చద్దన్నం -కైతికాలు :---ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
రాత్రి మిగిలె అన్నమంత
గంజిలోన వేసి యుంచి 
పొద్దున్నే తిని చూడుడు 
ఎండలోన చేయు మంచి
వారెవ్వా చద్దన్నం 
వేసవి కాలం టిఫినుఇదే !

చింతకాయ పచ్చడితో 
నంజుకుంటే రుచిగాను 
నిమ్మకాయ ఊరగాయ
చద్దికూడు పుల్లగాను 
వారెవ్వా స్వర్గం 
చేతికి బెత్తెడు దూరం !

కొత్త ఆవకాయతోటి 
మత్తుగాను చద్ది బువ్వ 
ఎఱ్ఱెర్రని ఘాటుతోను 
దోసిట్లో పెట్టునవ్వ 
వారెవ్వ దోసిలి 
గంజి తాపు నెచ్చెలి !

దొడ్లో బావి దగ్గరనె 
పెద్ద గిన్నెలో చల్దిని 
అమ్మమ్మ పెట్టుతుందీ 
చుట్టూతను  కూర్చోమని
వారెవ్వా భలే పోటీ 
ఉదయపు చల్దులు మేటి!

పొలాల్లో చద్ది కూడు 
దబరనిండ తెచ్చినారు 
గోంగూర పచ్చడితోటి 
తాటిరేక పెట్టినారు 
వారెవ్వా నారేతలు 
పచ్చని పైరు నడుమబువ్వ!

తిని తాగి బ్రేవు మనిరీ 
కూలన్నలు శక్తి కలిగి 
మళ్ళీ పని మొదలు పెట్టు 
మధ్యాహ్నం వరకుసాగె 
వారెవ్వా సంస్కృతి 
పల్లెటూరు నుండి మొదలు!