కర్త ..కర్మ ..క్రియ ..!!:-------శ్యామ్ కుమార్, నిజామాబాద్.

 మనందరికీ చిన్నతనంలో మనతో గడిపిన స్నేహితులు ,అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైతేనేం ,చాలా ముఖ్యమైన వారు. వారందరూ వారి వారి స్వభావాలతో, ఆటలతో పాటలతో  ఎన్నో సంఘటనలతో  మన బాల్యాన్ని చాలా మధురంగా తయారు చేశారు.  కొందరు ఇప్పటికీ కలుస్తుంటారు కొందరేమో ఎటో మాయమైపోయారు.  బాల్యంలో వారి పాత్ర మన జీవితంలో అమోఘమైనది.  కూర్చొని ఆలోచిస్తుంటే  ఆ సంఘటనలన్నీ మన కళ్ళముందు ఇప్పుడే జరిగినట్టుగా కనబడుతుంటాయి. అవి ఎంత అద్భుతంగా ఉంటాయి అంటే వాటిని ఎవరు కూడా మళ్ళీ అంత అందంగా ,మధురంగా చిత్రీకరించలేరు  అన్నది నిజం. అలాంటి  సంఘటనలు నాకూ గుర్తు వున్నాయి. 
ఒక చేత్తో నా ముక్కు పట్టుకుని  రెండో చేత్తో ఫట్ అంటూ నా చెంపమీద కొట్టింది స్వరూప.  ఆమె కళ్ళల్లో ముఖంలో నవ్వు. క్లాసు అందరి నవ్వులతో నిండిపోయింది.  నా   మొహం లో అవమానం   రోషం.    అది నేను గర్ల్స్ హైస్కూల్ లో  అయిదవ తరగతి చదువుతున్న రోజులు.  తెలుగు గ్రామర్ లో సరైన సమాధానం  చెప్పనందుకు మా బుచ్చమ్మ టీచర్ నాకు వేసిన శిక్ష అది.  నాకు చాలా   వు క్రోశం కోపం కలిగాయి  కానీ ఏం చేయను?    స్కూల్ అయిపోయిన తర్వాత మళ్లీ ఆ స్వరూప నా దగ్గరికి వచ్చి, నాకు సారీ చెప్పి, బతిమిలాడింది. నాకు తెలుసు ఇప్పుడు సారీ చెప్పింది కానీ మళ్ళీ టీచర్ చెప్తే మళ్ళీ నన్ను కొడుతుందని .   కానీ ఏం చేయను? నాకు   తెలుగు  గ్రామర్ అంటే అస్సలు అర్థం  అయ్యి చచ్చేది కాదు.  అసలు   మొట్ట   మొదటగా కర్త-కర్మ-క్రియ అంటేనే... తెలిసేది కాదు. మా తరగతిలో ఉన్న అందరు అమ్మాయిలు చాలా అలవోకగా సమాధానం చెప్పేవారు. నాకు మాత్రం  బ్రహ్మ పదార్థం కిందే లెక్క.  ఆఖరికి ఆ తెలుగు గ్రామర్ కు భయపడి ఇంటర్లో తెలుగు లేదా హిందీ  సెకండ్ లాంగ్వేజ్ గా  సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు, నేను హిందీ నే  తీసుకున్నాను.
 నేను చదివిన గర్ల్స్ హై స్కూల్ లో ఐదవ తరగతి వరకు అబ్బాయిలు అమ్మాయిలు కలిసి చదివారు. అయితే మామూలుగా ఐదవ తరగతి వచ్చే వరకు అబ్బాయిలు అందరూ బాయ్స్ హై స్కూల్ కు మారి పోయేవారు. కానీ మా కుటుంబంతో హెడ్ మిస్సెస్ కు ఉన్న  స్నేహ సంబంధాల మూలంగా నన్ను ఐదవ తరగతి నుండి వెళ్లనివ్వకుండా గర్ల్స్ హై స్కూల్ లోనే  ఉంచి వేశారు. మొదట్లో నాకు కూడా అదే స్కూల్లో చదవడం కంటిన్యూ చేయడం సంతోషంగా ఉండేది.  కొద్ది రోజుల్లోనే నాకు అర్థం అయింది అందులో ఉన్న బాధ ఏంటో. అందరూ అమ్మాయిలే! ఇద్దరు  అబ్బాయిలం మాత్రమే ఉండేవాళ్ళం!!.  ఆటల్లో, గేమ్స్లో దేనితోనూ అమ్మాయిలు మమ్మల్ని చేరనిచ్చేవారు కాదు. క్లాసులో టీచర్ ఎప్పుడైనా  శిక్ష విధిస్తే దాన్ని నా  మీద అమలు చేయడానికి చాలా  ఆనందించే వాళ్ళు.   ఇక కబడ్డీ విషయంలో ఎక్కువ కండిషన్స్ ఉండేవి.  ఆటలో  కాళ్ళు పట్టుకోవద్దనే వారు. నేను అనుకునే వాడిని "'అయినా కాళ్లు పట్టకుండా కబడ్డీ ఎలా ఆడతారు?  అసలు!! "అని.   రోజులు గడిచే కొద్ది నాకు వంటరితనం  గా   అనిపించడం మొదలుపెట్టింది.  నేను తరచుగా మా ఇంట్లో మా నానమ్మ  తో చెప్పేవాణ్ని ,నాకు గర్ల్స్ హై స్కూల్ వద్దు, బాయ్స్ హై స్కూల్,  అంటే మా బాబాయ్ పనిచేసే స్కూల్ అన్నమాట ,అందులోకి మార్చమని. పైగా అందరూ స్నేహితులు నన్ను ఆటపట్టించేవారు "ఒరేయ్ వీడు గర్ల్స్ హై స్కూల్ లో చదువుతున్నాడు రా" అని. మిగిలిన స్నేహితులందరూ" కి కి కి  "  అనీ నవ్వేవారు.
