తినేసి దుప్పట్లు చంకన పెట్టుకొని పోయేవాళ్ళు. సీతమ్మ కష్టాలు చూసి కన్నీళ్ళు పెడుతూ, ఒళ్లోని పిల్లలను జోకోడుతూ సినిమాను చూసేవాళ్ళు. పందిళ్ళలో ఫ్రీ గా సినిమాలు వేస్తున్నారంటే ప్రజలు ఎంతో సంతోష పడేవాళ్ళు. మా వదినలు, అత్తలతో పాటు నన్ను తీసుకెళ్ళేవాళ్ళు  వెళ్ళిన కాసేపటికే నిద్రపోతే ఎత్తుకుని తీసుకొచ్చేవాళ్ళు. మా అమ్మ నాన్న అసలు రారు. నన్ను కూడా తిసుకువెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. తెల్లారి ఇంటి దగ్గర వాళ్ళు చెప్పుకునే మాటలే నాకు తెలిసిన విషయాలు నేను స్వయంగా రెండు మూడు సినిమాలు మాత్రమే చూసుంటాను. కాని పందిళ్ళలోని కల్యాణానికి వెళ్ళేవాళ్ళం. కళ్యాణం అయిపోయాక చిన్న సబ్బు పెట్టెలు, దువ్వెనలు, ప్లాస్టిక్ బొమ్మలు లాంటివి పంచేవాళ్ళు. వీటి కోసం ఎగబడి వెళ్ళేవాళ్ళు కొంతమంది అయిపోతే ఇవ్వరని.
ఇవన్ని కాదు గాని శ్రీ రామనవమి వేడుకల్లో చాలామంది కళాకారులు పుట్టుకొచ్చేవారు. పిల్లల చేత పాటలు పాడించడం, డ్యాన్సులు చేయించడం, రామ లక్ష్మణుల్లా వేషాలు వేయించటం, పద్యాలు, శ్లోకాలు పాడించడం చేసేవారు. సాయంత్రం పూట ఇవన్ని జరగటంతో చాల సరదాగా ఉండేది. శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి అని పాటలు పడటం సంతోషం. భ్రమరాంబాష్టకం, లింగాష్టకం వంటి కష్టమైన శ్లోకాలను పాడి వినిపిస్తుంటే బాగా చదువుతున్నావని మెచ్చుకుంటే చాలు ఆ రోజంతా గాల్లో తేలిపోవటమే. రేపేం పాట పాడాలి అని రోజంతా వెతకటం, ప్రాక్టిస్ చేయటం, తెల్లేరి అందరిముందు ప్రెజెంట్ చేయటం అదొక సరదా ఉండేది మా పిల్లలకి. ఇవే కాకుండా పెద్దవాళ్ళు చేసే భజనల్లో సైతం పాల్గొని తాళాలు వేస్తూ రాత్రంతా మేలుకోవటం ఒక ఘన కార్యం చేసిన ఫీలింగ్.
నిరిడు మాత్రం శ్రీరామనవమికి ప్రత్యేకమైన అలంకారాన్ని తాయారు చేశాను. నిరుడంతా లాక్ డౌన్ కావడంతో, అమ్మ అనారోగ్యంగా ఆక్సిజన్ పెట్టుకుని ఉండటంతో ప్రతి పండుగనూ అద్భుతంగా నిర్వహించాలని అనుకున్నాను. ఆ అలంకారాల్ని చూసి అమ్మ చాల సంతోష పడింది. మేం చేసిన పండుగ అలంకారాలన్నీ అమ్మకు సిలెండర్ కనెక్షన్ తీసేసిన ఆక్సిజన్ అందేలా చేశాయి. అయోధ్యలో రామాలయం కట్టడానికి పూనుకున్నరన్న వార్త మరింత సంతోషపరిచింది. అందుకే శ్రీరామనవమి పండుగ నాడు ‘ జై శ్రీరాం ‘ అన్నా అక్షరాలను, రామ పాదుకలను, రాముని ధనస్సు, విల్లంబులు, అమ్ములపోది అన్నింటిని ఆసుపత్రి వ్యర్థ పదార్థాలతో రూపొందించాను. ఇంకా అయోధ్య ఆలయానికి పంపే ఇటుకలను తయారు చేశాను. ఇంతే కాకుండా ఓం కారాన్ని, స్వస్తిక్ ఆకారాన్ని సృజించాను చాల బాగా కుదిరింది. ఈ మొత్తాన్ని వీడియో తీశాను. ఆ వీడియోకు ‘ అంత రామమయం, జగమంత రామమయం ’ అనే పాటను జోడించి ఫేస్ బుక్ లో పెడితే అందరి మన్ననలు చూరగొన్నది. ‘ ఎంత బాగా చేశావో ‘ అంటూ మా అమ్మ ఎంతో సంతోషించింది. అంతకు ముందంతా పండుగకు బాగా దేవుడి అలంకారాలు చెయ్యనని మా అమ్మ పిర్యడును ఈ సంవత్సరం పోగొట్ట దలుచుకున్నాను ఇలా ఆసుపత్రి వ్యర్థాలతో శ్రీరాముని కళ్ళకు కట్టినట్లు చూపిస్తే మా అమ్మాయి పెద్ద కళాకారురాలు అనుకుంటూ పొంగిపోయింది.
రెండేళ్ళ నుంచి హిందూ సాంప్రదాయాలను విడియోలుగామలుస్తూ ఉంటె ఆమె కళ్ళు చెమర్చాయి. పట్టుచీరలు కట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకోవటం, చేతినిండా మట్టిగాజులు వేసుకోవటం, గోరింటాకు పెట్టుకోవటం వంటి పనులన్నీ లాక్ డౌన్ కాలంలో చేస్తుంటే విపరీతంగా ఆనందపడింది. ఆమె ఉన్న పరిస్థితిలో తనకేమిష్టమో అవి చేసి ఆనందపెట్టటం తప్ప మనమేం చేయగలం. వీటిని చూసి ఆనందపడుతుంటే అమ్మ గుండె మాత్రం కుల్లుకొని మరింత ఇబ్బంది పెట్టి రాత్రంతా నిద్ర లేకుండా చేసి పగలు పొందిన ఆనందాన్ని ముక్కలు ముక్కలు చేసేది.
ఈ సంవత్సరం శ్రీరామనవమికి నిరుటి విషయాలన్నీ గుర్తు చేసుకొని బాధపడటం తప్ప ఏం చేయగలం. చాలా మందికిలాగే నాకు 2020 విషాద సంవత్సరమే. నేను పుట్టిన దగ్గర్నుండి నన్ను దగ్గరుండి చూసుకునే అమ్మను నా నుండి లాక్కెళ్ళి పోయింది. నా బొమ్మల్ని చూసి ఎవరు సంతోషపడతారు, నా కవితల్ని వేడిగా విని ఎవరు ఆనందిస్తారు, నేను పాడిన పాటల్ని విని అచ్చం ఒరిజినల్ పాటలాగే వచ్చిందని మెరిసే కళ్ళతో ఎవరు చెపుతారు. ఈ సంవత్సరం మాకు పండగ లేదు కాబట్టి పోయిన శ్రీరామనవమినే గుర్తు చేసుకుంటూ అమ్మని గుండె నుండి కళ్ళలోకి తీసుకొచ్చి కన్నీరు కార్చటమే ఈ పండగ విశేషం.