అప్పు నిప్పే:-- యామిజాల జగదీశ్

 నాకు పద్యాలపై ఏమాత్రమూ పట్టులేదు. స్కూల్లో వేమన పద్యాలైనాసరే ఒకటికి పదిసార్లు చదివితే తప్ప రాయలేకపోయేవాడిని. తెలుగు పరీక్షలో  పద్యం రాస్తే అయిదు మార్కులిస్తారనే కారణంగా కంఠస్థం చేయకతప్పలేదు. అందులోనూ తెలుగు మాస్టారు దగ్గరకు ట్యూషన్ వెళ్ళే వారితో ఏ పద్యం పరీక్షలో అడిగే అవకాశముందో తెలుసుకుని అది చదివేవాడిని. అసలు చదువుమీదే అంతంమాత్రం శ్రద్ధ ఉండేది. నేనెప్పుడూ సాదాసీదాబాపతుగాడినే చదువు విషయంలో. మా నాన్నగారు పద్యాలు రాయడం నేర్పిస్తానని కూర్చోపెట్టి నాతో ఓ పన్నెండు కంద పద్యాలు రాయించారు. అయితే ఆ పద్యాలేవీ ఇప్పుడు నా దగ్గరలేదు. ప్రేమకవితలమీదున్న శ్రద్ధ పద్యాలపైనో చదువుపైనో దృష్టి పెట్టలేదసలు. 
ఉద్యోగజీవితమూ ముగిసింది. ఆ తర్వాత ఎందుకో ఒకటి రెండు పద్యాల పుస్తకాలు చదివాను. చదువుతున్నప్పుడు అర్థం అయీ అవనట్లుండేది. పుస్తకం మూసి పక్కన పడేస్తే అస్సలు గుర్తుండదు అప్పటిదాకా ఏం చదివానో అని. 
నేను చదివిన రెండు పద్యాల పుస్తకాలలో ఏరిన ముత్యాలు అనే పుస్తకం ఒకటి. టి.వి.కె. సోమయాజులు గారు సాహిత్య సాగరంలో ఏరిన ముత్యాలు అంటూ ఓ పుస్తకాన్ని సంకలనపరిచారు. ఈ పుస్తకంలో అలనాటి పద్యాలు కొన్నీ, శ్లోకాలు కొన్నీ ఉన్నాయి. వాటి సందర్భమూ వాటిలోని భావాలనూ పొందుపరిచారు. కనుక ఈ పుస్తకం మీద ఆసక్తి పెరిగి చదవడం మొదలుపెట్టాను. 
నన్ను బాగా ఆకట్టుకున్న పద్యాలలో ఒకటి....
ఉత్పలమాల వృత్తంలోని పద్యమది.
మానిసి కేడు జానల ప్రమాణము దేహము, యాచనార్థమై 
పూనిన ఆరు జానలగు, పోయి ధనాఢ్యుని యిల్లు చేరగా
జానలు నాలుగౌ, నతని చల్లగ దేహి యటన్న రెండగున్
పైన నతండు నాస్తి యనినన్ వినినంతన శూన్యమయ్యెడిన్
ఈ నాలుగు పంక్తుల పద్య భావం....
మనిషి దేహం ఏడు జానల పొడవుంటుందట. యాచించడానికి సిద్ధపడటంతోనే ఆరు జానలవుతుందట. 
ధనవంతుడి ఇంటి ముందుకు చేరగానే నాలుగు జానలవుతుంది. ధనవంతుడిని "దేహీ" అని యాచించడంతోనే రెండు జానలవుతుంది. ధనవంతుడు "లేదు" అని చెప్పిన మాట వినడంతోనే యాచించిన వ్యక్తి దేహం శూన్యమైపోతుందట. 
ఈ పద్యం ద్వారా యాచించడంలోని దైన్యావస్థను కవి చక్కగా వర్ణించాడు.
ఆ కవి ఎవరైతేనేంగానీ బలే చెప్పాడు.  
నేను కొన్ని తప్పనిసరి పరిస్థితిలో అడుక్కోవలసిన స్థితి ఎదురై చెయ్యి చాచగా సాయపడిన వారున్నారు. లేదనలేదు. కానీ అడగవలసి వచ్చిన స్థితిలో సిగ్గుపడిన మాట వాస్తవం. కానీ పీకలదాకా మునిగాక ఇక సిగ్గేమిటీ అభిమానమేమిటీ అని అనుకుని అర్థించకతప్పలేదు. 
యాచనలోని స్థితి ఎంత దారుణమైందో తెలుసు. 
ఈ మధ్య తనికెళ్ళ భరణిగారి మాటలు విన్నానొక చోట. 
అప్పు నిప్పే అన్న ఆయన మాట నూటికి రెండు వందల పాళ్ళ నిజం.
కానీ అప్పులు చేసి బతుకుతున్న మా జీవితం కుంపటిమీదున్నట్టే ఉంది. తానుగా నిద్రపడితే పట్టినట్టు. శీతాకాలంలో ఆ "వేడి" మరింత దహిస్తోంది మనసుల్ని.
ఈ జీవితానికింతే.

కామెంట్‌లు