అప్పుడు !ఇప్పుడు !!:- శ్యామ్ కుమార్ , నిజామాబాద్
 ఈ కరోనా లాక్డౌన్ సమయంలో ఏం చేయాలో తోచక ఏం చేసినా కూడా సంతోషం అన్నది అంతలా లేనప్పుడు ,ఒకసారి నా చిన్నతనాన్ని గుర్తు చేసుకొని  నా బాల్య స్నేహితుల ను,  వారితో  నే  గడిపిన క్షణాలను వీడియో క్లిప్పింగ్స్ లాగా నా కళ్ళముందు కదులుతూ  ఉంటే ,ఎంత హాయిగా ఉందో మాటల్లో చెప్పలేను .
      సుధాకర్  కథ..!!>*
      -------------------------
 నేనప్పుడు తొమ్మిది,పాసయి పదవ తరగతి ప్రవేశించిన రోజులు.  ఇంటి ఎదురుగా ఉండే సుధాకర్ , కాస్త ఆటలు తగ్గించి విచిత్రమైన హాబీస్ లోకి వెళ్ళిపోయాడు.  వాడి ఇల్లు దాదాపుగా  అర ఎకరం భూమి లో ఉండేది. అందులో  వాళ్ళ అమ్మ కట్టెల మండి షాప్ నడిపేది. అందులో ,ఒక మూలనున్న రేకుల రూమ్ లోకి  తన పుస్తకాలు, ఆడుకునే ఆట వస్తువులు అన్నీ  పెట్టేసుకునేవాడు. పైగా దానికి తాళం వేసుకునే వాడు.  ఎక్కడ చూసి, ఎలా నేర్చుకున్నాడో కానీ, చిన్న రేడియో  సొంతంగా తయారు  చేశాడు. ఒక కార్డు మీద నాలుగు పరికరాలు మాత్రమే కనిపించేవి. ఆ విశాలమైన ప్రదేశంలో 50 గజాల  వైర్ కట్టాడు , యాంటెన్నా లాగ దానికి  కనెక్షన్ ఇచ్చాడు. 
బ్యాటరీ లేకుండానే ఆ రేడియో పనిచేసేది కానీ, దాని శబ్దం చాలా చిన్నగా వచ్చేది. అందుమూలంగా వాడు దాని పక్కనే పడుకొని, దగ్గరనుంచి ఆ పాటలు వినే వాడు. మాకు కూడా వినిపించేవాడు కానీ దాని పక్కనే పడుకొని  వినడం అన్నది  మాకు నచ్చేదికాదు సరికదా మాకు బోర్ కొట్టేది. నేను సుధాకర్ ఇద్దరము  బొమ్మలు వేసే వాళ్ళం. నేను ప్రకృతిపరమైన కళను చిత్రీకరించే వాణ్ని. వాడేమో సినిమా బొమ్మలు సినిమాకు చెందిన టైటిల్స్ ని వేసేవాడు.   ఆ రోజుల్లో సినిమా ఇంటర్వెల్ లో, రాబోయే చిత్రాలు ,అంటూ    బొమ్మలు  మరియు సినిమా పేర్లు  వేసేవారు. వాటిని చిన్న చిన్న అద్దాల మీద తయారు చేసి ఆ సినిమా థియేటర్ వాళ్ళకి సుధాకర్ అమ్మేవాడు. దాని మూలంగా వాడికి రెండు లాభాలు  వచ్చేవి  , డబ్బులు ఇచ్చేవారు,   పైగా సినిమా  వచ్చిన కొన్ని రోజుల తర్వాత జనాలు లేనప్పుడు వాడి కి సినిమా  ఫ్రీగా  , టికెట్ తీసుకోకుండా లోపలికి పంపించే  వారు. ఆ రోజుల్లో  వాడికి అది ఒక పెద్ద గర్వకారణం .మాకేమో అసూయ . ఆ సమయంలోనే వాళ్ల అమ్మగారి కట్టెల మండి లో కట్టెలు కొట్టి, రెండు మూడు రూపాయలు సంపాదించుకొనే వాడు ,ఆ పనిలో ఉన్నప్పుడు ఆటలకు రాకపోయే వాడు. తర్వాతి కాలంలో పెద్ద పెద్ద బోర్డ్స్ ను ఆఫీసులకి, దుకాణాలకు పెయింట్ చేసి డబ్బు సంపాదించాడు . వాడికి వచ్చిన ఆ  కళ ద్వారా పిడబ్ల్యుడి లో ఉద్యోగం  తెచ్చుకున్నాడు.  వచ్చిన రాబడి తో చాలా జాగ్రత్తగా పొదుపు చేస్తూ ఇల్లు ప్లాట్లు కొని జీవితంలోహాయిగా స్థిరపడ్డాడు.
