అనురాగమందిరం(వచనకవిత)డా.రామక‌ కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.

 పండుటాకులను‌ పదిలంగా చూసుకొనే దేవాలయమది
ముదిమి మీదపడి ఏకాకులైన వారి అనురాగమందిరమది
కన్నబిడ్డల నిరాదరణకు గురై చేరుకున్న ఆఖరిమజిలీయది
అనుబంధాలకు అర్థం లేక,అడిగే దిక్కులేక వదిలివేయబడ్డ వృద్ధుల ఆశ్రయమది
సమాజానికి అక్కరలేని ముసలివారి సమష్ఠి నివాసమది
చేయూతనివ్వాల్సిన‌ వయసులో చేష్ఠలుడిగిన పుత్రులు వదిలిపెట్టిన పర్ణకుటీరమది
వయసుమళ్ళి‌,ఎముకలు‌గూడులైన వారి వినోదప్రాంగణమది
ఆధునికత పేరిట భారాలను దించుకుంటున్న అమానవీయ చిరునామా అది
ముడతలుపడ్డ శరీరం,సహకరించని అవయవాలతో వేదనకు గురవుతున్న
పెద్దమనుషుల సేవాసదనమది
జీవితపు ఆఖరిదశలో ప్రేమను ‌పొందేందుకు‌ వయసుమీరిన వారి ప్రేమసదనమది
కన్నబిడ్డల పాషాణ హృదయాల పలకరింపులకు
నోచుకోని విధివంచితుల చింతనాగృహమది
వృద్ధాశ్రమం ఆధునిక కొడుకులు కనుగొన్న వసతిగృహం
కుటుంబ వ్యవస్థ సిగ్గుతో తలదించుకోవాల్సిన అస్తిత్వ అగాధ సత్రమది.