బాలల గేయం:- సత్యవాణి
చేయిా చేయిా కలిపి
చెమ్మచెక్క లాడదాం

ఒయ్యారి భామా అంటూ
ఒప్పుల కుప్ప తిరుగుదాం

స్నేహితా రావె రావె అంటూ
చింతపిక్కలాడుదాం

అక్కా చెల్లీ రావే అంటే
అష్టా చెమ్మలాడదాం


గుమ్మని అల్లరి చేయక
గెచ్చకాయలాడదాం

దాగుడు మూతలు ఆపి
దాడి ఆటలాడుదాం

పిల్లలార రారండీ
పచ్చీసును ఆడదాం

చెల్లెమ్మా ఇటు రావే
చింతపిక్కలాడదాం

గడబిడ చేయక రావే
గెచ్చకాయలాడదాం

పిలవగానె రావె చెల్లీ
పులి మేక లాడుదాం

చక్కగాను గుమి గూడి
గూటీ బిళ్ళలాడుదాం

కొమ్మ మీంచి దూకుదాం
కొమ్మచ్చులు ఆడుదాం

గుంపులుగాచేరుదాం
గోళీలను ఆడుదాం

చెడుగుడులూ ఆడుదాం
చెరువులలో ఈదుదాం

కలసి మెలసి తిరుగుదాం
కబాడీలు ఆడుదాం

అరచేతను బొంగరాలు
అందముగా త్రిప్పుదాం

చెరువు గట్లు చేలగట్ల
చక్కగాను నడుద్దాం

తోటలంట తోపులంట
తొలి ప్రొద్దునె సాగుదాం

వేసవి శలవులనన్నీ
వేడుకగా గడుపుదాం