అచ్చిరానిసఖ్యత:-డి.కె.చదువులబాబు.ప్రొద్దుటూరు.కడపజిల్లా.


 నందవరంలో నీటిఎద్దడి. ఊరంతటికీ ఒకేఒక్క బావి. అందులో నీళ్ళు బాగా లోతు ఉంటాయి.తోడడమూ కష్టం. ఊరంతా అక్కడే ఉంటే, పోటీ ఎక్కువై బాగా ఆలస్యం కూడా అయ్యేది. 

ఆఊళ్ళో నర్సమ్మ, సుబ్బమ్మల ఇళ్ళలో సొంత బావులున్నాయి. వాటిలో నీరు బాగా పైకిఉంటుంది.అయితే వాళ్ళిద్దరు కూడా పరోపకారగుణం లేనివాళ్ళు. రోజుకు ఒకరిద్దరికి పదేపదే అడిగితే తప్ప నీళ్ళిచ్చే వారు కాదు. ఆకారణంగానో ఏమో వారిద్దరూ మహాసఖ్యంగా ఉండేవారు.

ఆఏడాది వేసవికాలంలో ఆఊరికి కమల కొత్తగా కాపురానికొచ్చింది. నీటిసమస్యతో ఆఊరివాళ్ళు పడుతున్న కష్టాలు తెలుసుకుంది.పరిష్కారంగా ఒక ఉపాయం ఆలోచించింది.సాటిఆడవాళ్ళని పిలిచి, ఉపాయం చెప్పింది. 'లేనివాళ్ళు ఐక్యంగా ఉంటూ ఉన్నవాళ్ళను సఖ్యంగా ఉండనివ్వకపోతే అందరికీ మేలు జరుగుతుందన్నదే ఆమె ఉపాయం.' చెప్పుడు మాటలు విననివాళ్ళుండరుకదా! ఊళ్ళోని ఆడవాళ్ళు నర్సమ్మ, సుబ్బమ్మలకూ ఒకరిమీదఒకరికి లేనివిపోనివి చెప్పి, వారిమధ్య భేదాభిప్రాయాలు సృష్టించారు.

వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం మానేశారు. వారిమధ్య అన్నింటికీ పోటీలు కూడా ఏర్పడ్డాయి.సుబ్బమ్మకంటే మంచిదాన్ననిపించుకోవాలని నర్సమ్మ, నర్సమ్మకంటే మంచిదాన్ననిపించుకోవాలని సుబ్బమ్మా ఊరందరినీ తమతమ బావుల్లోనుంచి నీళ్ళను వాడుకోనివ్వసాగారు. ఉన్నవాళ్ళ సఖ్యత ఊరికి అచ్చిరాదని కమల అన్నమాటలు నిజమేనని ఊరంతా గ్రహించారు. ఏమైతేనేం ఆఊరివారికి నీటిసమస్య తీరింది.