కరుణాకర్ కథ>*
--------------------
  ఇక కర్ణాకర్ ఇంటికి వెళితే, వాళ్ళ నాన్నగారు మమ్మల్ని ప్రేమగా పలకరించి  ,కరుణాకర్ ని పిలిచి "పెదబాబు ! మీ గురించి స్నేహితులు వచ్చారు . చూడండి" అని చెప్పేవారు. ఆయన తన పిల్లల్ని  పెద్ద బాబు ,చిన్న బాబు అని పిలిచేవారు.  ఆయన విద్యాశాఖలో పెద్ద అధికారి. వారింట్లో పిల్లలను పిలిచే విధానం మరియు పలకరించే పద్ధతి మాకు విచిత్రంగా  అనిపించేది.  అప్పుడు ,  ఏదో ఒక రాజుల సినిమా చూసినట్టుగా ఉండేది.  నాకైతే ఈ విషయం చాలా అతిగా అనిపించేది .  వీలు కుదిరినప్పుడల్లా వాడిని ఈ విషయమై అందరం ఆటపట్టించినా   కూడా  ఏమీ అనేవాడు కాదు. ఏమీ మాట్లాడకుండా  ,  ముఖంలో ఎటువంటి ఫీలింగ్స్ లేకుండా ఉండేవాడు. తన భావోద్వేగాలను , కోపాన్ని అసలు చూపించే వాడే కాదు ..మాతో ఆడుకోవడానికి బయటికి వచ్చినప్పుడు వంట ఇంటి లోకి వెళ్లి వాళ్ళ అమ్మగారు ఇచ్చిన గ్లాస్ పాలు  తాగి,  చేతి రుమాలు తో మూతి తుడుచుకుంటూ బయటకు వచ్చేవాడు. మేం అది  గమనించి , నవ్వుతూ "మాకు తెలుసు నువ్వు పాలు తాగి వచ్చావ్ !!"అని   వెక్కిరించేవాళ్ళం. వాడి జేబులో చేతి   రుమాలు,దువ్వెన  ఉండేవి. వాడు అంత చిన్నప్పట్నుంచి కూడా స్టైల్ గా నీట్ గా ఉండే వాడు.  మాకు మాత్రం చెప్పులు కూడా  సరిగ్గా ఉండేవి కావు.  ఎప్పుడు చూసినా అరికాళ్ళలో తుమ్మ ముళ్ళు ,పెంకులు, గాజు సీసా ముక్కలు గుచ్చుకుంటూ ఉండేవి.
మేము  చాలా రఫ్ అండ్ టఫ్  గా ఉండేవాళ్ళం.  ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పుడే వాడు నేను డాక్టర్ చదువుతాను అని తన యొక్క జీవిత ఆశయాలు చెప్పేవాడు.  వాడు అనుకున్నట్టుగానే ఎంబిబిఎస్ చేసి తర్వాత  కంటి (ఐ )స్పెషలిస్ట్ గా మలేషియాలో సెటిల్అయ్యాడు. చిన్నతనంలోనే గమ్యాన్ని నిర్దేశించుకొని దాన్ని సాధించాలి  అనుకుంటే దాన్ని పొందడం  సాధ్యమే! అని మాకు అర్థమయింది.  చదువు పూర్తి అయిన తర్వాత తనకు కర్నూల్లో పరిచయమైన,భారతి అనే లేడీ డాక్టర్ ను పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ అమ్మాయి  వాడి తల్లిదండ్రుల కానీ ,చెల్లెలకు గాని ,తమ్ముడికి కానీ , నాకు గాని, అసలు నచ్చలేదు. కర్ణాకర్ సినిమా హీరో సుమన్ ,లాగా చాలా అందంగా ఉండేవాడు. పైగా చిత్రకళ, సంగీతం, రచనలు కవిత్వం వీటన్నిటిలో కాస్తోకూస్తో ప్రవేశం ఉండేది. బాహ్య సౌందర్యం కంటే  అంతః, సౌందర్యం ముఖ్యం అని మాకు నచ్చజెప్పాడు. ఆ రోజుల్లో ఇది చాలా ముఖ్యమైన టాపిక్ గా ఉండేది. నేను కూడా పుస్తకాల్లో కథల్లో  చదివాను. సరే! ఇది కరెక్టేనేమో, కావచ్చునేమో? సరే నీ ఖర్మ అని ఊరుకున్నాను. 
 కాలక్రమేణా వాడు తన తల్లిదండ్రులతో, తమ్ముడు చెల్లెళ్లతో సంబంధబాంధవ్యాలు తగ్గించేశాడు. మేము ఇంటికి వెళ్ళినా    వాడు మనస్ఫూర్తిగా మాట్లాడలేక  పోయేవాడు .కొద్దిసేపు మాట్లాడి తర్వాత  మేము ఎప్పుడు వెళ్ళిపోతామా
అని  ఎదురు,చూసేవాడు. ఆ కొద్ది  సేపటిలోనే వాడికి లోపల్నుంచి  భార్య ద్వారా  పిలుపులు వచ్చేవి.  వాడి అమ్మానాన్నలు కూడా 
కోడలు చేసే అమర్యాదలు భరించలేక రావడం మానేశారు .దాదాపు రెండు  దశాబ్దాలుగా మాతో వాడికి   సంబంధాలు లేకుండా పోయాయి.  తర్వాత మాకు తెలిసింది ఏమిటంటే ఇద్దరు పిల్లలు అయిన తర్వాత ఆ భార్యకు విడాకులు ఇచ్చి మలేషియాలో ఉన్న ఒక  నర్సు ను వివాహం చేసుకుని జీవితాన్ని   గడుపుతున్నాడు అని.
