కారుచిచ్చు "కోవిడ్!"(ఆటవెలది పద్యాలు):--గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు
నిండు జీవితాన నింపె విషాదము
కారుచిచ్చు వోలె కాల్చె మహిని
యెంత దారుణమది వింత కరోనాయె
తెలుసుకొమ్ము నిజము తెలుగుబాల!

కంటి మీద కునుకు కడు దూరమాయెను
కుమిలి కుమిలి జనము క్రుంగిపోయె
కనులు ముందు క్షణము కాళరాత్రి మిగిలె
తెలుసుకొమ్ము నిజము తెలుగుబాల!

ఆప్తులెల్ల వీడి యసువులు బాసిరి
వల్లకాడు నేడు వసుధ జూడ!
బావురమని గుండె బాదుకొనె పుడమి
తెలుసుకొమ్ము నిజము తెలుగుబాల!

కరుణ జూడు దేవ!! కాసింత  మనసుతో
సూక్ష్మజీవినంతు చూడు తండ్రి!!
తరిమి తరిమి కొట్టు మరణ కరోనాను
తెలుసుకొమ్ము నిజము తెలుగుబాల!