ఉండీ ఉపయోగం ఏమిటి? (బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼ దార్ల బుజ్జిబాబు

       ఒక ఒంటె ఉండేది.
       అది అడివంతా తిరిగి తినేది.
       ఒక్క పని చేసేది కాదు. 
       తినటం తిరగటమే దాని పని.
       “పేద వారి కోసం చందాలు సేకరిస్తున్నాము వస్తావా?” అని అడిగింది  ఒకరోజు గాడిద.
        "నేను రాను పో" అంది ఒంటె.
        మరో రోజు " సత్రం కుడుతున్నాం ఓ చేయి వేద్దువు రా" అని అడిగింది ఎలుగు బంటి.
        "నాకేం పని" అంది ఒంటె.
       ఇంకొక రోజు "పంట చేలకు కాల్వలు తవ్వుతున్నాము.  నీవంతు సాయం చేయరాదు" అడిగింది కోతి. 
       "నా చేతకాదు పో" అంది ఒంటె.
        “ఒంటె మామా! ఊరికి పోతున్నా. మా ఇంటి వైపు ఓ కన్నేసు ఉంచు” అడిగింది పక్కింటి కుందేలు ఒక రోజు.
        “నేనేమన్నా నీ జీతగాడినా? నీ ఇంటికి
కాపలా ఉండడానికి" అని ఒంటి కాలుతో లేచింది కుందేలు మీదకు ఒంటె. 
        ఇలా ఉండగా, ఒంటెకు జబ్బు చేసింది. 
జబ్బు తగ్గించమని దేవుడిని వేడుకుంది.    
       దేవుడు కలలో కనిపించాడు.
       “నీవు ఉండి ఉపయోగం ఏమిటి? 
       నీకు చావే సరి అయిన శిక్ష" అన్నాడు.
       ఒంటె  నిద్ర నుండి మెల్కొంది. 
       కల అర్ధం తెలుసుకుంది. 
       ఆ రోజు నుంచి పరుల కోసం పాటు
పడింది.