                     ***
     శర్మ కథ..!!>*
     -----------------
ఇక శర్మ ఇంటికి వెళితే,   వాడి  పెద్దన్నయ్య ప్రసాద్ రావు గారు , మా స్కూల్ లోనే టీచర్ గా ఉండే వారు,  చూసి చూడంగానే "ఏరా ?   ఆటలు మొద లా?  చదువు సంధ్యలు అంతంతమాత్రమే, ఆటల్లో మాత్రం ఫస్టు ".  అంతే ! ఇంకేముంది , మేము  ఎందుకు  వచ్చామురా బాబూ?   ...,  ఎందుకు వచ్చిన  గొడవ!! , అని    పారి పోయేవాల్లం . అక్కడ  నుండి బయటకు వచ్చి దూరంగా   కూర్చొని, ఎదురు     చూసేవాల్లం,  కాసేపటికి వాడు మెల్లిగా దొంగ  లాగా బయటికి వచ్చి మాతో  కలిసేవాడు. శర్మకు చిన్నప్పుడే వాళ్ళ నాన్నగారు పోయినందున వాళ్ళ అన్నయ్య అన్నీ చూసుకునేవారు . ఎనిమిది మంది సహోదరుల మధ్యన  వీడు ఆఖరివాడు.  అన్నదమ్ముల లో  అందరికంటే చిన్నవాడైనందుకు ,అందరి అజమాయిషీని భరించి  భరించి, బహుశా జీవితంలో స్వేచ్ఛను బాగా కోరుకునే వాడేమో? ప్రభుత్వ ఉద్యోగం దొరకగానే తన పెద్ద వారి పాత్ర లేకుండా సొంతంగా వివాహం చేసుకున్నాడు.  వాడిని పెంచిన అన్నయ్యలు వదినలు చాలా బాధపడి   ఊరుకున్నారు.  వాళ్ల అందరితో సంబంధాలు లేకుండా చేసుకున్నాడు.  కానీ  15 సంవత్సరాల తర్వాత  భార్యతో మనస్పర్థలు వచ్చి,  ఏకాకిగా 20 సంవత్సరాలు జీవించి ఈ మధ్యనే మళ్లీ భార్య పిల్లలతో కలిసి జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ మధ్య నేను కలిసినప్పుడు గమనించాను కాస్త మతిస్థిమితం కోల్పోయినట్టుగా కూడా మాట్లాడాడు.
    రాజేందర్ రెడ్డి కథ..!!>*
    ------------------------------
ఇకపోతే  రాజేందర్ రెడ్డి విషయానికి వస్తే మేము ఎప్పుడు  ఆటలకు రమ్మని పిలవడానికి వెళ్ళినా వాడు బయటకి వచ్చి  భయంతో కళ్ళు పెద్దవి చేసి చిన్నగా గుసగుసలాడుతూ  "ఒరేయ్ !మా నాన్న ఉన్నారు !!వెళ్ళిపొండి  ,నేను చదువుకోవాలి" అని చెప్పి లోపలికి పరిగెత్తే  వాడు .  అప్పుడు మేమందరం ఒకరి ముఖాలు ఒకరం
 చూసుకుని ,  విషయం అర్థం కాక,  సరే పోనీ ,అని వేరే స్నేహితుల దగ్గరికి వెళ్లి పోయే వాళ్ళం. అప్పుడప్పుడు వచ్చే వాడు కానీ  ఎప్పుడు   వస్తాడో  ఎప్పుడు రాడో మాకు అర్థం కాక పోయేది.   ఆ విధమైన క్రమశిక్షణ, చదువు మీద ఎక్కువ దృష్టి అన్నవి   వాడిని తర్వాత సింగరేణి కాలరీస్ జనరల్ మేనేజర్ ను చేసింది. వాడికి తగిన అమ్మాయి ని వివాహం చేసుకొని, ప్రస్తుతం కూతురు మనవళ్లతో హాయిగా ఉన్నాడు. 
బాల్యంలో అందరూ సమానంగా హాయిగా సంతోషం పంచుకొని, ఎక్కడలేని ఆనందంతో గడిపాం  కానీ   మేము పెద్దయిన తర్వాత మా స్వయం నిర్ణయాల  వల్ల జీవితం అన్నది తలా ఓ దిక్కు కి వెళ్ళిపోయింది.  వాటి వల్ల జరిగిన కష్ట-నష్టాలు మన స్వయంకృతాపరాధమా లేక  విధి  లిఖిత మా?  ఏమో ..!!
                       ***
      .