అనపర్తి అనే గ్రామంలో అనసూయమ్మ అనే ఒక ఆమె కుమారుడు మారుతి. అనసూయమ్మ పండ్లనూ కూరగాయలనూ మారు బేరానికి అమ్ముకుంటూ వచ్చిన సొమ్ముతో కుమారుని ఆఊరి ప్రభుత్వపాఠశాలలో చదివిస్తూ జీవితం వెళ్ళ బుచ్చుతున్నది.
ఆమె రోజూ రాత్రులు కుమారునికి" నాయనా! మనం ఒంటరివారం, ఎవరైన అనిన్నుకానీ నన్నుకానీ ఏమన్నా అన్నాపట్టించుకోకు, మనం పేదలం, ఎవ్వరితో తగాదాలు తేకు.ఎవరేమన్నా మనశరీరానికి తగలవు, మనస్సుకు పట్టించుకోక బాగా చదువుకో నాయనా! చదువు వలన గుర్తింపువస్తుంది."అని చెప్పేది.
మారుతి కూడా అమ్మచెప్పిన మాటలు పాటిస్తూ బాగా చదువుకునేవాడు.
ఆతరగతిలో ఆఊర్లో పెద్ద ధనికులైన వారి బిడ్డలు ఉండేవారు.వారు మంచి దుస్తులు ధరించి వచ్చేవారు. పేదవాడైన మారుతి చొక్కా నిక్కరూ చూసి హేళనచేసేవారు.
"కుట్టను మరి చోటూలేదురా వాడి చొక్కాకు, నిక్కరు కూడా అంతే" అంటూ నవ్వేవారు.
అందరి ఎగతాళి మాటలూ వింటున్నా, విననట్లే ఉంటూ తరగతిలో మంచి మార్కులు సంపాదిస్తున్న మారుతిని చూసి పంతులు గారు సంతోషించేవారు.
ఎలాగైనా ఎగతాళి చేస్తున్న వారు మారి అంతా మంచి గా ఉండాలని భావించారాయన. తన విద్యార్థులంతా మంచి వారుగా ఉన్నపుడే పంతుళ్ళకు ఆనందం కలుగుతుందని ఆయన భావన.
ప్రతి ఏడాది లాగానే ఆయన ఆ ఉగాదికీ కొన్ని ఆటలపోటీలు పెట్టారు. ఎలాగైన అమారుతి అన్నిట్లో మొదటి వాడుగా వస్తాడనీ అప్పుడు అందరూ అతడి గొప్పదనం తెల్సుకుంటారనీ భావించారు .
పరుగుపందెం, చిత్రలేఖనం,పద్య పఠనం లాంటివి మరికొన్ని.ఆపందేలన్నింట్లో ఎవరికి ఎక్కువ బహుమతు లొస్తే వారికి కొత్త బట్టలు , తర్వాతి తరగతికి పుస్తకాలూ బహుమతిగా ఇస్తామని ప్రకటించారు.
ఆటలపోటీలరోజు రానే వచ్చింది. పందేలకు ఊరిపెద్దలను కూడా ఆహ్వానించారు పంతులుగారు.
కొన్ని పందాలయ్యాక పరుగుపందెం మొదలైంది.
బాగా ఎక్కువగా మారుతిని ఎగతాళి చేసే సాగర్ పరుగు తీస్తూ అమధ్యలో కాలు బెణికి పడిపోయాడు. అతనితోపాటు కలిసి మారుతిని ఎగతాళీ చేసే అతడు తన మంచి స్నేహితులని భావించే వారు సాగర్ పడటం చూసికూడా పరుగు ఆపకుండా వెళ్ళసాగారు. మారుతి మాత్రం ఆగి సాగర్ను లేపి పక్కన కూర్చోబెట్టి తిరిగి పరుగు తీసి అందరికంటే మొదటి వాడుగా వచ్చి, తిరిగి వెనక్కు పరుగుతీసి సాగర్ కు చేయి ఇచ్చి నడిపించుకుంటూ తెచ్చి చెట్టుక్రింద కూర్చోబెట్టి, పంతులు
గారిని అడిగి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో మందు తెచ్చి సాగర్ పాదాలకు మెల్లిగా రాయ సాగాడు. . అప్పుడు సాగర్ స్నేహితులు వచ్చి "ఏమైందిరా సాగర్ !" అంటూ పలకరించారు .సాగర్ కు ఎవరెవరో అర్థమై" నన్ను మన్నించరా! మారుతీ! నిన్ను అనేక విధాలుగా ఎగతాళి చేసినా నీవు నన్ను పట్టించుకుని సేవచేస్తున్నావు, నీమంచి తనం తెలుసుకోలేక పోయాను.ఇహ నుంచీ నీవే నా మొదటి మంచి స్నేహితుడివి." అంటూ మారుతిని ఆలింగనం చేసుకుంటున్న సాగర్ ను చూసి పంతులు గారు ఆనందించారు.
నీతి- సహనమే మన అసలైన ధనం.
సహనమే సరైన విత్తం.:- ఆదూరి.హైమావతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి