సూరీడు బెదిరింపులు మణిపూసలు :--ఎం.వి. ఉమాదేవి నెల్లూరు
ఎండ మండి పోతున్నది 
వెలుతురేమొ బాగున్నది 
సూరీడువి బెదిరింపులు 
లోకం భయ పడుతున్నది !

వేకువనే చల్ల గాలి 
అంతలోనె వేడి మసలి 
పక్షులన్ని హడావుడిగ 
మేత కొరకు గూడు వదలి !

 గృహిణి లేచి పని తొందర
నీళ్ళు పట్టు పని ముందర 
వచ్చి పోవు కరెంటుతో 
ప్రతినిమిషము అతి విసుగుర!

కూరల ధర ఆకాశము 
పాలు పెరుగు అతి ముఖ్యము 
చల్లని నీరు త్రాగినా 
తీరలేదు ఈ దాహము !

 చెమటపోసి ఆరి ఆరి 
దురదలొచ్చి గీరి గీరి 
చెమటకాయ మేని తరువు 
గంధపుపొడి నూరి నూరి !

ఆవకాయ సందడిగా 
వడియాలను ముందరగా 
ఉప్పుమిర్చి మరచిపోకు 
వానల్లో సాయంగా !

సూర్యశక్తి బహుగొప్పది 
 క్రిములచేయు నాశనమిది 
వాడుకొనుట ఎంత మేలు 
కులవృత్తుల చేయూతిది !

 రజకులకీ పనికాలము 
రైతుకి పరీక్ష కాలము 
కుమ్మరి చేతిన ఆవము 
కమ్మరి మరమ్మతు విధము !

అగ్ని వస్తువుల భద్రత 
పప్పు దినుసులకు శుభ్రత 
వేసవిలో జాగ్రత్తలు 
మల్లెలు,ముంజలు లభ్యత !

ఋతువులు మనకే సాయము 
సాగుతూ వ్యవసాయము 
సూరీడును వాడుకొనుట 
మనిషికి ఎంత ఉపాయము !

విద్యుత్తును తానిచ్చును 
విద్వత్తును బహు పంచును 
ప్రకృతిలో పరిపూర్ణతయె 
భానుడు తానే ఇచ్చును !

నమస్సులు రవి వెలుగులకు 
ఉషస్సులు కవి భావనకు 
సమస్త విశ్వమూలముకు 
తేజస్సులు రవి శశిలకు !


కామెంట్‌లు