 ఒకసారి స్కూల్ డే కి పాటల పోటీ పెట్టారు దానికి మా బాబాయి ని జడ్జి గా పిలిచారు. మా ఇంటి పక్కన ఉన్న కుటుంబాని కి దగ్గరి బంధువైన రజియా అనే అమ్మాయి పాడటం మొదలు పెట్టింది . ఆ అమ్మాయి మా అందరికీ తెలుసు .పాట బ్రహ్మాండంగా  పాడింది.  మా బాబాయి కూడా  ఆ  అమ్మాయికి తెలుసు ,కనుక ఆ అమ్మాయి తెగ పడి పోయి,  పాడుతున్న పాట మధ్యలో  సిగ్గుతో ఆపేసి వెళ్ళిపోయింది. ఆ పాటల పోటీలో అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్  ఇచ్చారు. ఆఖరు లో మా బాబాయి లేచి ,  మైక్ తీసుకొని సభ్యులందరినీ ఉద్దేశించి మాట్లాడారు.  "మీరంతా ఆశ్చర్య పోతూ ఉండవచ్చు, ఇదేంటి ?సగం పాడిన అమ్మాయికి  ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు!!"అని.
 సభికులందరూ అవునంటూ నవ్వుతూ చప్పట్లు కొట్టారు. అప్పుడు మా  బాబాయి ఇలా చెప్పారు "పాట ఎలా  పాడింది ,స్వరం ఎలా ఉంది, లయ  శృతి ఎలా ఉంది? అన్నది ముఖ్యం .పాట పూర్తిగా   పాడిందా లేదా, చాలా పెద్ద పాట పాడిందా, చిన్న పాట పాడిందా? అన్నది కాదు ఇక్కడ మేము చూసింది "  అంతే ,అందరూ చప్పట్లు కొట్టారు. అప్పుడు నేను అనుకున్నాను మా బాబాయి చాలా తెలివైనవారు అని.
 మా స్కూల్కు కరెక్టుగా గేటు ఎదురుగా  ప్రభుత్వ గ్రంథాలయం ఉండేది.    అందులో అన్ని కుర్చీలకు ఎదురుగా ఉన్న  టేబుల్స్ మీద వరుసగా అప్పుడే వచ్చిన పత్రికలు పెట్టి ఉండేవి.  మాకు ముఖ్యంగా చందమామ, బాలమిత్ర రెండూ, ప్రాణం. వాటి గురించి సరిగ్గా ఆ సమయానికి  మేము వెళ్లి గేటు దగ్గర కూర్చునేవాళ్ళం.  చంద్రయ్య  అనబడే ఉద్యోగి వచ్చి తాళం తీయగానే లోపలికి పరిగెత్తే  వాళ్ళం.  ఆ చంద్రయ్య ఇప్పటికీ గుర్తుకు వున్నాడు.  నలుపు రంగులో, రింగు జుట్టు  తో,  నోట్లో ఎప్పుడూ తమలపాకు పెట్టుకుని వుండేవారు. చందమామ బాలమిత్ర ఎక్కడున్నాయో చాలా వేగంగా గమనించి ఒక్క గెంతు గెంతి ఆ కుర్చీలో పుస్తకం పట్టుకొనే వాళ్ళం.  ఎందుకంటే ఎవరు ముందు పట్టుకుంటే అది వాళ్ళదే.   ఆ చందమామ బాలమిత్ర   పట్టుకుంటే ఎంత ఆనందంగా ఉండేదో?   దానిని ఏక బిగిన  చదివేసి ,    పూర్తిగా బొమ్మలు చూసేసి ప్రతి కథను  ఆనందించి బయటపడితే గాని మనసు పట్టేది కాదు. ఆ గ్రంథాలయంలో నేను చదివిన తర్వాత ఆ పుస్తకాన్ని  కింద పెట్టకుండా  చదువుతున్నట్లు నటిస్తూ ఇంకా వేరే ,మనకు కావాల్సిన పుస్తకం చదువుతున్న వారు, అది పూర్తి చేశాక   మార్చు కునేవాళ్ళం.  అదన్నమాట మా తెలివి.  పైగా అప్పుడే, అంటే  ఏడవ తరగతి  చదువుతున్నప్పుడే మేము యద్దనపూడి సులోచన రాణి కోడూరి కౌసల్యాదేవి రంగనాయకమ్మ నవలలు చదివేవాళ్ళం. ఆ రోజుల్లో అబ్బాయిల కంటే ఎక్కువగా అమ్మాయిలు పుస్తకాలు  చదివే వారు. ఎవరైనా తెలిసిన అమ్మాయిల దగ్గర 
ఇటువంటి    పుస్తకాలు ఉన్నాయి అని తెలిస్తే,  మా   నవలలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ పుస్తకాలు తెచ్చుకొని  మేము చదివేసే వాళ్ళం. మనకు తెలిసిన అమ్మాయి అయితే సరే! మరి తెలియని అమ్మాయి దగ్గర నుంచి ఎలా తీసుకోవడం? దానికి నేను కర్ణాకర్ కలిసి కొత్త  ప్రణాళిక  వేసాము. మేము మా చేతుల్లో  ఒక పెద్ద నవల పట్టుకొని ఆ అమ్మాయి ఇంటి చుట్టూ సాయంకాలం  సమయంలో తిరిగే వాళ్ళం. ఆ అమ్మాయిలు మా చేతిలో ఉన్న పుస్తకాల వైపు ఆశగా చూసే వాళ్ళు. మేము అది గమనించి నట్టుగా చూసి "ఏంటి 
 చదువుతారా ?,  కావాలా? అని అడిగే వాళ్ళం. వాళ్లు కావాలని అడగ్గానే వెంటనే  ఇచ్చే  వాళ్ళం. ఇంకేముంది మా పని సులువు.  వారి దగ్గరున్న పుస్తకాలన్నీ   తీసేసుకొని చదివితే గాని, మనసు కు  శాంతి  వుండేది కాదు.  వర్షం పడుతూ ఉంటే ఇంట్లో వేయించిన పల్లీలు, గింజలు, శెనగలు, పప్పులు తింటూ  కిటికీలో కూర్చొని, ఆ నవలను  చదివేసే వాళ్ళము. వర్షం సమయంలో  చదువుతూ ఉంటే ఇంకా హాయిగా  ఉండేది. కొమ్మూరి సాంబశివరావు, మధుబాబు పుస్తకాలు అయితే లెక్కలేదు. అలా చదివి చదివి పుస్తకాలు చదవడం ఎంత వేగంగా చేసేవాళ్ళం  అంటే,  ఎంత పెద్ద నవల అయినా ఒక గంటలో అయిపోయేది. స్కూల్లో అన్నిట ఫస్ట్ ఉండే వాళ్ళం కాబట్టి మమ్మల్ని మా పెద్దవాళ్ళు పెద్దగా పట్టించుకునేవారు కాదు.  ఆ పుస్తకం చదువుతూ మేము అలాగే హీరోలాగా అయిపోవాలని కలలు కనే 
వాళ్ళం.  ఇక  హీరోయిన్ ఎలా ఉండాలి, ఎవరు సూటవుతుంధో అని     చూసుకుంటూ ఉండే వాళ్ళం !!. యద్దనపూడి కథల్లోని హీరో రాజశేఖర్ లాగా రింగు రింగుల జుట్టు  దువ్వుకునేవాళ్ళం!. అప్పటి కథలో హీరో నడిపే     మోరీస్ మైనర్, ఇన్పాల, సిట్రాన్  కార్లు నేను నడపాలని, కొనుక్కోవాలని కలలుగనే వాడిని!!!. 
 కొన్నాళ్ళ తర్వాత నేను గర్ల్స్ హై స్కూల్ నుంచి టి సి తీసుకొని బాయ్స్ హై స్కూల్ కి వెళ్ళిపోయాను.  అయినా సరే  ఆ తర్వాత కూడా  గర్ల్స్ హై స్కూల్ అమ్మాయిలందరూ చాలా స్నేహంగా ఉండే వాళ్ళు.  ఎందుకంటే వాళ్లు నన్ను  చాలా సంవత్సరాల నుంచిచూశారు కదా?   నేనంటే వాళ్లకుఎటువంటి భయము సంకోచం .. లేకుండాఉండేది.  అక్కడే  అసలు  ప్రాబ్లమ్స్ మొదలు  అయ్యాయి.   ఆ  అమ్మాయిలతో,  పైగా కాలేజీ అబ్బాయిలతో నేను అస్సలు ఊహించని  తలనొప్పులు మొదలయ్యాయి. అవన్నీ  చిత్రవిచిత్రాలు తో గమ్మత్తులు తో కూడినవి.